IPL - 10
-
ఐపీఎల్‌ను టీవీల్లో కూడా చూడటం లేదు: పుజారా
రాజ్‌కోట్: దేశమంతా క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ఫీవర్‌లో ఉండగా టెస్టు క్రికెటర్ పుజారా మాత్రం ఐపీఎల్‌ను టీవీలో కూడా చూడడం లేదని చెబుతున్నాడు. వేలంలో పుజారాను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయని విషయం తెలిసిందే. ‘ప్రాక్టీస్ లేకుంటే ఫిట్నెస్ శిక్షణతో రోజంతా గడిచిపోతుంది. 24 గంటలు క్రికెట్‌కే అంకితం కాలేము. సాయంత్రాలు కుటుం బం... లేకపోతే స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాను. అందుకే టీవీలో ఐపీఎల్ చూడలేకపోతున్నాను’ అని పుజారా తెలిపాడు. -
నా సెంచరీ ఆయన చలువే: సంజూ సామ్సన్
ఐపీఎల్ పదో సీజన్లో తొలి సెంచరీ నమోదుచేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు సంజూ సామ్సన్.. తన శతకం క్రెడిట్ రాహుల్ ద్రవిడ్‌కే దక్కుతుందన్నాడు. పుణెతో జరిగిన మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ యాడం జంపా బౌలింగ్‌లో సిక్సర్ బాది సెంచరీ చేసిన సంజూ.. స్కోరు వేగం పెంచే క్రమంలో ఆ వెంటనే ఔటయ్యాడు. అయితే, అతని తర్వాత వచ్చిన క్రిస్ మోరిస్ తుఫాన్‌లా చెలరేగి.. తొమ్మిది బంతుల్లోనే అజేయంగా 38 పరుగులు చేయడంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 205 పరుగులు చేసింది. మ్యాచ్ అనంతరం సంజూ మాట్లాడుతూ భారత లెజండరీ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నప్పటి నుంచి ద్రవిడ్‌తో సంజూకు అనుబంధం ఉంది. ఆ జట్టులోని యువ ఆటగాళ్ల నైపుణ్యానికి మెరుగులు దిద్దడంలో ద్రవిడ్ కీలక పాత్ర పోషించాడు. ’ద్రవిడ్ సర్ ఆశీస్సులు పొందడం నేను అదృష్టంగా భావిస్తున్నా’ అని సంజూ చెప్పాడు. తన సెంచరీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం ఆనందం కలిగించిందని తెలిపాడు. గతంలో భారత అండర్ 19 జట్టుకు సేవలు అందించిన రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. కానీ రాహుల్ మార్గనిర్దేశకత్వంలో సంజూ సెంచరీ చేయడం.. ఆ జట్టు అంచనాలకు మించి రాణిస్తుండటంతో త్వరలో పరిస్థితి తారుమారు కావొచ్చునని భావిస్తున్నారు. -
సెంచరీ వీరుడికి వీరతాళ్లు!
ఐపీఎల్ పదో సీజన్లో తొలి సెంచరీతో వీరవిహారం చేసిన యువ బ్యాట్స్‌మన్ సంజూ సామ్సన్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు సంజూను సీనియర్ క్రికెటర్లు ఘనంగా కొనియాడారు. ఐపీఎల్ చరిత్రలోనే తొలి సెంచరీ నమోదు చేసిన బ్రాండన్ మెక్కల్లమ్ సంజూను ప్రశంసలతో ఆకాశానికెత్తాడు. ’సంజూ క్రికెట్ ఆడుతుంటే చూడటం నాకు ఇష్టం. అతనిది అద్భుతమైన ప్రతిభ’ అని మెక్కల్లమ్ ట్వీట్ చేశాడు. 2008లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన మెక్కల్లమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సుడిగాలిలా చెలరేగి.. 73 బంతుల్లో 158 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలోనే తొలి సెంచరీగా ఈ తుఫాన్ ఇన్నింగ్స్ మిగిలిపోయింది. ఇక తాజా పుణె మ్యాచ్‌లో 62 బంతుల్లో శతకం (102) కొట్టిన 22 ఏళ్ల సంజూ ఐపీఎల్లో అతి పిన్నవయస్సులో సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు 2009లో మనీష్ పాండే 19 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్లో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. వీరోచితమైన ఆటతీరు ప్రదర్శించిన సంజూపై బ్రాండన్ మెక్కల్లమ్తోపాటు టాప్ స్పిన్నర్ అశ్విన్ రవిచంద్రన్, కామెంటేటర్ హర్షభోగ్లే తదితరులు ప్రశంసలతో ముంతెత్తారు. సంజూ గొప్పగా ఆడాడని, అతని ఆడుతుండటం చూసి చాలా ఆనందం కలిగిందని కొనియాడారు. I love watching Sanju Samson play cricket! Hes some talent! — Brendon McCullum (@Bazmccullum) 11 April 2017 Sanju's indifferent year just took a big UU turn. Special Innings. #IPL2017 #RPSvDD — Ashwin Ravichandran (@ashwinravi99) 11 April 2017 -
రైజింగ్ పుణేపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయం
-
సాహో సామ్సన్
-
సాహో సామ్సన్
⇒ 63 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 102 ⇒ క్రిస్ మోరిస్ మెరుపులు ⇒ రైజింగ్ పుణేపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఘనవిజయం తొలి మ్యాచ్‌లో దాదాపు విజయం అంచుల దాకా చేరి నిరాశ పడినా.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఢిల్లీ ‘డేర్‌డెవిల్స్’ ఆట చూపింది. యువ బ్యాట్స్‌మన్ సంజూ సామ్సన్ చాలా రోజుల తర్వాత అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ తొమ్మిది బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి ఐదేళ్ల తర్వాత ఢిల్లీ జట్టు 200 పరుగుల మార్కును దాటించేలా చేశాడు. అటు జహీర్ ఖాన్, అమిత్ మిశ్రాల బౌలింగ్ ధాటికి రహానే నేతృత్వంలో బరిలోకి దిగిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 108 పరుగులకే కుప్పకూలి ఘోరంగా ఓడింది. పుణే: ఐపీఎల్ పదో సీజన్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (డీడీ) జట్టు దమ్మున్న ఆటను ప్రదర్శించింది. యువ బ్యాట్స్‌మన్ సంజూ సామ్సన్ (63 బంతుల్లో 102; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సూపర్ సెంచరీకి తోడు ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ (9 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు తోడవ్వడంతో డీడీ విజయాల బోణీ చేసింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌పై 97 పరుగుల తేడాతో ఢిల్లీ నెగ్గింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు చేసింది. రిషభ్ పంత్ (22 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్సర్లు), బిల్లింగ్స్ (17 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. దీపక్ చహర్, తాహిర్, జంపాలకు ఒక్కో వికెట్ దక్కింది. అనంతరం భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన పుణే జట్టును ఢిల్లీ బౌలర్లు దారుణంగా దెబ్బతీయడంతో 16.1 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్మిత్ కడుపునొప్పితో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాగా జట్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. మయాంక్ చేసిన 20 పరుగులే పుణే ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. జహీర్, స్పిన్నర్ మిశ్రాలకు మూడేసి, కమిన్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. సామ్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సామ్సన్ శతకం... తమ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండు పరుగులే చేసిన ఢిల్లీకి రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఆదిత్య తారే పరుగులేమీ చేయకుండానే దీపక్ చహర్ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత డీడీ ఇన్నింగ్స్‌ను మరో ఓపెనర్ బిల్లింగ్స్, సంజూ సామ్సన్ పట్టాలెక్కించారు. వరుసగా రెండు ఫోర్లతో పరుగుల ఖాతా తెరిచిన సామ్సన్ మూడో ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లు బాది జోరును ప్రదర్శించాడు. అటు బిల్లింగ్స్ కూడా తన బ్యాట్‌కు పనిచెబుతూ ఆరో ఓవర్లో మూడు ఫోర్లతో చెలరేగడంతో పవర్‌ప్లేలో జట్టు 62 పరుగులు సాధించింది. కానీ మరోసారి ఇమ్రాన్ తాహిర్ తన మేజిక్ ప్రదర్శించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని విడదీశాడు. బిల్లింగ్స్ (17 బంతుల్లో 24; 4 ఫోర్లు)ను బౌల్డ్ చేయడంతో రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే సామ్సన్‌కు రిషభ్ పంత్ (22 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్సర్లు) తోడవ్వడంతో పరుగుల వేగం తగ్గలేదు. 12వ ఓవర్లో ఇన్నింగ్స్‌లో తొలి సిక్సర్‌ను పంత్ సాధించాడు. అయితే మరో నాలుగు ఓవర్ల అనంతరం పంత్ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. 41 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన సామ్సన్ ఆ తర్వాత ఒక్కసారిగా బ్యాట్‌ను ఝుళిపించాడు. 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 19 పరుగులు సాధించాడు. ఆ తర్వాత మరో భారీ సిక్సర్‌తో 62 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి... మరుసటి బంతికే జంపా బౌలింగ్‌లో సామ్సన్ బౌల్డ్ అయ్యాడు. అతను కేవలం 20 బంతుల్లోనే చివరి 52 పరుగులను సాధించడం విశేషం. దీనికి తోడు మోరిస్ వచ్చీ రాగానే బౌండరీల వర్షంతో పరుగుల వరద పారించాడు. ఆఖరి ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో దాడి చేయడంతో 23 పరుగులు వచ్చాయి. సామ్సన్, మోరిస్ ధాటికి ఢిల్లీ జట్టు చివరి 4 ఓవర్లలో 76 పరుగులు రాబట్టింది. వికెట్లు టపటపా... లక్ష్యం భారీగా ఉండడంతో వేగంగా పరుగులు తీసే క్రమంలో పుణే జట్టు పూర్తిగా తడబడింది. ఢిల్లీ బౌలర్ల జోరుకు మూడో ఓవర్ నుంచే ప్రారంభమైన వికెట్ల పతనం ఏదశలోనూ ఆగలేదు. కెప్టెన్ అజింక్య రహానే (9 బంతుల్లో 10), మయాంక్ అగర్వాల్ (18 బంతుల్లో 20; 2 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (5 బంతుల్లో 10; 2 ఫోర్లు), డు ప్లెసిస్ (7 బంతుల్లో 8; 1 ఫోర్), బెన్ స్టోక్స్ (2) ఆరు ఓవర్ల వ్యవధిలోనే వెనుదిరగడంతో జట్టు 54 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఓ భారీ సిక్సర్‌తో అలరించిన ధోని (14 బంతుల్లో 11; 1 సిక్స్) కూడా కొద్దిసేపటికే వెనుదిరిగి నిరాశపరిచాడు. అటు రన్‌రేట్ భారీగా పెరిగిపోవడంతో పాటు మిగతా వికెట్లు కూడా త్వరగానే పడడంతో పుణేకు భారీ ఓటమి ఎదురైంది. ►1 ఐపీఎల్ టోర్నీలో ఓ జట్టు క్యాచ్‌ల ద్వారానే ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. ►5 ఐదేళ్ల తర్వాత ఢిల్లీ జట్టు ఇన్నింగ్స్‌లో 200 కంటే ఎక్కువ పరుగులు చేసింది. -
సాక్షి ‘కర్మ సిద్ధాంతం’
పుణే: ఐపీఎల్లో ధోనిని కెప్టెన్సీ నుంచి తొలగించి ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్న రైజింగ్ పుణే సూపర్ జెయింట్ యాజమాన్యం ఆ తర్వాత అతని బ్యాటింగ్‌ను కూడా విమర్శించింది. అయితే జట్టులో సభ్యుడిగా ఉన్న ధోని నుంచి దీనిపై ఎలాంటి స్పందన లేకపోయినా ధోని సతీమణి సాక్షి సింగ్ మాత్రం తన అసంతృప్తిని దాచుకోలేకపోయింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ట్వీట్ల ద్వారా ఆమె తన అసహనాన్ని ప్రదర్శించింది. తన వ్యాఖ్యలతో నేరుగా కాకపోయినా పరోక్షంగా పుణే మేనేజ్మెంట్కు గురి పెట్టింది. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హెల్మెట్ ధరించి ఫొటోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసిన సాక్షి ఆ జట్టుపై అభిమానాన్ని చాటుకుంది. ఎనిమిదేళ్ల పాటు ఐపీఎల్లో చెన్నై టీమ్ కెప్టెన్‌గా ధోని అనుభవించిన వైభవం గురించి అందరికీ తెలిసిందే. తన రెండో ట్వీట్లో సాక్షి పరిస్థితులు మారినంత మాత్రాన ఎవరినీ తక్కువగా చూడరాదంటూ కర్మ సిద్ధాంతాన్ని ప్రవచించింది. ‘పక్షి బతికి ఉన్నప్పుడు చీమలను తింటుంది. కానీ అది చనిపోయాక చీమలే దానిని తింటాయి. సమయం, పరిస్థితులు ఎప్పుడైనా మారిపోవచ్చు. జీవితంలో ఎవరినీ తక్కువ చేసి చూడవద్దు. ఎవరినీ బాధ పెట్టవద్దు. ఈ రోజు నువ్వు బలవంతుడివే కావచ్చు. కానీ సమయం అంతకంటే బలమైంది. ఒక చెట్టు నుంచి లక్షల సంఖ్యలో అగ్గి పుల్లలు తయారు చేయవచ్చు కానీ ఒక్క అగ్గిపుల్లతో లక్షలాది చెట్లను కాల్చవచ్చు. కాబట్టి మంచిగా ఉండండి. మంచిగా వ్యవహరించండి’ అని సాక్షి రాసింది! -
హ్యాట్రిక్ దిశగా..
⇒నేడు ముంబైతో తలపడనున్న సన్‌రైజర్స్ ⇒వరుస విజయాల ఉత్సాహంలో హైదరాబాద్ ⇒ఆత్మవిశ్వాసంలో రోహిత్‌సేన ముంబై: వరుస విజయాలతో ఊపుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో విజయం కోసం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. స్థానిక వాంఖడే స్డేడియంలో జరిగే ఈ మ్యాచ్ ద్వారా వరుసగా మూడు విజయాలు సాధించి హ్యాట్రిక్ సాధించాలని హైదరాబాద్ భావిస్తోంది. మరోవైపు తొలిమ్యాచ్‌లో ఓడినా.. కోల్‌కతాతో జరిగిన రెండో మ్యాచ్‌లో అద్భుత విజయం సాధిం చి ఆత్మవిశ్వాసంతో ఉన్న ముంబై అదే జోరును కొనసాగించాలని కృత నిశ్చయం తో ఉంది. దీంతో ఈ పోరు ఆసక్తికరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. సూపర్ ఫామ్‌లోకి వార్నర్.. సన్‌రైజర్స్ వరుసగా రెండు విజయాలు సాధించి టోర్నీలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో విఫలమైన వార్నర్.. గుజరాత్‌తో జరిగిన రెండోమ్యాచ్‌లో రెచ్చిపోయాడు. 76 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇటీవల భారత పర్యటనలో విఫలమైన వార్నర్ తిరిగి ఫామ్‌ను అందిపుచ్చుకోవడం ముంబైని తీవ్రంగా కలపరపరుస్తోంది. మరోవైపు సహచరుడు, ఆల్‌రౌండర్ మోజెస్ హెన్రిక్స్ కూడా రెండు అర్ధ సెంచరీలతో సత్తా చాటాడు. ఇక భారత డాషింగ్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ చెలరేగుతుండడంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కన్పిస్తోంది. నిజానికి తొలి రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ విభాగానికి పెద్దగా పరీక్ష ఎదురుకాలేదు. టోర్నీలో టాప్ ఆర్డర్ రాణించడంతో జట్టు ఆనందంగా ఉంది. మరోవైపు జట్టు బౌలింగ్ విభాగం కూడా అదరగొడుతోంది. అఫ్గాన్ సంచలనం స్పిన్నర్ రషీద్ ఖాన్ ఐదు వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. దీంతో పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. సీనియర్లు భువనేశ్వర్, ఆశిష్ నెహ్రా కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్నారు. గుజరాత్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంతో జట్టు తేలికగా విజయం సాధించింది. ఇప్పటికే రెండు విజయాలతో ఊపు మీదున్న సన్‌రైజర్స్ ఇదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. -
ఐపీఎల్ బరిలోకి కోహ్లి..!
న్యూఢిల్లీ: గాయంతో ఐపీఎల్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన రాయల్ చాలెంజర్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి త్వరలోనే మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో తాను బరిలోకి దిగే అవకాశముందని సామాజిక మాధ్యమం ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. సదరు వీడియోలో వెయిట్ లిఫ్టింగ్ క్లీన్ అండ్ జెర్క్ను సాధన చేసిన కోహ్లి.. తాను గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నట్లు సూచించాడు. మైదానంలోకి అడుగుపెట్టడానికి ఉవ్విళ్లూరుతున్నానని పేర్కొన్న కోహ్లి.. ఈనెల 14 బరిలోకి దిగడానికి రంగం సిద్ధమైందని పోస్ట్ చేశాడు. గతనెలలో ఆసీస్‌తో మూడో టెస్టుమ్యాచ్ సందర్భంగా కోహ్లి భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఉమేశ్ కూడా...: మరోవైపు పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. మంగళవారం జట్టుతో చేరిన అతను ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. కోల్‌కతా గురువారం పంజాబ్‌తో తమ తర్వాతి మ్యాచ్ ఆడుతుంది. -
‘లిక్కర్’కు నో చెప్పిన మరో క్రికెటర్
బెంగళూరు: ఐపీఎల్లో ఒక యువ క్రికెటర్ తమ జట్టు బ్రాండింగ్ కంటే తన మత విశ్వాసాలకే ప్రాధాన్యతనిచ్చాడు. మద్యం కంపెనీ బ్రాండింగ్‌తో ఉన్న దుస్తులను తాను ధరించనని రాయల్ చాలెంజర్స్ జట్టు క్రికెటర్ అవేశ్ ఖాన్ స్పష్టం చేశాడు. ఆర్సీబీ జట్టు ‘కింగ్ ఫిషర్’ తదితర మద్యం ఉత్పత్తులను ప్రమోట్ చేస్తోంది. 20 ఏళ్ల అవేశ్ విజ్ఞప్తిని అంగీకరించి ఆర్సీబీ ‘కింగ్ ఫిషర్’ బ్రాండింగ్ లేని టీమ్ జెర్సీని అతను ధరించేందుకు అనుమతించింది. బెంగళూరు జట్టు సభ్యులైన ఇక్బాల్ అబ్దుల్లా, సర్ఫరాజ్ ఖాన్, తబ్రేజ్ షమ్సీ (దక్షిణాఫ్రికా) ఇప్పటికే దీనిని పాటిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అందరికంటే ముందుగా హషీం ఆమ్లా ఈ తరహాలో లిక్కర్ ఉత్పత్తులకు ప్రచారం చేసేందుకు నిరాకరించగా, ఆ తర్వాత ఇమ్రాన్ తాహిర్, ఫవాద్ అహ్మద్ (ఆస్ట్రేలియా) అతడిని అనుసరించారు. 2016 అండర్–19 ప్రపంచకప్‌లో నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన 20 ఏళ్ల అవేశ్ ఖాన్, ఆ టోర్నీలో 12 వికెట్లతో భారత జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. -
‘దస్’ కా దమ్!
ఐ...పీ...ఎల్... ఇదో సంచలనం. దేశంలో క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చేస్తుందనుకుంటే... ఏకంగా క్రీడల దశనే మార్చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇది. భారత క్రీడల్లో ఒకటేమిటి... పీబీఎల్ (బ్యాడ్మింటన్), పీకేఎల్ (కబడ్డీ), పీడబ్ల్యూఎల్ (రెజ్లింగ్), ఐపీటీఎల్ (టెన్నిస్) ఇలా ఎన్నో లీగ్‌లకు ఇదే స్టార్టప్ కంపెనీ! తెరమీదికి మరికొన్ని క్రీడలకు, తెరముందు... వెనుక మరెంతో మంది ఆటగాళ్లకు కామధేనువు! ఫ్రాంచైజీలు... మొదలు ఆటగాళ్ల వేలం దాకా అన్నీ ఒకటికి మించి ఒకటి పెను సంచలనాలయ్యాయి. ఏటికేడు రేటింగ్‌ను, బ్రాండ్ ఇమేజ్ను పెంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల అభిమానుల్ని సంపాదించుకున్నట్లే ఆదాయార్జనలో కోట్లు కొల్లగొట్టింది. గడిచిన తొమ్మిదేళ్లలో ఆటలో అరటిపండులా వివాదాలు రేకెత్తినా అవన్నీ ఆటను, లీగ్ ప్రభను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. ఒకప్పుడు టీమిండియా మ్యాచ్‌లే క్రికెట్ మ్యాచ్‌లు. రంజీలున్నా అటువైపు కన్నెత్తి చూడం. కానీ ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్ మ్యాచ్‌లపైనే. అప్పట్లో 11 మందితో సరిపెట్టుకున్న ఆట ఇప్పుడు పదుల సంఖ్యలో వందల మంది యువ క్రికెటర్లకు రాచబాట అయ్యింది. మరో వారం రోజుల్లో (ఏప్రిల్ 5 నుంచి) ఐపీఎల్–10 సీజన్‌కు తెర లేవనుంది. ఈ నేపథ్యంలో గత తొమ్మిది సీజన్ల విశేషాలు క్లుప్తంగా... –సాక్షి క్రీడావిభాగం 2008 రాజస్తాన్‌లో తొలి వసంతం మెకల్లోలం (బ్రెండన్ మెకల్లమ్, కోల్‌కతా నైట్‌రైడర్స్–73 బంతుల్లో 158 నాటౌట్; 10 ఫోర్లు, 13 సిక్సర్లు)తో మొదలైన ఐపీఎల్ తొలి సీజన్ తొలి మ్యాచ్ ఒక రకంగా లీగ్ పుస్తకానికి పీఠిక అయ్యింది. ఐపీఎల్ ఎలా ఉండబోతుందో మెకల్లమ్ తన బ్యాట్‌తో చూపించాడు. ఇక అది మొదలు లీగ్ ముగిసేదాకా దంచుడే దంచుడు... బాదుడే బాదుడు! లీగ్‌లో ఏమాత్రం అంచనాల్లేని జట్టు రాజస్తాన్ రాయల్స్. స్టార్ క్రికెటర్ల కోసం కోట్లు పెట్టేందుకు మనసొప్పని ఈ జట్టు కుర్రాళ్లతో ఏకంగా టైటిల్‌నే నెగ్గుకొచ్చింది. టోర్నీ ఆసాంతం అనుభవజ్ఞుడైన షేన్ వార్న్ మేనియాలో కుర్రాళ్లు చక్కగా శ్రమించారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబైలో జరిగిన తుది పోరు ఆఖరి బంతిదాకా ఉత్కంఠంగా సాగింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. రాజస్తాన్ సరిగ్గా చివరి బంతి షాట్‌తో 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్‌లో షాన్ మార్ష్ (616; పంజాబ్), బౌలింగ్‌లో సొహైల్ తన్వీర్ (22; రాజస్తాన్) మెరిశారు. ఆరెంజ్ క్యాప్: షాన్ మార్ష్ పర్పుల్ క్యాప్: తన్వీర్ 2009 ‘దక్కన్’ దంచేసింది తొలి సీజన్ అంచనాలకు మించి విజయవంతమైంది. నిర్వాహకుల నుంచి ఆటగాళ్లదాకా అందరిలో ఒకటే ఉత్సాహం. కానీ భారత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండో సీజన్ రద్దు తప్పదేమోననే సందేహం అభిమానుల్ని తొలచింది. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఐపీఎల్ నిర్వాహకులు దక్షిణాఫ్రికాలో రెండో సీజన్‌ను నిర్వహించారు. అక్కడ ఈ లీగ్ సూపర్ హిట్. ఇక మ్యాచ్‌ల విషయానికొస్తే... కసి... కృషి... కలిస్తే చార్జింగ్కు తిరుగులేదని నిరూపించిన సీజన్ ఇది. గత ఈవెంట్లో అట్టడుగున నిలిచిన జట్టు (దక్కన్ చార్జర్స్) ఏడాది తిరిగే సరికి అసాధారణ ఆటతీరుతో టైటిల్ సాధించింది. తొలి సీజన్లో పాతాళానికి చేరిన దక్కన్ చార్జర్స్ (8వ స్థానం), బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (ఏడో స్థానం) జట్లు దెబ్బతిన్న పులులా విరుచుకుపడ్డాయి. ప్రత్యర్థులపై స్థిరమైన విజయాలతో అనూహ్యంగా ఈ రెండు జట్లే ఫైనల్‌కు అర్హత సాధించాయి. 6 పరుగుల తేడాతో దక్కన్‌ను విజయం వరించగా... బెంగళూరు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆరెంజ్ క్యాప్: హేడెన్ (572 పరుగులు; చెన్నై) పర్పుల్ క్యాప్: ఆర్పీ సింగ్ (23 వికెట్లు, దక్కన్ చార్జర్స్) 2010 చెన్నై ‘కింగ్’ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తమ రెండో ప్రయత్నంలో టైటిల్ సాధించింది. క్రికెట్ దిగ్గజం సచిన్ (ముం బై ఇండియన్స్) కుర్రాళ్లతో పోటీపడి చితక్కొట్టింది ఈ సీజన్లోనే! ముంబైలో ధోని, సచిన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్లో చెన్నై ‘కింగ్’ అయింది. మొదట రైనా మెరుపులతో చెన్నై 5వికెట్లకు 168 పరుగులు చేసిం ది. సచిన్ జోరు మీదున్న ఈ సీజన్లో ఛేదన ఏమీ కష్టం కాకపోయినా... అతని పోరాటానికి క్రీజులో నిలదొక్కుకున్న మరో బ్యాట్స్‌మన్ లేకపోవడంతో ముంబై మూల్యం చెల్లించుకుంది. చివరకు 9 వికెట్లకు 146 పరుగులకు పరిమితమైన ముంబై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆరెంజ్ క్యాప్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ: సచిన్ (618) పర్పుల్ క్యాప్: ప్రజ్ఞాన్ ఓజా (21; దక్కన్ చార్జర్స్) 2011 మళ్లీ చెన్నై చమక్ మూడు సీజన్లు విజయవంతమయ్యాయి. ఇంటా బయటా ఎనలేని క్రేజ్. దీంతో నిర్వాహకులు జట్లను పెంచారు. నాకౌట్ దశను మార్చారు. జట్లేమో 8 నుంచి 10కి చేరాయి. సెమీస్ నాకౌట్ మ్యాచ్‌లు కనుమరుగై ‘ప్లే ఆఫ్’ తెరమీదికొచ్చింది. దీంతో మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది. వీక్షకులు, టీవీ రేటింగ్ కూడా అదేస్థాయిలో పెరిగింది. లీగ్ ఆరంభం నుంచి నిలకడైన ఆటతీరును కనబరిచిన చెన్నై వరుసగా రెండోసారి టైటిల్ సాధిస్తే... రెండో మారు ఫైనల్కొచ్చినా... బెంగళూరు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. మొదట చెన్నై 20 ఓవర్లలో 205 పరుగుల భారీస్కోరు చేసింది. బదులుగా బెంగళూరు 8 వికెట్లకు 147 పరుగులతో చేతులెత్తేసింది. ఆరెంజ్ క్యాప్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ: గేల్ (608; బెంగళూరు) పర్పుల్ క్యాప్: మలింగ (28; ముంబై) 2012 బాద్షా కోల్‌కతా ఐపీఎల్లో ‘బాలీవుడ్ బాద్షా’ షారుఖ్ ఖాన్ (కోల్‌కతా) జట్టు విజేతగా నిలిచిన సీజన్ ఇది. మరోసారి కప్ కొట్టి ఐపీఎల్ చరిత్రలో హ్యాట్రిక్ రికార్డు కొల్లగొట్టాలనుకున్న చెన్నైకి కోల్‌కతా నైట్‌రైడర్స్ చెక్ పెట్టింది. తొలిసారి లీగ్, నాకౌట్ దశను దాటిన కోల్‌కతా నాలుగోసారి ఫైనలిస్టు (ఇందులో రెండు సార్లు చాంపియన్, ఒకసారి రన్నరప్) చెన్నై జట్టు సంతోషాన్ని ఆవిరి చేసింది. విండీస్ ఆటగాళ్లయిన గేల్ (బెంగళూరు), సునీల్ నరైన్ (కోల్‌కతా స్పిన్నర్) ఈ సీజన్‌ను శాసించారు. ఫైనల్లో రైనా దూకుడు, హస్సీ మెరుపులు వెరసి చెన్నై 190 పరుగులు చేసింది. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతాను ఓపెనర్ మన్విందర్ బిస్లా గట్టెక్కించాడు. కలిస్‌తో కలిసి అసాధారణ ఇన్నింగ్స్ ఆడి కోల్‌కతాకు తొలి టైటిల్ అందించాడు. ఆరెంజ్ క్యాప్: గేల్ (733; బెంగళూరు) పర్పుల్ క్యాప్: మోర్కెల్ (25; ఢిల్లీ) 2013 ముంబై మెరిసింది ఎట్టకేలకు ముంబై జట్టు ఐపీఎల్ టైటిల్ సాధించింది. ఈ సీజన్ ఆసాంతం చెన్నైతో పాటు దీటుగా ముంబై ఇండియన్స్ ఆడింది. లీగ్ దశలో ఇరు జట్లు 11 విజయాలతో సమవుజ్జీలుగా నిలిచాయి. తొలి క్వాలిఫయర్‌లో ముంబైపై గెలిచిన చెన్నై నేరుగా ఫైనల్‌కు చేరగా... రెండో క్వాలిఫయర్‌లో రాజస్తాన్‌ను ఓడించిన ముంబై... చెన్నైతో అమీతుమీకి సిద్ధమైంది. ఈడెన్ గడ్డపై జరిగిన టైటిల్ పోరులో ముంబై తొలుత 9 వికెట్లకు 148 పరుగులు చేసింది. జోరుమీదున్న చెన్నైకిది ఏమంత కష్టసాధ్యం కాకపోయినా ముంబై బౌలర్ల ముప్పేట దాడితో తోకముడిచింది. దీంతో రోహిత్ శర్మ సగర్వంగా ట్రోఫీని అందుకున్నాడు. ఆరెంజ్ క్యాప్: మైక్ హస్సీ (733 పరుగులు; చెన్నై) పర్పుల్ క్యాప్: బ్రేవో (చెన్నై; 32 వికెట్లు) 2014 మళ్లీ కోల్‌కతా కేక కోల్‌కతా నైట్‌రైడర్స్ మళ్లీ గర్జించింది. ఐపీఎల్లో రెండో టైటిల్‌ను అందుకుంది. మ్యాక్స్‌వెల్ శివమెత్తిన ఈ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టైటిల్ దిశగా సాగింది. అయితే తుదిమెట్టుపై కోల్‌కతా పరుగుల తాకిడికి తట్టుకోలేకపోయింది. ఫైనల్లో పంజాబ్ 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా... కోల్‌కతా ఆడుతూ పాడుతూ మరో మూడు బంతులు మిగిలుండగానే చేసేసింది. లక్ష్యఛేదనలో మనీశ్ పాండే (50 బంతుల్లో 94; 7 ఫోర్లు, 6 సిక్సర్లు ) ఇన్నింగ్స్ హైలైట్! ఆరెంజ్ క్యాప్: ఉతప్ప (660 పరుగులు, కోల్‌కతా) పర్పుల్ క్యాప్: మోహిత్ శర్మ (23 వికెట్లు; చెన్నై) 2015 ముంబై... రెండోసారి కోల్‌కతా వెన్నంటే ముంబై ఇండియన్స్ రెండో టైటిల్ సాధించింది. అప్పుడు, ఇప్పుడు ప్రత్యర్థి మాత్రం చెన్నై సూపర్ కింగ్సే. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసింది ముంబై ఇండియన్సే! కానీ ఈసారి మాత్రం (202/5) భారీస్కోరు చేసింది. ఛేదనలో ముంబై బౌలర్లు మలింగ, మెక్లీనగన్, హర్భజన్, వినయ్ సమష్టిగా చెన్నై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంతో 161/8 స్కోరుతోనే సరిపెట్టుకుంది. ఆరెంజ్ క్యాప్: వార్నర్ (562, హైదరాబాద్) పర్పుల్ క్యాప్: బ్రేవో (26; చెన్నై) 2016 సన్ ‘రైజింగ్’ విక్టరీ ఈ సీజనంతా కోహ్లి విశ్వరూపమే కనిపించింది. అతనొక్కడే 973 పరుగులు చేశాడు. మరోవైపు చాపకింద నీరులా సన్‌రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా ఎలిమినేటర్‌ను దాటి తుదిపోరుకు అర్హత సంపాదించింది. ఫైనల్లో హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగుల భారీస్కోరు చేసింది. తర్వాత బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కూడా గేల్, కోహ్లిల తుఫాన్ ఇన్నింగ్స్‌కు లక్ష్యం దిశగా సాగింది. వారిద్దరు అవుటయ్యాక మిగతా వారంతా చేతులెత్తేయడంతో బెంగళూరు 7 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఆరెంజ్ క్యాప్: కోహ్లి (973; బెంగళూరు) పర్పుల్ క్యాప్: భువనేశ్వర్ (23; హైదరాబాద్)