సాహో సామ్సన్
⇒ 63 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 102
⇒ క్రిస్ మోరిస్ మెరుపులు
⇒ రైజింగ్ పుణేపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఘనవిజయం
తొలి మ్యాచ్‌లో దాదాపు విజయం అంచుల దాకా చేరి నిరాశ పడినా.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఢిల్లీ ‘డేర్‌డెవిల్స్’ ఆట చూపింది. యువ బ్యాట్స్‌మన్ సంజూ సామ్సన్ చాలా రోజుల తర్వాత అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ తొమ్మిది బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి ఐదేళ్ల తర్వాత ఢిల్లీ జట్టు 200 పరుగుల మార్కును దాటించేలా చేశాడు. అటు జహీర్ ఖాన్, అమిత్ మిశ్రాల బౌలింగ్ ధాటికి రహానే నేతృత్వంలో బరిలోకి దిగిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 108 పరుగులకే కుప్పకూలి ఘోరంగా ఓడింది.
పుణే: ఐపీఎల్ పదో సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (డీడీ) జట్టు దమ్మున్న ఆటను ప్రదర్శించింది. యువ బ్యాట్స్‌మన్ సంజూ సామ్సన్ (63 బంతుల్లో 102; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సూపర్ సెంచరీకి తోడు ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ (9 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు తోడవ్వడంతో డీడీ విజయాల బోణీ చేసింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌పై 97 పరుగుల తేడాతో ఢిల్లీ నెగ్గింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు చేసింది. రిషభ్ పంత్ (22 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్సర్లు), బిల్లింగ్స్ (17 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.
దీపక్ చహర్, తాహిర్, జంపాలకు ఒక్కో వికెట్ దక్కింది. అనంతరం భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన పుణే జట్టును ఢిల్లీ బౌలర్లు దారుణంగా దెబ్బతీయడంతో 16.1 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్మిత్ కడుపునొప్పితో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాగా జట్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. మయాంక్ చేసిన 20 పరుగులే పుణే ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. జహీర్, స్పిన్నర్ మిశ్రాలకు మూడేసి, కమిన్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. సామ్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
సామ్సన్ శతకం...
తమ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో రెండు పరుగులే చేసిన ఢిల్లీకి రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఆదిత్య తారే పరుగులేమీ చేయకుండానే దీపక్ చహర్ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత డీడీ ఇన్నింగ్స్‌ను మరో ఓపెనర్ బిల్లింగ్స్, సంజూ సామ్సన్ పట్టాలెక్కించారు. వరుసగా రెండు ఫోర్లతో పరుగుల ఖాతా తెరిచిన సామ్సన్ మూడో ఓవర్‌లోనే వరుసగా రెండు ఫోర్లు బాది జోరును ప్రదర్శించాడు. అటు బిల్లింగ్స్ కూడా తన బ్యాట్‌కు పనిచెబుతూ ఆరో ఓవర్‌లో మూడు ఫోర్లతో చెలరేగడంతో పవర్‌ప్లేలో జట్టు 62 పరుగులు సాధించింది. కానీ మరోసారి ఇమ్రాన్ తాహిర్ తన మేజిక్ ప్రదర్శించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని విడదీశాడు. బిల్లింగ్స్ (17 బంతుల్లో 24; 4 ఫోర్లు)ను బౌల్డ్ చేయడంతో రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే సామ్సన్‌కు రిషభ్ పంత్ (22 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్సర్లు) తోడవ్వడంతో పరుగుల వేగం తగ్గలేదు. 12వ ఓవర్‌లో ఇన్నింగ్స్‌లో తొలి సిక్సర్‌ను పంత్ సాధించాడు. అయితే మరో నాలుగు ఓవర్ల అనంతరం పంత్ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. 41 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన సామ్సన్ ఆ తర్వాత ఒక్కసారిగా బ్యాట్‌ను ఝుళిపించాడు.
18వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 19 పరుగులు సాధించాడు. ఆ తర్వాత మరో భారీ సిక్సర్‌తో 62 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి... మరుసటి బంతికే జంపా బౌలింగ్‌లో సామ్సన్ బౌల్డ్ అయ్యాడు. అతను కేవలం 20 బంతుల్లోనే చివరి 52 పరుగులను సాధించడం విశేషం. దీనికి తోడు మోరిస్ వచ్చీ రాగానే బౌండరీల వర్షంతో పరుగుల వరద పారించాడు. ఆఖరి ఓవర్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో దాడి చేయడంతో 23 పరుగులు వచ్చాయి. సామ్సన్, మోరిస్ ధాటికి ఢిల్లీ జట్టు చివరి 4 ఓవర్లలో 76 పరుగులు రాబట్టింది.
వికెట్లు టపటపా...
లక్ష్యం భారీగా ఉండడంతో వేగంగా పరుగులు తీసే క్రమంలో పుణే జట్టు పూర్తిగా తడబడింది. ఢిల్లీ బౌలర్ల జోరుకు మూడో ఓవర్ నుంచే ప్రారంభమైన వికెట్ల పతనం ఏదశలోనూ ఆగలేదు. కెప్టెన్ అజింక్య రహానే (9 బంతుల్లో 10), మయాంక్ అగర్వాల్ (18 బంతుల్లో 20; 2 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (5 బంతుల్లో 10; 2 ఫోర్లు), డు ప్లెసిస్ (7 బంతుల్లో 8; 1 ఫోర్), బెన్ స్టోక్స్ (2) ఆరు ఓవర్ల వ్యవధిలోనే వెనుదిరగడంతో జట్టు 54 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఓ భారీ సిక్సర్‌తో అలరించిన ధోని (14 బంతుల్లో 11; 1 సిక్స్) కూడా కొద్దిసేపటికే వెనుదిరిగి నిరాశపరిచాడు. అటు రన్‌రేట్ భారీగా పెరిగిపోవడంతో పాటు మిగతా వికెట్లు కూడా త్వరగానే పడడంతో పుణేకు భారీ ఓటమి ఎదురైంది.
►1 ఐపీఎల్ టోర్నీలో ఓ జట్టు క్యాచ్‌ల ద్వారానే ఆలౌట్ కావడం ఇదే తొలిసారి.
►5 ఐదేళ్ల తర్వాత ఢిల్లీ జట్టు ఇన్నింగ్స్‌లో 200 కంటే ఎక్కువ పరుగులు చేసింది.