నా సెంచరీ ఆయన చలువే: సంజూ సామ్సన్
ఐపీఎల్ పదో సీజన్‌లో తొలి సెంచరీ నమోదుచేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు సంజూ సామ్సన్.. తన శతకం క్రెడిట్ రాహుల్ ద్రవిడ్‌కే దక్కుతుందన్నాడు. పుణెతో జరిగిన మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ యాడం జంపా బౌలింగ్‌లో సిక్సర్ బాది సెంచరీ చేసిన సంజూ.. స్కోరు వేగం పెంచే క్రమంలో ఆ వెంటనే ఔటయ్యాడు. అయితే, అతని తర్వాత వచ్చిన క్రిస్ మోరిస్ తుఫాన్‌లా చెలరేగి.. తొమ్మిది బంతుల్లోనే అజేయంగా 38 పరుగులు చేయడంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 205 పరుగులు చేసింది.
మ్యాచ్ అనంతరం సంజూ మాట్లాడుతూ భారత లెజండరీ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నప్పటి నుంచి ద్రవిడ్‌తో సంజూకు అనుబంధం ఉంది. ఆ జట్టులోని యువ ఆటగాళ్ల నైపుణ్యానికి మెరుగులు దిద్దడంలో ద్రవిడ్ కీలక పాత్ర పోషించాడు. ’ద్రవిడ్ సర్ ఆశీస్సులు పొందడం నేను అదృష్టంగా భావిస్తున్నా’ అని సంజూ చెప్పాడు. తన సెంచరీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం ఆనందం కలిగించిందని తెలిపాడు. గతంలో భారత అండర్ 19 జట్టుకు సేవలు అందించిన రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. కానీ రాహుల్ మార్గనిర్దేశకత్వంలో సంజూ సెంచరీ చేయడం.. ఆ జట్టు అంచనాలకు మించి రాణిస్తుండటంతో త్వరలో పరిస్థితి తారుమారు కావొచ్చునని భావిస్తున్నారు.