గర్జించిన ఢిల్లీ.. పుణెపై ఘనవిజయం
పుణె: రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌పై ఢిల్లీ డేర్ డెవిల్స్ 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు సంజూ శాంసన్ (63 బంతుల్లో 102 పరుగులు: 8 ఫోర్లు, 5 సిక్సర్లు) తొలి సెంచరీ నమోదు చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణె జట్టు ఏ దశలోనూ ఢిల్లీకి పోటీ ఇవ్వలేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో 16.1 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయింది. అజింక్యా రహానె (10), మయాంక్ అగర్వాల్ (20), డుప్లెసిస్ (8), బెన్ స్టోక్స్ (2), ధోనీ (11) అందరూ విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో జహీర్ ఖాన్, అమిత్ మిశ్రా చెరో మూడు వికెట్లు పడగొట్టగా, కమిన్స్ కు రెండు వికెట్లు దక్కాయి.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఆదిలోనే ఓపెనర్ ఆదిత్యా తారే(0) వికెట్ కోల్పోయింది. బిల్లింగ్స్ (24) తో కలిసి సంజూ శాంసన్ రెండో వికెట్ కు 69 పరుగులు భాగస్వామ్యాన్ని, రిషబ్ పంత్ (31;22 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు)తో కలిసి మూడో వికెట్ కు 53 పరుగులను జత చేశాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్ 62 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతకం నమోదు చేశాడు. అయితే సిక్సర్ తో సెంచరీ సాధించిన శాంసన్.. మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. పుణె స్పిన్నర్ ఆడమ్ జంపా వేసిన బంతిని భారీ షాట్ గా ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. క్రిస్ మోరిస్(38 నాటౌట్;4 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.