రైజింగ్‌ పుణేకు షాక్‌ | Delhi Daredevils won by 7 runs on Rising Pune Supergiant | Sakshi
Sakshi News home page

రైజింగ్‌ పుణేకు షాక్‌

Published Sat, May 13 2017 12:35 AM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

రైజింగ్‌ పుణేకు షాక్‌

రైజింగ్‌ పుణేకు షాక్‌

ఏడు పరుగులతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ విజయం
మనోజ్‌ తివారి పోరాటం వృథా


లక్ష్యం 169 పరుగులు.. వరుసగా నాలుగు విజయాలతో ఊపు మీదున్న రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌కు ఇది ఏమంత కష్టసాధ్యమైనదేమీ కాదనే అంతా భావించారు. అయితే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ బౌలర్లు మాత్రం చివరి బంతి వరకు పోరాడి ప్రత్యర్థిని కంగుతినిపించారు. ఈ మ్యాచ్‌లో విజయంతో ప్లే ఆఫ్‌లో దర్జాగా చోటు దక్కించుకుందామనుకున్న స్మిత్‌ బృందం ఇక తమ చివరి మ్యాచ్‌ వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది.

న్యూఢిల్లీ: సూపర్‌ ఫామ్‌లో ఉన్న రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌ జోరును ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ అడ్డుకుంది. లక్ష్యం భారీగా లేకపోయినా పేసర్లు జహీర్‌ ఖాన్‌ (2/25), మొహమ్మద్‌ షమీ (2/37) అద్భుత బౌలింగ్‌ కారణంగా పుణే వణికింది. అంతకుముందు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కరుణ్‌ నాయర్‌ (45 బంతుల్లో 64; 9 ఫోర్లు) అర్ధ సెంచరీతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (22 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్లన్‌ శామ్యూల్స్‌ (21 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. ఉనాద్కట్, స్టోక్స్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన పుణే 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసి ఓడింది. మనోజ్‌ తివారి (45 బంతుల్లో 60; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరి బంతి వరకు పోరాడాడు. స్మిత్‌ (32 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్‌), స్టోక్స్‌ (25 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు.

కరుణ్‌ ఒక్కడే...
టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఆద్యంతం ఓపెనర్‌ కరుణ్‌ నాయర్‌ నడిపించాడు. తొలి మూడు ఓవర్లలోనే సంజూ సామ్సన్‌ (2), ఫామ్‌లో ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌ (3) అవుట్‌ కావడంతో 9 పరుగులకే జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కరుణ్, రిషబ్‌ పంత్‌ జోరుతో పరుగుల వేగం పెరిగింది. నాలుగో ఓవర్‌లో కరుణ్‌ రెండు ఫోర్లు, రిషబ్‌ ఓ సిక్స్‌ బాదగా.. ఐదో ఓవర్‌లో కరుణ్, ఆరో ఓవర్‌లో పంత్‌ మూడేసి ఫోర్లతో రెచ్చిపోవడంతో ఈ రెండు ఓవర్లలోనే 28 పరుగులు వచ్చాయి. అయితే తొమ్మిదో ఓవర్‌లో జంపా ఈ జోడిని విడదీశాడు. అప్పటికే ఆ ఓవర్‌లో ఓ ఫోర్, సిక్స్‌ కొట్టిన పంత్‌ను తను అవుట్‌ చేశాడు.

దీంతో మూడో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత మార్లన్‌ శామ్యూల్స్‌ (21 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) 12వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 37 బంతుల్లో కరుణ్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా అటు వరుస ఓవర్లలో అండర్సన్‌ (3), కమిన్స్‌ (11) పెవిలియన్‌కు చేరడంతో జట్టు స్కోరు నెమ్మదించింది. అయితే 18వ ఓవర్‌లో నాయర్‌ రెండు ఫోర్లు, మిశ్రా ఓ సిక్స్‌ బాదడంతో 19 పరుగులు రాగా పుంజుకుంది. ఆ తర్వాత ఓవర్‌లో నాయర్‌ను స్టోక్స్‌ అవుట్‌ చేశాడు. ఇక చివరి ఓవర్‌లో షమీ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్‌ దగ్గర స్టోక్స్‌ అద్భుత రీతిలో అందుకోవడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. డీప్‌ మిడ్‌వికెట్‌లో తను బంతిని గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. అయితే ఈ క్రమంలో బౌండరీ లైన్‌ దాటేస్తానని భావించి మెరుపువేగంతో బంతిని తిరిగి మైదానంలోకి విసిరాడు. అయితే అది కిందపడేలోపే తను మరోసారి లోనికి వచ్చి అందుకున్నాడు.

తివారి ఒంటరి పోరు
లక్ష్యం కోసం బరిలోకి దిగిన పుణేకు ప్రారంభంలోనే జహీర్‌ ఖాన్‌ షాక్‌ ఇచ్చాడు. గత ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్‌ కూడా తీయని తను ఈసారి తొలి బంతికే రహానేను డకౌట్‌ చేశాడు. అలాగే దీంతో ఐపీఎల్‌లో వంద వికెట్లను పూర్తిచేసుకున్నాడు. అయితే నాలుగో ఓవర్‌లో కెప్టెన్‌ స్మిత్‌ 4,6,4తో చెలరేగి 14 పరుగులు రాబట్టాడు. ఐదో ఓవర్‌లో జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జహీర్‌ తన మూడో ఓవర్‌లో రాహుల్‌ త్రిపాఠి (7)ని అవుట్‌ చేశాడు. ఈ సమయంలో స్మిత్‌కు జతగా మనోజ్‌ తివారి నిలిచాడు. తివారి వరుసగా రెండు ఫోర్లతో పవర్‌ప్లేలో జట్టు 53 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ జోరు మీదున్న స్మిత్‌ను తొమ్మిదో ఓవర్‌లో చక్కని లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతితో ఎల్బీగా అవుట్‌ చేశాడు.

మధ్య ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు పరుగులకు కట్టడి చేయగలిగారు. అయితే ఫీల్డర్ల వైఫల్యంతో తివారి వరుసగా రెండు ఓవర్లలో ఇచ్చిన క్యాచ్‌లు మిస్‌ అయ్యాయి. 16వ ఓవర్‌లో స్టోక్స్‌ను షమీ అవుట్‌ చేయగా నాలుగో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత వరుస ఓవర్లలో ధోని (5) షమీ సూపర్‌ త్రోకు రనౌట్‌ కాగా క్రిస్టియాన్‌ (3) ఎల్బీగా అవుట్‌ అయి ఒత్తిడి పెరిగింది. ఆఖరి ఓవర్‌లో 25 పరుగులు రావాల్సి ఉండగా తివారి వరుసగా రెండు సిక్సర్లు, ఆ తర్వాత ఓ ఫోర్‌ బాదినా ఫలితం లేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement