శాంసన్ శతక్కొట్టుడు..
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో తొలి సెంచరీ నమోదైంది. మంగళవారం ఇక్కడ రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు సంజూ శాంసన్ సెంచరీ సాధించాడు. తద్వారా ఈ ఐపీఎల్లో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. సంజూ శాంసన్ 62 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతకం నమోదు చేశాడు. అయితే సిక్సర్ తో సెంచరీ సాధించిన శాంసన్.. మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. పుణె స్పిన్నర్ ఆడమ్ జంపా వేసిన బంతిని భారీ షాట్ గా ఆడబోయి బౌల్డ్ అయ్యాడు.
అంతకుముందు రిషబ్ పంత్(31;22 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్ గా నిష్క్రమించాడు. చివర్లో క్రిస్ మోరిస్(38 నాటౌట్;4 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఢిల్లీ మిగతా ఆటగాళ్లలో శ్యామ్ బిల్లింగ్స్(24) ఫర్వాలేదనిపించగా, ఆదిత్య తారే డకౌట్ అవుటయ్యాడు. ఈ మ్యాచ్ లో రైజింగ్ పుణె టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ దూరమయ్యాడు. అనారోగ్యంగా కారణంగా ఢిల్లీతో జరిగే మ్యాచ్ నుంచి స్మిత్ వైదొలిగాడు. స్టీవ్ స్మిత్ స్థానంలో అజింక్యా రహానే తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మరొకవైపు ఢిల్లీ జట్టు నుంచి కార్లోస్ బ్రాత్ వైట్ ను తొలగించారు. అతని స్థానంలో కోరీ అండర్సన్ తుది జట్టులోకి వచ్చాడు.