‘లిక్కర్’కు నో చెప్పిన మరో క్రికెటర్
బెంగళూరు: ఐపీఎల్‌లో ఒక యువ క్రికెటర్ తమ జట్టు బ్రాండింగ్ కంటే తన మత విశ్వాసాలకే ప్రాధాన్యతనిచ్చాడు. మద్యం కంపెనీ బ్రాండింగ్‌తో ఉన్న దుస్తులను తాను ధరించనని రాయల్ చాలెంజర్స్ జట్టు క్రికెటర్ అవేశ్ ఖాన్ స్పష్టం చేశాడు. ఆర్‌సీబీ జట్టు ‘కింగ్ ఫిషర్’ తదితర మద్యం ఉత్పత్తులను ప్రమోట్ చేస్తోంది. 20 ఏళ్ల అవేశ్ విజ్ఞప్తిని అంగీకరించి ఆర్‌సీబీ ‘కింగ్ ఫిషర్’ బ్రాండింగ్ లేని టీమ్ జెర్సీని అతను ధరించేందుకు అనుమతించింది.
బెంగళూరు జట్టు సభ్యులైన ఇక్బాల్ అబ్దుల్లా, సర్ఫరాజ్ ఖాన్, తబ్రేజ్ షమ్సీ (దక్షిణాఫ్రికా) ఇప్పటికే దీనిని పాటిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అందరికంటే ముందుగా హషీం ఆమ్లా ఈ తరహాలో లిక్కర్ ఉత్పత్తులకు ప్రచారం చేసేందుకు నిరాకరించగా, ఆ తర్వాత ఇమ్రాన్ తాహిర్, ఫవాద్ అహ్మద్ (ఆస్ట్రేలియా) అతడిని అనుసరించారు. 2016 అండర్–19 ప్రపంచకప్‌లో నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన 20 ఏళ్ల అవేశ్ ఖాన్, ఆ టోర్నీలో 12 వికెట్లతో భారత జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.