
Duleep Trophy 2024- Ind C vs Ind A అనంతపురం: భారత్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్ ‘సి’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ ఆటగాడు అభిషేక్ పొరెల్ (113 బంతుల్లో 82; 9 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో ఈ మేర స్కోరు చేయగలిగింది. నిజానికి.. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న గ్రూప్ ‘సి’ జట్టు... చివరి మ్యాచ్‌లో అదే స్థాయి ప్రదర్శ కనబర్చడంలో తడబడింది.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (17)తో పాటు సాయి సుదర్శన్ (17), రజత్ పటిదార్ (0), ఇషాన్ కిషన్ (5), మానవ్ సుతార్ (2) విఫలమయ్యారు. దీంతో 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ ‘సి’ జట్టును బాబా ఇంద్రజిత్ (34)తో కలిసి అభిషేక్ ఆదుకున్నాడు. వరస విరామాల్లో వికెట్లు పడుతున్నా... ధాటిగా ఆడిన అభిషేక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
మరోవైపు పులకిత్ నారంగ్ (114 బంతుల్లో 41; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసిన భారత్ ‘సి’.. శనివారం నాటి మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరుకు 18 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. భారత్ ‘ఎ’ జట్టు కంటే తొలి ఇన్నింగ్స్‌లో 63 పరుగులు వెనుకబడి ఉంది.
టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన ఆవేశ్ ఖాన్
ఇదిలా ఉంటే.. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 224/7తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ జట్టు చివరకు 297 పరుగులకు ఆలౌటైంది. శాశ్వత్ రావత్ (250 బంతుల్లో 124; 15 ఫోర్లు) క్రితం రోజు స్కోరుకు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరగగా... పేసర్ అవేశ్ ఖాన్ (68 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అనూహ్యంగా బ్యాట్‌తో అదరగొట్టాడు.
టీ20 తరహాలో ఎడాపెడా భారీ షాట్లు ఆడిన అవేశ్ ఖాన్ జట్టుకు విలువైన పరుగులు జోడించాడు. అతడికి ప్రసిద్ధ్ కృష్ణ (34; 7 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. భారత్ ‘సి’ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 4, అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment