హ్యాట్రిక్ దిశగా..
⇒నేడు ముంబైతో తలపడనున్న సన్‌రైజర్స్
⇒వరుస విజయాల ఉత్సాహంలో హైదరాబాద్
⇒ఆత్మవిశ్వాసంలో రోహిత్‌సేన
ముంబై: వరుస విజయాలతో ఊపుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో విజయం కోసం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. స్థానిక వాంఖడే స్డేడియంలో జరిగే ఈ మ్యాచ్ ద్వారా వరుసగా మూడు విజయాలు సాధించి హ్యాట్రిక్ సాధించాలని హైదరాబాద్ భావిస్తోంది. మరోవైపు తొలిమ్యాచ్‌లో ఓడినా.. కోల్‌కతాతో జరిగిన రెండో మ్యాచ్‌లో అద్భుత విజయం సాధిం చి ఆత్మవిశ్వాసంతో ఉన్న ముంబై అదే జోరును కొనసాగించాలని కృత నిశ్చయం తో ఉంది. దీంతో ఈ పోరు ఆసక్తికరంగా సాగుతుందనడంలో సందేహం లేదు.
సూపర్ ఫామ్‌లోకి వార్నర్.. సన్‌రైజర్స్ వరుసగా రెండు విజయాలు సాధించి టోర్నీలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో విఫలమైన వార్నర్.. గుజరాత్‌తో జరిగిన రెండోమ్యాచ్‌లో రెచ్చిపోయాడు. 76 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇటీవల భారత పర్యటనలో విఫలమైన వార్నర్ తిరిగి ఫామ్‌ను అందిపుచ్చుకోవడం ముంబైని తీవ్రంగా కలపరపరుస్తోంది. మరోవైపు సహచరుడు, ఆల్‌రౌండర్ మోజెస్ హెన్రిక్స్ కూడా రెండు అర్ధ సెంచరీలతో సత్తా చాటాడు.
ఇక భారత డాషింగ్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ చెలరేగుతుండడంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కన్పిస్తోంది. నిజానికి తొలి రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ విభాగానికి పెద్దగా పరీక్ష ఎదురుకాలేదు. టోర్నీలో టాప్ ఆర్డర్ రాణించడంతో జట్టు ఆనందంగా ఉంది. మరోవైపు జట్టు బౌలింగ్ విభాగం కూడా అదరగొడుతోంది. అఫ్గాన్ సంచలనం స్పిన్నర్ రషీద్ ఖాన్ ఐదు వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. దీంతో పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. సీనియర్లు భువనేశ్వర్, ఆశిష్ నెహ్రా కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్నారు. గుజరాత్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంతో జట్టు తేలికగా విజయం సాధించింది. ఇప్పటికే రెండు విజయాలతో ఊపు మీదున్న సన్‌రైజర్స్ ఇదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది.