‘దస్‌’ కా దమ్‌! | ipl-10 cricket fever started in april 5th | Sakshi
Sakshi News home page

‘దస్‌’ కా దమ్‌!

Published Thu, Mar 30 2017 12:22 AM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM

‘దస్‌’ కా దమ్‌!

‘దస్‌’ కా దమ్‌!

ఐ...పీ...ఎల్‌... ఇదో సంచలనం. దేశంలో క్రికెట్‌ ముఖచిత్రాన్ని మార్చేస్తుందనుకుంటే... ఏకంగా క్రీడల దశనే మార్చేసిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఇది. భారత క్రీడల్లో ఒకటేమిటి... పీబీఎల్‌ (బ్యాడ్మింటన్‌), పీకేఎల్‌ (కబడ్డీ), పీడబ్ల్యూఎల్‌ (రెజ్లింగ్‌), ఐపీటీఎల్‌ (టెన్నిస్‌) ఇలా ఎన్నో లీగ్‌లకు ఇదే స్టార్టప్‌ కంపెనీ!  తెరమీదికి మరికొన్ని క్రీడలకు, తెరముందు... వెనుక మరెంతో మంది ఆటగాళ్లకు కామధేనువు! ఫ్రాంచైజీలు... మొదలు ఆటగాళ్ల వేలం దాకా అన్నీ ఒకటికి మించి ఒకటి పెను సంచలనాలయ్యాయి.

ఏటికేడు రేటింగ్‌ను, బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల అభిమానుల్ని సంపాదించుకున్నట్లే ఆదాయార్జనలో కోట్లు కొల్లగొట్టింది. గడిచిన తొమ్మిదేళ్లలో ఆటలో అరటిపండులా వివాదాలు రేకెత్తినా అవన్నీ ఆటను, లీగ్‌ ప్రభను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయాయి.  ఒకప్పుడు టీమిండియా మ్యాచ్‌లే క్రికెట్‌ మ్యాచ్‌లు. రంజీలున్నా అటువైపు కన్నెత్తి చూడం. కానీ ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్‌ మ్యాచ్‌లపైనే. అప్పట్లో 11 మందితో సరిపెట్టుకున్న ఆట ఇప్పుడు పదుల సంఖ్యలో వందల మంది యువ క్రికెటర్లకు  రాచబాట అయ్యింది. మరో వారం రోజుల్లో (ఏప్రిల్‌ 5 నుంచి) ఐపీఎల్‌–10 సీజన్‌కు తెర లేవనుంది. ఈ నేపథ్యంలో గత తొమ్మిది సీజన్‌ల విశేషాలు క్లుప్తంగా... –సాక్షి క్రీడావిభాగం

http://img.sakshi.net/images/cms/2017-03/81490814472_Unknown.jpg2008 రాజస్తాన్‌లో తొలి వసంతం
మెకల్లోలం (బ్రెండన్‌ మెకల్లమ్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌–73 బంతుల్లో 158 నాటౌట్‌; 10 ఫోర్లు, 13 సిక్సర్లు)తో మొదలైన ఐపీఎల్‌ తొలి సీజన్‌ తొలి మ్యాచ్‌ ఒక రకంగా లీగ్‌ పుస్తకానికి పీఠిక అయ్యింది. ఐపీఎల్‌ ఎలా ఉండబోతుందో మెకల్లమ్‌ తన బ్యాట్‌తో చూపించాడు. ఇక అది మొదలు లీగ్‌ ముగిసేదాకా దంచుడే దంచుడు... బాదుడే బాదుడు! లీగ్‌లో ఏమాత్రం అంచనాల్లేని జట్టు రాజస్తాన్‌ రాయల్స్‌. స్టార్‌ క్రికెటర్ల కోసం కోట్లు పెట్టేందుకు మనసొప్పని ఈ జట్టు కుర్రాళ్లతో ఏకంగా టైటిల్‌నే నెగ్గుకొచ్చింది. టోర్నీ ఆసాంతం అనుభవజ్ఞుడైన షేన్‌ వార్న్‌ మేనియాలో కుర్రాళ్లు చక్కగా శ్రమించారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ముంబైలో జరిగిన తుది పోరు ఆఖరి బంతిదాకా ఉత్కంఠంగా సాగింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. రాజస్తాన్‌ సరిగ్గా చివరి బంతి షాట్‌తో 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్‌లో షాన్  మార్ష్ (616; పంజాబ్‌), బౌలింగ్‌లో సొహైల్‌ తన్వీర్‌ (22; రాజస్తాన్‌) మెరిశారు.
ఆరెంజ్‌ క్యాప్‌: షాన్  మార్ష్
పర్పుల్‌ క్యాప్‌: తన్వీర్‌


http://img.sakshi.net/images/cms/2017-03/51490814571_Unknown.jpg2009 ‘దక్కన్‌’ దంచేసింది
తొలి సీజన్‌ అంచనాలకు మించి విజయవంతమైంది. నిర్వాహకుల నుంచి ఆటగాళ్లదాకా అందరిలో ఒకటే ఉత్సాహం. కానీ భారత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండో సీజన్‌ రద్దు తప్పదేమోననే సందేహం అభిమానుల్ని తొలచింది. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఐపీఎల్‌ నిర్వాహకులు దక్షిణాఫ్రికాలో రెండో సీజన్‌ను నిర్వహించారు. అక్కడ ఈ లీగ్‌ సూపర్‌ హిట్‌. ఇక మ్యాచ్‌ల విషయానికొస్తే... కసి... కృషి... కలిస్తే చార్జింగ్‌కు తిరుగులేదని నిరూపించిన సీజన్‌ ఇది. గత ఈవెంట్‌లో అట్టడుగున నిలిచిన జట్టు (దక్కన్‌ చార్జర్స్‌) ఏడాది తిరిగే సరికి అసాధారణ ఆటతీరుతో టైటిల్‌ సాధించింది. తొలి సీజన్‌లో పాతాళానికి చేరిన దక్కన్‌ చార్జర్స్‌ (8వ స్థానం), బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ (ఏడో స్థానం) జట్లు దెబ్బతిన్న పులులా విరుచుకుపడ్డాయి. ప్రత్యర్థులపై స్థిరమైన విజయాలతో అనూహ్యంగా ఈ రెండు జట్లే ఫైనల్‌కు అర్హత సాధించాయి. 6 పరుగుల తేడాతో దక్కన్‌ను విజయం వరించగా... బెంగళూరు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఆరెంజ్‌ క్యాప్‌: హేడెన్‌ (572 పరుగులు; చెన్నై)
పర్పుల్‌ క్యాప్‌:  ఆర్‌పీ సింగ్‌ (23 వికెట్లు, దక్కన్‌ చార్జర్స్‌) 

http://img.sakshi.net/images/cms/2017-03/51490814662_Unknown.jpg2010 చెన్నై ‘కింగ్‌’
ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ తమ రెండో ప్రయత్నంలో టైటిల్‌ సాధించింది. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ (ముం బై ఇండియన్స్‌) కుర్రాళ్లతో పోటీపడి చితక్కొట్టింది ఈ సీజన్‌లోనే! ముంబైలో ధోని, సచిన్‌ జట్ల మధ్య జరిగిన ఫైనల్లో చెన్నై ‘కింగ్‌’ అయింది. మొదట రైనా మెరుపులతో చెన్నై 5వికెట్లకు 168 పరుగులు చేసిం ది. సచిన్‌ జోరు మీదున్న ఈ సీజన్‌లో ఛేదన ఏమీ కష్టం కాకపోయినా... అతని పోరాటానికి క్రీజులో నిలదొక్కుకున్న మరో బ్యాట్స్‌మన్‌ లేకపోవడంతో ముంబై మూల్యం చెల్లించుకుంది. చివరకు 9 వికెట్లకు 146 పరుగులకు పరిమితమైన ముంబై రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఆరెంజ్‌ క్యాప్, ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ:  సచిన్‌ (618) 
పర్పుల్‌ క్యాప్‌: ప్రజ్ఞాన్‌ ఓజా (21; దక్కన్‌ చార్జర్స్‌)

http://img.sakshi.net/images/cms/2017-03/61490814742_Unknown.jpg2011 మళ్లీ చెన్నై చమక్‌
మూడు సీజన్లు విజయవంతమయ్యాయి. ఇంటా బయటా ఎనలేని క్రేజ్‌. దీంతో నిర్వాహకులు జట్లను పెంచారు. నాకౌట్‌ దశను మార్చారు. జట్లేమో 8 నుంచి 10కి చేరాయి. సెమీస్‌ నాకౌట్‌ మ్యాచ్‌లు కనుమరుగై ‘ప్లే ఆఫ్‌’ తెరమీదికొచ్చింది. దీంతో మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది. వీక్షకులు, టీవీ రేటింగ్‌ కూడా అదేస్థాయిలో పెరిగింది. లీగ్‌ ఆరంభం నుంచి నిలకడైన ఆటతీరును కనబరిచిన చెన్నై వరుసగా రెండోసారి టైటిల్‌ సాధిస్తే... రెండో మారు ఫైనల్‌కొచ్చినా... బెంగళూరు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. మొదట చెన్నై 20 ఓవర్లలో 205 పరుగుల భారీస్కోరు చేసింది. బదులుగా బెంగళూరు 8 వికెట్లకు 147 పరుగులతో చేతులెత్తేసింది.
ఆరెంజ్‌ క్యాప్, ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ: గేల్‌ (608; బెంగళూరు)
పర్పుల్‌ క్యాప్‌: మలింగ (28; ముంబై)

http://img.sakshi.net/images/cms/2017-03/51490814816_Unknown.jpg2012 బాద్‌షా కోల్‌కతా
ఐపీఎల్‌లో ‘బాలీవుడ్‌ బాద్‌షా’ షారుఖ్‌ ఖాన్‌ (కోల్‌కతా) జట్టు విజేతగా నిలిచిన సీజన్‌ ఇది. మరోసారి కప్‌ కొట్టి ఐపీఎల్‌ చరిత్రలో హ్యాట్రిక్‌ రికార్డు కొల్లగొట్టాలనుకున్న చెన్నైకి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చెక్‌ పెట్టింది. తొలిసారి లీగ్, నాకౌట్‌ దశను దాటిన కోల్‌కతా  నాలుగోసారి ఫైనలిస్టు (ఇందులో రెండు సార్లు చాంపియన్, ఒకసారి రన్నరప్‌) చెన్నై జట్టు సంతోషాన్ని  ఆవిరి చేసింది. విండీస్‌ ఆటగాళ్లయిన గేల్‌ (బెంగళూరు), సునీల్‌ నరైన్‌ (కోల్‌కతా స్పిన్నర్‌) ఈ సీజన్‌ను శాసించారు. ఫైనల్లో రైనా దూకుడు, హస్సీ మెరుపులు వెరసి చెన్నై 190 పరుగులు చేసింది. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతాను ఓపెనర్‌ మన్విందర్‌ బిస్లా గట్టెక్కించాడు. కలిస్‌తో కలిసి అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడి కోల్‌కతాకు తొలి టైటిల్‌ అందించాడు.
ఆరెంజ్‌ క్యాప్‌: గేల్‌ (733; బెంగళూరు)
పర్పుల్‌ క్యాప్‌: మోర్కెల్‌ (25; ఢిల్లీ)

http://img.sakshi.net/images/cms/2017-03/71490814913_Unknown.jpg2013 ముంబై మెరిసింది
ఎట్టకేలకు ముంబై జట్టు ఐపీఎల్‌ టైటిల్‌ సాధించింది. ఈ సీజన్‌ ఆసాంతం చెన్నైతో పాటు దీటుగా ముంబై ఇండియన్స్‌ ఆడింది. లీగ్‌ దశలో ఇరు జట్లు 11 విజయాలతో సమవుజ్జీలుగా నిలిచాయి. తొలి క్వాలిఫయర్‌లో ముంబైపై గెలిచిన చెన్నై నేరుగా ఫైనల్‌కు చేరగా... రెండో క్వాలిఫయర్‌లో రాజస్తాన్‌ను ఓడించిన ముంబై... చెన్నైతో అమీతుమీకి సిద్ధమైంది. ఈడెన్‌ గడ్డపై జరిగిన టైటిల్‌ పోరులో ముంబై తొలుత 9 వికెట్లకు 148 పరుగులు చేసింది. జోరుమీదున్న చెన్నైకిది ఏమంత కష్టసాధ్యం కాకపోయినా ముంబై బౌలర్ల ముప్పేట దాడితో తోకముడిచింది. దీంతో రోహిత్‌ శర్మ సగర్వంగా ట్రోఫీని అందుకున్నాడు.  
ఆరెంజ్‌ క్యాప్‌: మైక్‌ హస్సీ (733 పరుగులు; చెన్నై)
పర్పుల్‌ క్యాప్‌: బ్రేవో (చెన్నై; 32 వికెట్లు)

http://img.sakshi.net/images/cms/2017-03/51490815021_Unknown.jpg2014 మళ్లీ కోల్‌కతా కేక
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మళ్లీ గర్జించింది. ఐపీఎల్‌లో రెండో టైటిల్‌ను అందుకుంది. మ్యాక్స్‌వెల్‌ శివమెత్తిన ఈ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ టైటిల్‌ దిశగా సాగింది. అయితే తుదిమెట్టుపై కోల్‌కతా పరుగుల తాకిడికి తట్టుకోలేకపోయింది. ఫైనల్లో పంజాబ్‌ 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా... కోల్‌కతా ఆడుతూ పాడుతూ మరో మూడు బంతులు మిగిలుండగానే చేసేసింది. లక్ష్యఛేదనలో మనీశ్‌ పాండే (50 బంతుల్లో 94; 7 ఫోర్లు, 6 సిక్సర్లు ) ఇన్నింగ్స్‌ హైలైట్‌!
ఆరెంజ్‌ క్యాప్‌: ఉతప్ప (660 పరుగులు, కోల్‌కతా)
పర్పుల్‌ క్యాప్‌: మోహిత్‌ శర్మ (23 వికెట్లు; చెన్నై)

http://img.sakshi.net/images/cms/2017-03/81490815106_Unknown.jpg2015 ముంబై... రెండోసారి
కోల్‌కతా వెన్నంటే ముంబై ఇండియన్స్‌ రెండో టైటిల్‌ సాధించింది. అప్పుడు, ఇప్పుడు ప్రత్యర్థి మాత్రం చెన్నై సూపర్‌ కింగ్సే. ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసింది ముంబై ఇండియన్సే! కానీ ఈసారి మాత్రం (202/5) భారీస్కోరు చేసింది. ఛేదనలో ముంబై బౌలర్లు మలింగ, మెక్లీనగన్, హర్భజన్, వినయ్‌ సమష్టిగా చెన్నై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంతో 161/8 స్కోరుతోనే సరిపెట్టుకుంది.
ఆరెంజ్‌ క్యాప్‌: వార్నర్‌ (562, హైదరాబాద్‌)
పర్పుల్‌ క్యాప్‌: బ్రేవో (26; చెన్నై)

http://img.sakshi.net/images/cms/2017-03/51490815234_Unknown.jpg2016 సన్‌ ‘రైజింగ్‌’ విక్టరీ
ఈ సీజనంతా కోహ్లి విశ్వరూపమే కనిపించింది. అతనొక్కడే 973 పరుగులు చేశాడు. మరోవైపు చాపకింద నీరులా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అనూహ్యంగా ఎలిమినేటర్‌ను దాటి తుదిపోరుకు అర్హత సంపాదించింది. ఫైనల్లో  హైదరాబాద్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగుల భారీస్కోరు చేసింది. తర్వాత బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ కూడా గేల్, కోహ్లిల తుఫాన్‌ ఇన్నింగ్స్‌కు లక్ష్యం దిశగా సాగింది. వారిద్దరు అవుటయ్యాక మిగతా వారంతా చేతులెత్తేయడంతో బెంగళూరు 7 వికెట్లకు 200 పరుగులు చేసింది.
ఆరెంజ్‌ క్యాప్‌: కోహ్లి (973; బెంగళూరు)
పర్పుల్‌ క్యాప్‌: భువనేశ్వర్‌ (23; హైదరాబాద్‌)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement