‘బెంగ’ తీరేదెన్నడు..?
రాయల్ చాలెంజర్స్‌కు అందని ద్రాక్షలా ఐపీఎల్ టైటిల్
గేల్.. డి విలియర్స్.. కోహ్లి.. వాట్సన్.. మామూలు ఆటగాళ్లా వీరు? మైదానంలో తమ బ్యాట్లతో వీరంగం సృష్టించే ఈ మెరుపు వీరులంతా ఉన్నది ఒకే జట్టులో.. అదే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. టి20 ఫార్మాట్‌లో ఈ స్టార్ల ఆట చూసేందుకు దేశంలో ఏ స్టేడియమైనా నిండిపోవాల్సిందే.. అయితే అభిమానులను విశేషంగా ఆకర్షించే ఈ జట్టు మాత్రం ఇప్పటిదాకా చాంపియన్ కాలేకపోయింది. మూడు సార్లు ఫైనల్‌దాకా వచ్చి కూడా రన్నరప్‌గానే సంతృప్తి పడింది. ఈసారి గాయం కారణంగా కోహ్లి ఆరంభ మ్యాచ్‌ల్లో ఆడటం అనుమానంగా మారడం.. కేఎల్ రాహుల్ భుజం నొప్పితో సీజన్‌కు దూరమవడంతో ఈసారైనా తొలి టైటిల్‌ను గెలుచుకోవాలనే ఆర్‌సీబీ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.
సాక్షి క్రీడా విభాగం: ఐపీఎల్ జరిగిన ప్రతిసారీ భారీ అంచనాలతో బరిలోకి దిగడం... చివరకు అభిమానులను ఉస్సూరుమనిపించడం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు అలవాటుగా మారింది. 2008 తొలి సీజన్‌లో లీగ్ దశలోనే వెనుదిరిగినా రెండో సీజన్‌లో ఫైనల్‌కు చేరగలిగింది. ఆ తర్వాత వరుసగా సెమీస్, రన్నరప్‌గా నిలిచినా 2012, 13, 14 సీజన్‌లలో పేలవ ఆటతీరులో లీగ్ దశకే పరిమితమైంది. అయితే గతేడాది జరిగిన 9వ సీజన్‌లో ఆర్‌సీబీ జట్టును కెప్టెన్ కోహ్లి ఒంటి చేత్తో ఫైనల్‌కు చేర్చాడు. ఆ ఒక్క సీజన్‌లోనే తను ఏకంగా 973 పరుగులతో రికార్డు సృష్టించాడు.
అయితే తమ తొలి ఏడు మ్యాచ్‌లో ఈ జట్టు గెలిచింది రెండు మాత్రమే.. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా జూలు విదల్చడంతో ప్లే ఆఫ్‌కు అర్హత సాధించడంతో పాటు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ లయన్స్‌ను మట్టికరిపించి తుది పోరుకు అర్హత సాధించినా, అక్కడ నిరాశే ఎదురైంది. తమ సొంత మైదానంలో జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడింది. ఈసారి ఎలాగైనా టైటిల్ తమదే అనే ఉద్దేశంతో బరిలోకి దిగనుంది.
పటిష్టమైన బ్యాటింగ్ లైనప్...
ఆర్‌సీబీకి అవసరానికి మించి బ్యాటింగ్ బలం ఉంది. మంచి సమతూకంతో జట్టును బరిలోకి దించాలనుకున్నప్పుడు టీమ్ మేనేజిమెంట్‌ను ఇదే అంశం ఇబ్బంది పెడుతోంది. ఈ సీజన్ కూడా జట్టు బ్యాటింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడనుంది. కోహ్లి, గేల్, డి విలియర్స్, వాట్సన్, సర్ఫరాజ్ ఖాన్‌లతో కూడిన ఈ విభాగం ఎలాంటి మ్యాచ్‌నైనా తమవైపునకు తిప్పుకోగలదు. అయితే కోహ్లి ఫామ్ అత్యంత కీలకం. ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో తను దారుణంగా విఫలం కావడం జట్టును ఆందోళనపరుస్తోంది. గాయం నుంచి కోలుకోవడంతో పాటు ఫామ్‌ను అందుకోవడంపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. గత సీజన్‌లో తను నాలుగు సెంచరీలతో 81.08 సగటు సాధించాడు. బౌలింగ్‌లో యజువేంద్ర చాహల్, అరవింద్ ప్రభావం చూపనున్నారు.
బౌలింగ్‌లో నిలకడలేమి...
బెంగళూరు జట్టు బలహీనత ఏదైనా ఉంటే అది తమ బౌలింగ్ విభాగమే.. తమ జట్టులో ఎంతమంది భీకర బ్యాట్స్‌మెన్ ఉన్నా ప్రత్యర్థి జట్టును స్వల్ప స్కోరుకు కట్టడి చేసి బ్యాట్స్‌మెన్‌పై భారం పడకుండా చూడడం బౌలర్ల బాధ్యత. ఈ విషయంలో మాత్రం ఇప్పటివరకు ఆర్‌సీబీ బౌలర్లు విఫలమవుతున్నారు. ఈ లోపాన్ని సరిచేసుకునేందుకే ఐపీఎల్– 10 ఆటగాళ్ల వేలంలో రూ.12 కోట్లను వెచ్చించి ఇంగ్లండ్‌కు చెందిన టి20 స్పెషలిస్ట్ బౌలర్ టైమల్ మిల్స్‌ను కొనుగోలు చేసుకుంది. అంతేకాకుండా పేసర్లు బిల్లీ స్టాన్‌లేక్, అనికేత్ చౌదరిలను కూడా తీసుకుని పటిష్టం చేసుకుంది. అయితే మిషెల్ స్టార్క్ జట్టు నుంచి తప్పుకోవడం కూడా ఇబ్బందిగా మారింది.
మూడుసార్లు రన్నరప్‌గా...
గత తొమ్మిది ఐపీఎల్ సీజన్‌లలో బెంగళూరు జట్టు మూడుసార్లు ఫైనల్‌కు చేరుకొని మూడుసార్లు రన్నరప్‌గా నిలిచింది. 2009 ఫైనల్లో దక్కన్ చార్జర్స్ చేతిలో ఓడిన బెంగళూరు... 2010లో సెమీస్ వరకు చేరింది. ఆ తర్వాత 2011 ఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో, 2016 ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైంది.
అంచనాలకు అనుగుణంగా రాణిస్తేనే...
నెల రోజులపాటు జరిగే సుదీర్ఘ సీజన్‌లో ఫేవరెట్ ఎవరనేది కచ్చితంగా అంచనా వేయలేకపోయినా టైటిల్ గెలుచుకునే సత్తా మాత్రం ఆర్‌సీబీకి ఉందనడంలో అతిశయోక్తి లేదు. అయితే కీలక ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండడంతో ఈ జట్టూ ఫేవరెట్లలో ఒకటిగా చెప్పవచ్చు. అయితే బౌలర్ల నుంచి కూడా మెరుగైన ప్రదర్శన వస్తే జట్టుకు మంచిది. ప్లే ఆఫ్ దశకు చేరడం ఖాయమే..
కెప్టెన్‌గా డి విలియర్స్: కెప్టెన్ కోహ్లి భుజం నొప్పి కారణంగా ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవడంతో డి విలియర్స్‌ను కెప్టెన్‌గా నియమించే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి కోహ్లి పరిస్థితిపై స్పష్టత లేదని, రెండు మూడు రోజుల్లో ఏ విషయం తేలుతుందని కోచ్ వెటోరి అన్నారు. విరాట్ ఆడని పరిస్థితి ఉంటే మాత్రం డి విలియర్స్ బాధ్యత తీసుకుంటాడని చెప్పారు. అయితే అతను వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని, తమ దేశవాళీ టోర్నీ ఫైనల్‌కు దూరమయ్యాడని, ఈ సీజన్‌లో ఆడకపోవచ్చనే కథనాలు వినిపిస్తున్నాయి.
జట్టు
స్వదేశీ ఆటగాళ్లు: కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, యజువేంద్ర చాహల్, హర్షల్ పటేల్, మన్‌దీప్ సింగ్, ఎస్.అరవింద్, కేదార్ జాదవ్, స్టువర్ట్ బిన్నీ, ఇక్బాల్ అబ్దుల్లా, సచిన్ బేబీ, అవేష్ ఖాన్, పవన్ నేగి, అనికేత్ చౌదరి, ప్రవీణ్ దూబే.
విదేశీ ఆటగాళ్లు: గేల్, డి విలియర్స్, వాట్సన్, ఆడమ్ మిల్నే, శామ్యూల్ బద్రీ, ట్రావిస్ హెడ్, షమ్సీ, స్టాన్‌లేక్, మిల్స్.