ఐపీఎల్‌లో అత్యధిక పరుగులతో సన్‌రైజర్స్ కొత్త రికార్డు
తమ స్కోరునే బద్దలు కొట్టిన హైదరాబాద్
25 పరుగులతో బెంగళూరుపై విజయం
హెడ్ సెంచరీ... చెలరేగిన క్లాసెన్, సమద్
దినేశ్ కార్తీక్ పోరాటం వృథా
బెంగళూరు: సన్‌రైజర్స్ ఆటతీరు చిన్నస్వామి స్టేడియాన్ని పెద్ద పెద్ద రికార్డుల్లో నిలిపింది. బెంగళూరు టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకోగానే విధ్వంసానికి పునాది పడింది...బ్యాటింగ్ తుఫాన్‌తో హైదరాబాద్ మ్యాచ్ గెలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక సీజన్‌లో తమ రికార్డుకు ‘2.0’ ను చూపించింది. ముంబైపై 277 రికార్డును రోజుల వ్యవధిలోనే 287 పరుగుల అత్యధిక స్కోరుతో హైదరాబాద్ జట్టు తిరగరాసింది.
ఈ ఎండల్ని తట్టుకోలేని జనాలకు మెరుపుల పండగని పంచిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 25 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి మునుపెన్నడూ చేయని 287 పరుగుల భారీ స్కోరు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతకం బాదగా... హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఆకాశానికే చిల్లులుపడేలా సిక్స్‌లు కొట్టాడు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) దంచేశాడు చివరి వరకు పోరాడగా..డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించాడు.
దంచుడే... దంచుడు!
రెండో ఓవర్ నుంచే హెడ్ వీరంగం మొదలైంది. టాప్లీ ఓవర్లో 4, 6 కొట్టగా, ఫెర్గూసన్ ఐదో ఓవర్లో రెండు సిక్స్‌లతో పాటు ఓ బౌండరీ బాదాడు. దీన్ని యశ్ తదుపరి ఓవర్లోనూ రిపీట్ చేయడంతో 20 బంతుల్లో హెడ్ ఫిఫ్టీ పూర్తవగా, పవర్‌ప్లే స్కోరు 76/0. జాక్స్ ఏడో ఓవర్ వేస్తే హెడ్ వరుసగా 4, 6, 6 బాదేశాడు. తర్వాత అభిషేక్ సిక్సర్‌తో 7.1 ఓవర్లోనే సన్‌రైజర్స్ వందను దాటేసింది. తర్వాతి ఓవర్లో అభిషేక్ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను టాప్లీ అవుట్ చేసి 108 పరుగుల ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. క్లాసెన్ క్రీజులోకి రాగా... వైశాక్ 12వ ఓవర్లో మూడు ఫోర్లతో హెడ్ 39 బంతుల్లో శతకం పూర్తి చేసుకొని కాసేపటికే అవుటయ్యాడు.
ఇక క్లాసెన్ వంతు!
అప్పటిదాకా అడపాదడపా షాట్లతో 21 పరుగులు చేసిన క్లాసెన్ బాదే బాధ్యత తను తీసుకున్నాడు. లోమ్రోర్ 9 బంతులేసిన 14వ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు కొట్టాడు. తదుపరి వైశాక్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్ కొట్టి 23 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. టాప్లీ, ఫెర్గూసన్‌ల వరుస ఓవర్లలో ఒక్కో సిక్స్‌తో విరుచుకుపడిన క్లాసెన్‌కు ఫెర్గూసన్ చెక్‌పెట్టాడు.
క్రీజులో ఉన్న మార్క్‌రమ్ (17 బంతుల్లో 32నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)కు అప్పుడే వచి్చన సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) తోడయ్యాడు. వచ్చీ రాగానే టార్గెట్ తుఫాన్‌పై కదం తొక్కుతూ టాప్లీ వేసిన 19వ ఓవర్లో ఆడిన ఐదు బంతుల్ని 4, 4, 6, 6, 4లుగా బాదాడు. ఆఖరి ఓవర్లో మార్క్‌రమ్ 4, 6 కొడితే సమద్ మరో సిక్సర్ బాదాడు. 19వ ఓవర్లో 25, 20వ ఓవర్లో 21 పరుగులు హైదరాబాద్ గెలుపులో కీలకమయ్యాయి.
బెంగళూరు తగ్గలేదు!
ఎంతకొట్టినా ఎంతకీ కరగని లక్ష్యమని బెంగళూరు బెదిరిపోలేదు. ఆఖరి దాకా తగ్గేదే లే అన్నట్లుగా సన్‌రైజర్స్ ఫీల్డర్లను చెమటలు పట్టించింది. ఓపెనర్లు కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), డుప్లెసిస్ కొండంత లక్ష్యానికి దీటైన ఆరంభం ఇచ్చారు. ఇద్దరు తొలి ఓవర్లో చెరో బౌండరీతో ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టారు. తర్వాత ఓవర్ ఓవర్‌కూ సిక్స్‌లు, ఫోర్లతో వేగాన్ని పెంచారు. భువీ నాలుగో ఓవర్లో ఇద్దరు చెరో 2 బౌండరీలతో 3.5 ఓవర్లోనే బెంగళూరు 50 దాటింది.
నటరాజన్, కమిన్స్ ఓవర్లలో అవలీలగా ఫోర్లు, సిక్స్‌లు బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 78/0 స్కోరు చేసింది. కోహ్లిని మార్కండే బౌల్డ్ చేయడంతో తొలిదెబ్బ తగిలింది. మరోవైపు డుప్లెసిస్ 24 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. కానీ విల్‌జాక్స్ (7) నాన్‌స్ట్రయిక్ ఎండ్‌లో దురదృష్టవశాత్తు రనౌటవడం, పటిదార్ (9)తో పాటు డుప్లెసిస్ స్వల్పవ్యవధిలో పెవిలియన్ చేరడం జట్టును వెనుకబడేలా చేసింది.
అయితే పదో ఓవర్లో క్రీజులోకి వచి్చన దినేశ్ కార్తీక్ షాట్లతో విరుచుకుపడటంతో భారీ స్కోరు కాస్తా దిగి వస్తుండటంతో హైదరాబాద్ శిబిరం కాస్తా ఇబ్బంది పడింది. 23 బంతుల్లో కార్తీక్ ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. అయితే 12 బంతుల్లో 58 పరుగుల సమీకరణం కష్టసాధ్యం కావడంతో పాటు 19వ ఓవర్లో 6, 4 కొట్టిన కార్తీక్‌ను నటరాజన్ అవుట్ చేయడంతో పరాజయం ఖాయమైంది. 11, 12 ఓవర్లలో వరుసగా 5, 8 పరుగులే రావడం.... 15వ ఓవర్లో కమిన్స్... హిట్టర్ మహిపాల్ (11 బంతుల్లో 19; 2 సిక్స్‌లు)ను అవుట్ చేసి 6 పరుగులే ఇవ్వడం సన్‌రైజర్స్‌ను గట్టెక్కించింది. లేదంటే పరిస్థితి
కచి్చతంగా మరోలా ఉండేది!
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) ఫెర్గూసన్ (బి) టాప్లీ 34; హెడ్ (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 102; క్లాసెన్ (సి) వైశాక్ (బి) ఫెర్గూసన్ 67; మార్క్‌రమ్ నాటౌట్ 32; సమద్ నాటౌట్ 37; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 287.
వికెట్ల పతనం: 1–108. 2–165, 3–231.
బౌలింగ్: విల్ జాక్స్ 3–0–32–0, టాప్లీ 4–0–68–1, యశ్ దయాళ్ 4–0–51–0, ఫెర్గూసన్ 4–0–52–2, వైశాక్ 4–0–64–0, మహిపాల్ 1–0–18–0.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) మార్కండే 42; డుప్లెసిస్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 62; జాక్స్ రనౌట్ 7; పటిదార్ (సి) నితీశ్ (బి) మార్కండే 9; సౌరవ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కమిన్స్ 0; దినేశ్ కార్తీక్ (సి) క్లాసెన్ (బి) నటరాజన్ 83; మహిపాల్ (బి) కమిన్స్ 19; అనూజ్ నాటౌట్ 25; వైశాక్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 262.
వికెట్ల పతనం: 1–80, 2–100, 3–111, 4–121, 5–122, 6–181, 7–244.
బౌలింగ్: అభిషేక్ 1–0–10–0, భువనేశ్వర్ 4–0–60–0, షహబాజ్ 1–0–18–0, నటరాజన్ 4–0–47–1, కమిన్స్ 4–0–43–3, మార్కండే 4–0–46–2,
ఉనాద్కట్ 2–0–37–0.
287: ఐపీఎల్‌లో ఒక టీమ్ సాధించిన అత్యధిక స్కోరు. ఇదే సీజన్‌లో తాము చేసిన 277 స్కోరును సన్‌రైజర్స్ సవరించింది. ఓవరాల్‌గా టి20ల్లో ఇది రెండో అత్యధిక స్కోరు. ఆసియా క్రీడల్లో మంగోలియాపై నేపాల్ 314 పరుగులు చేసింది.
22: సన్‌రైజర్స్ సిక్సర్లు. గతంలో బెంగళూరు కొట్టిన 21 సిక్సర్ల రికార్డు బద్దలైంది.
4: హెడ్ చేసిన సెంచరీ (39 బంతుల్లో) ఐపీఎల్‌లో నాలుగో వేగవంతమైంది. గేల్ (30), యూసుఫ్ పఠాన్ (37), మిల్లర్ (38) ముందున్నారు. సన్‌రైజర్స్ తరఫున గతంలో వార్నర్ 43 బంతుల్లో సెంచరీ చేశాడు.
549: ఒక టి20ల్లో నమోదైన అత్యధిక పరుగులతో కొత్త రికార్డు. ఇదే సీజన్‌లో హైదరాబాద్, ముంబై మధ్య 523 పరుగులు నమోదయ్యాయి.
ఐపీఎల్‌లో నేడు
కోల్‌కతా X రాజస్తాన్
వేదిక: కోల్‌కతా
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment