Gale
-
IPL 2021 PBKS vs MI: పంజాబ్ ప్రతాపం
నిలకడలేని ఆటతీరుకు మారుపేరైన పంజాబ్ కింగ్స్ జట్టు ఈసారి మాత్రం ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ లీగ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసి... ఆ తర్వాత ఛేజింగ్‌ను కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందుండి నడిపించాడు. దాంతో పంజాబ్ కింగ్స్ మరో 14 బంతులు మిగిలి ఉండగానే విజయ తీరాన్ని చేరింది. అన్నింటా విఫలమైన ముంబై ఇండియన్స్ ఈ లీగ్‌లో తమ ఖాతాలో మూడో ఓటమిని జమ చేసుకుంది. చెన్నై: తొలి మ్యాచ్‌లో గెలిచి... ఆ తర్వాత హ్యాట్రిక్ పరాజయాలతో డీలా పడ్డ పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ టోర్నీలో మళ్లీ గెలుపు బాట పట్టింది. ఇక్కడి చెపాక్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పటిష్ట ముంబై ఇండియన్స్‌పై 9 వికెట్లతో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో విఫలమైన రోహిత్ శర్మ బృందం సీజన్లో మూడో ఓటమిని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 పరుగులు చేసింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (52 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి సూర్య కుమార్ (27 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) సహకారం అందించాడు. పంజాబ్ బౌలర్లు రవి బిష్ణోయ్ (2/21), షమీ (2/21) ప్రత్యర్థిని కట్టడి చేశారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 132 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (52 బంతుల్లో 60 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా... గేల్ (35 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిశాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు అజేయంగా 79 పరుగులు జోడించారు. ఇబ్బంది పడుతూ... టాస్ ఓడి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌కు దిగగా... డికాక్ (3) మరోసారి విఫలమయ్యాడు. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై ముంబై బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించడానికి ఇబ్బంది పడ్డారు. ఐదో ఓవర్ చివరి బంతి వరకు ఒక్క బౌండరీ లేకుండానే ముంబై ఇన్నింగ్స్ సాగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికి రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్ శర్మ... ఎట్టకేలకు ఐదో ఓవర్ చివరి బంతికి షార్ట్ ఫైన్‌లెగ్ మీదుగా బౌండరీ బాదాడు. పవర్‌ప్లేలో ముంబై వికెట్ నష్టపోయి 21 పరుగులు మాత్రమే చేసింది. ఈ సీజన్లో పవర్‌ప్లేలో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే. తాజా ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన తొలి ఓవర్లోనే ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న ఇషాన్ కిషన్ (6)ను అవుట్ చేశాడు. దాంతో ముంబై రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆదుకున్న కెప్టెన్ జట్టు సారథిగా ముంబై ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే బాధ్యతను రోహిత్ శర్మ తన భుజాలపై వేసుకొని ఓపికతో ఆడాడు. అతడికి సూర్యకుమార్ సహకరించాడు. ఫాబియాన్ అలెన్ వేసిన 8వ ఓవర్లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు కొట్టిన రోహిత్... అతడి తర్వాతి ఓవర్లోనూ లాంగాన్ మీదుగా సిక్సర్ కొట్టడంతో ముంబై స్కోరు 10 ఓవర్లు ముగిసేసరికి 49/2గా నిలిచింది. మరో ఎండ్‌లో ఉన్న సూర్యకుమార్ కూడా 4, 6 కొట్టడంతో ముంబై స్కోరు బోర్డు వేగం అందుకుంది. 14వ ఓవర్ రెండో బంతిని ఫోర్ కొట్టిన రోహిత్ 40 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ముంబై 15.2 బంతుల్లో 100 పరుగుల మార్కును దాటింది. అయితే రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌నకు ప్రయత్నించి సూర్యకుమార్ అవుటయ్యాడు. దాంతో 79 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. కొద్ది సేపటికే రోహిత్ కూడా వెనుదిరిగాడు. పాండ్యా బ్రదర్స్ హార్దిక్ (1), కృనాల్ (3) నిరాశపరిచారు. చివర్లో పొలార్డ్ (12 బంతుల్లో 16 నాటౌట్; 1 సిక్స్) ధాటికి ముంబై 130 పరుగుల మార్కును దాటగలిగింది. రాహుల్ జోరు... పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తన సూపర్ ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు రాహుల్, మయాంక్ అగర్వాల్ (20 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్) హిట్టింగ్‌కే ప్రాధాన్యత ఇచ్చారు. కృనాల్ పాండ్యా వేసిన రెండో ఓవర్లో రాహుల్ రెండు ఫోర్లు కొట్టగా... మయాంక్ ఒక సిక్సర్ బాదడంతో 15 పరుగులు లభించాయి. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో రాహుల్ ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ కొట్టాడు. బౌల్ట్ బౌలింగ్‌లో మయాంక్ రెండు ఫోర్లు సాధించడంతో... పంజాబ్ 4 ఓవర్లలో 37 పరుగులు చేసింది. ఇక పేసర్లతో లాభం లేదనుకున్న రోహిత్ స్పిన్నర్లను బరిలోకి దించాడు. రాహుల్ చహర్, జయంత్ యాదవ్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో పంజాబ్ ఇన్నింగ్స్ లో దూకుడు తగ్గింది. దాంతో కాస్త ఒత్తిడికి లోనైన మయాంక్... రాహుల్ చహర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో 53 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్ కుదురుకోవడానికి ప్రయత్నించడం... మరో ఎండ్‌లో రాహుల్ కూడా తన దూకుడును తగ్గించడంతో మ్యాచ్‌పై ముంబై పట్టుబిగించేలా కనిపించింది. అయితే క్రీజులో కుదురుకున్నాక గేల్ షాట్లు ఆడటం మొదలు పెట్టాడు. జయంత్ బౌలింగ్‌లో అతడు రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టగా... పొలార్డ్ వేసిన ఓవర్లో రాహుల్ ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో రాహుల్ 50 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. సీజన్లో అతడికిది మూడో అర్ధ సెంచరీ. పంజాబ్ విజయానికి 18 బంతుల్లో 17 పరుగులు అవసరమైన తరుణంలో... బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ తొలి బంతిని గేల్ సిక్సర్ కొట్టి రెండో బంతికి సింగిల్ తీశాడు. స్ట్రయిక్‌లోకి వచ్చిన రాహుల్ వరుస బంతుల్లో 6, 4 కొట్టి మ్యాచ్‌ను ముగించేశాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) హెన్రిక్స్ (బి) దీపక్ హుడా 3; రోహిత్ శర్మ (సి) అలెన్ (బి) షమీ 63; ఇషాన్ కిషన్ (సి) రాహుల్ (బి) రవి బిష్ణోయ్ 6; సూర్యకుమార్ యాదవ్ (సి) క్రిస్ గేల్ (బి) రవి బిష్ణోయ్ 33; పొలార్డ్ (నాటౌట్) 16; హార్దిక్ పాండ్యా (సి) దీపక్ హుడా (బి) అర్ష్‌దీప్ సింగ్ 1; కృనాల్ పాండ్యా (సి) పూరన్ (బి) షమీ 3; జయంత్ యాదవ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–7, 2–26; 3–105, 4–112, 5–122, 6–130. బౌలింగ్: హెన్రిక్స్ 3–0–12–0, దీపక్ హుడా 3–0–15–1, షమీ 4–0–21–2, రవి బిష్ణోయ్ 4–0–21–2, ఫాబియాన్ అలెన్ 3–0–30–0, అర్ష్‌దీప్ సింగ్ 3–0–28–1. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (నాటౌట్) 60; మయాంక్ అగర్వాల్ (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) రాహుల్ చహర్ 25; క్రిస్ గేల్ (నాటౌట్) 43; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.4 ఓవర్లలో వికెట్ నష్టపోయి) 132. వికెట్ల పతనం: 1–53. బౌలింగ్: బౌల్ట్ 2.4–0–30–0, కృనాల్ పాండ్యా 3–0–31–0, బుమ్రా 3–0–21–0, రాహుల్ చహర్ 4–0–19–1, జయంత్ యాదవ్ 4–0–20–0, పొలార్డ్ 1–0–11–0. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రాహుల్ -
రాబర్ట్.. నీ అభిమానానికి థ్యాంక్స్ : రూట్
గాలే: ఇంగ్లండ్- శ్రీలంకల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో సోమవారం ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు అంటే పడిచచ్చే ఒక అభిమానికి ఆ జట్టు కెప్టెన్ జో రూట్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ విషయం కాసేపు పక్కనపెడితే మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఈసీబీ ఇంగ్లండ్ క్రికెట్ డై హార్డ్ ఫ్యాన్‌కు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది. చదవండి: వీరాభిమాని నం.1 వివరాలు.. రాబర్ట్ లుయీస్ అనే వ్యక్తి క్రికెట్ అంటే అమితమై ప్రేమ.. అందునా ఇంగ్లండ్ జట్టు అంటే విపరీతమైన ప్రేమను చూపించేవాడు. కరోనాకు ముందు ఇంగ్లండ్ జట్టు ఎక్కడా పర్యటించినా రాబర్ట్ అక్కడికి వెళ్లి లైవ్‌లో మ్యాచ్‌లను ఆస్వాధించేవాడు.. అంతేగాక వీలు చిక్కినప్పుడల్లా క్రికెటర్లను కలిసేవాడు. కానీ కరోనా సంక్షోభంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. లాక్డౌన్ తర్వాత క్రికెట్ ప్రారంభమైనా.. మైదానంలోకి ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఇంగ్లండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న సంగతి తెలుసుకున్న రాబర్ట్ లుయీస్ 10 నెలల ముందే శ్రీలంక చేరుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్- శ్రీలంక టెస్ట్ సిరీస్ ప్రారంభం అయింది. అయితే మైదానంలోకి ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో అతన్ని అనుమతించలేదు. ఎలాగైనా మ్యాచ్‌ను చూడాలని భావించిన రాబర్డ్ ఈసీబీ అధికారులతో మాట్లాడి ఒప్పించాడు. గాలే మైదానానికి ఆనుకొని ఉన్న ఒక కోటపై కూర్చొని టెస్టు మ్యాచ్‌ను చూశాడు. కాగా తొలి టెస్టు మ్యాచ్‌లో లంకపై విజయం సాధించిన అనంతరం సంబరాలు చేసుకుంటున్న ఇంగ్లండ్ జట్టును కోటపై నుంచే చూసి సంతోషం వ్యక్తం చేశాడు. ఇది గమనించిన ఈసీబీ అధికారులు రాబర్ట్‌కు ఒక సువర్ణవకాశం కల్పించారు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ స్వయంగా ఫోన్ చేసి రాబర్ట్‌తో మాట్లాడాడు. 'హాయ్ రాబర్ట్.. 10 నెలల విరామం తర్వాత నిన్ను ఈ కోటపై చూడడం ఆనందంగా ఉంది. ఇంతకాలం మేం ఎక్కడ పర్యటించినా మా వెంటే ఉండి ప్రోత్సహించావు. మీ అభిమానానికి థ్యాంక్స్ రాబర్ట్. ఇంగ్లండ్ జట్టుతో ఇంతకాలం నువ్వు సాగించిన జర్నీ మాకు ఆదర్శంగా నిలిచింది. కరోనా సమయంలోనూ ఇంత కష్టపడి మా ఆటను చూడడానికి వచ్చిన నీకు కృతజ్ఞతలు తప్ప ఇంకేమి ఇవ్వలేము. బయో బబూల్ వాతావరణం నేపథ్యంలో నిన్ను మా పార్టీలోకి ఆహ్వానించే అవకాశం లేదు. అందుకే ఈరోజును రాండీ కాడిక్ డ్రింక్‌తో ఎంజాయ్ చేయ్.. మిస్ యూ లాట్.. రాబర్డ్ లుయీస్ అంటూ రూట్ ఫోన్‌కాల్ ముగించాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఈసీబీ తన ట్విటర్లో షేర్ చేసింది.చదవండి: 'అంతా బాగుంది.. నోబాల్స్ జీర్ణించుకోలేకపోతున్నా' ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 135 పరుగులకే ఆలౌట్ కాగా.. తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 421 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో లంక జట్టు 359 పరుగులకు ఆలౌట్ కావడంతో 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. లంక విధించిన స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి చేధించింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో మెరిసిన కెప్టెన్ జో రూట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. We massively missed @TheBarmyArmy here and thank you for all your support back home. But a special thanks to @elitebandwagon up on the Fort! Incredible effort and the whole team really appreciated it 👏 https://t.co/5XAVTVGIWn — Joe Root (@root66) January 18, 2021 -
‘బెంగ’ తీరేదెన్నడు..?
రాయల్ చాలెంజర్స్‌కు అందని ద్రాక్షలా ఐపీఎల్ టైటిల్ గేల్.. డి విలియర్స్.. కోహ్లి.. వాట్సన్.. మామూలు ఆటగాళ్లా వీరు? మైదానంలో తమ బ్యాట్లతో వీరంగం సృష్టించే ఈ మెరుపు వీరులంతా ఉన్నది ఒకే జట్టులో.. అదే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. టి20 ఫార్మాట్లో ఈ స్టార్ల ఆట చూసేందుకు దేశంలో ఏ స్టేడియమైనా నిండిపోవాల్సిందే.. అయితే అభిమానులను విశేషంగా ఆకర్షించే ఈ జట్టు మాత్రం ఇప్పటిదాకా చాంపియన్ కాలేకపోయింది. మూడు సార్లు ఫైనల్‌దాకా వచ్చి కూడా రన్నరప్‌గానే సంతృప్తి పడింది. ఈసారి గాయం కారణంగా కోహ్లి ఆరంభ మ్యాచ్‌ల్లో ఆడటం అనుమానంగా మారడం.. కేఎల్ రాహుల్ భుజం నొప్పితో సీజన్‌కు దూరమవడంతో ఈసారైనా తొలి టైటిల్‌ను గెలుచుకోవాలనే ఆర్సీబీ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. సాక్షి క్రీడా విభాగం: ఐపీఎల్ జరిగిన ప్రతిసారీ భారీ అంచనాలతో బరిలోకి దిగడం... చివరకు అభిమానులను ఉస్సూరుమనిపించడం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు అలవాటుగా మారింది. 2008 తొలి సీజన్లో లీగ్ దశలోనే వెనుదిరిగినా రెండో సీజన్లో ఫైనల్‌కు చేరగలిగింది. ఆ తర్వాత వరుసగా సెమీస్, రన్నరప్‌గా నిలిచినా 2012, 13, 14 సీజన్లలో పేలవ ఆటతీరులో లీగ్ దశకే పరిమితమైంది. అయితే గతేడాది జరిగిన 9వ సీజన్లో ఆర్సీబీ జట్టును కెప్టెన్ కోహ్లి ఒంటి చేత్తో ఫైనల్‌కు చేర్చాడు. ఆ ఒక్క సీజన్లోనే తను ఏకంగా 973 పరుగులతో రికార్డు సృష్టించాడు. అయితే తమ తొలి ఏడు మ్యాచ్‌లో ఈ జట్టు గెలిచింది రెండు మాత్రమే.. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా జూలు విదల్చడంతో ప్లే ఆఫ్‌కు అర్హత సాధించడంతో పాటు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ లయన్స్‌ను మట్టికరిపించి తుది పోరుకు అర్హత సాధించినా, అక్కడ నిరాశే ఎదురైంది. తమ సొంత మైదానంలో జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడింది. ఈసారి ఎలాగైనా టైటిల్ తమదే అనే ఉద్దేశంతో బరిలోకి దిగనుంది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్... ఆర్సీబీకి అవసరానికి మించి బ్యాటింగ్ బలం ఉంది. మంచి సమతూకంతో జట్టును బరిలోకి దించాలనుకున్నప్పుడు టీమ్ మేనేజిమెంట్‌ను ఇదే అంశం ఇబ్బంది పెడుతోంది. ఈ సీజన్ కూడా జట్టు బ్యాటింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడనుంది. కోహ్లి, గేల్, డి విలియర్స్, వాట్సన్, సర్ఫరాజ్ ఖాన్‌లతో కూడిన ఈ విభాగం ఎలాంటి మ్యాచ్‌నైనా తమవైపునకు తిప్పుకోగలదు. అయితే కోహ్లి ఫామ్ అత్యంత కీలకం. ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో తను దారుణంగా విఫలం కావడం జట్టును ఆందోళనపరుస్తోంది. గాయం నుంచి కోలుకోవడంతో పాటు ఫామ్‌ను అందుకోవడంపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. గత సీజన్లో తను నాలుగు సెంచరీలతో 81.08 సగటు సాధించాడు. బౌలింగ్‌లో యజువేంద్ర చాహల్, అరవింద్ ప్రభావం చూపనున్నారు. బౌలింగ్‌లో నిలకడలేమి... బెంగళూరు జట్టు బలహీనత ఏదైనా ఉంటే అది తమ బౌలింగ్ విభాగమే.. తమ జట్టులో ఎంతమంది భీకర బ్యాట్స్‌మెన్ ఉన్నా ప్రత్యర్థి జట్టును స్వల్ప స్కోరుకు కట్టడి చేసి బ్యాట్స్‌మెన్‌పై భారం పడకుండా చూడడం బౌలర్ల బాధ్యత. ఈ విషయంలో మాత్రం ఇప్పటివరకు ఆర్సీబీ బౌలర్లు విఫలమవుతున్నారు. ఈ లోపాన్ని సరిచేసుకునేందుకే ఐపీఎల్– 10 ఆటగాళ్ల వేలంలో రూ.12 కోట్లను వెచ్చించి ఇంగ్లండ్‌కు చెందిన టి20 స్పెషలిస్ట్ బౌలర్ టైమల్ మిల్స్‌ను కొనుగోలు చేసుకుంది. అంతేకాకుండా పేసర్లు బిల్లీ స్టాన్లేక్, అనికేత్ చౌదరిలను కూడా తీసుకుని పటిష్టం చేసుకుంది. అయితే మిషెల్ స్టార్క్ జట్టు నుంచి తప్పుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. మూడుసార్లు రన్నరప్‌గా... గత తొమ్మిది ఐపీఎల్ సీజన్లలో బెంగళూరు జట్టు మూడుసార్లు ఫైనల్‌కు చేరుకొని మూడుసార్లు రన్నరప్‌గా నిలిచింది. 2009 ఫైనల్లో దక్కన్ చార్జర్స్ చేతిలో ఓడిన బెంగళూరు... 2010లో సెమీస్ వరకు చేరింది. ఆ తర్వాత 2011 ఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో, 2016 ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైంది. అంచనాలకు అనుగుణంగా రాణిస్తేనే... నెల రోజులపాటు జరిగే సుదీర్ఘ సీజన్లో ఫేవరెట్ ఎవరనేది కచ్చితంగా అంచనా వేయలేకపోయినా టైటిల్ గెలుచుకునే సత్తా మాత్రం ఆర్సీబీకి ఉందనడంలో అతిశయోక్తి లేదు. అయితే కీలక ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండడంతో ఈ జట్టూ ఫేవరెట్లలో ఒకటిగా చెప్పవచ్చు. అయితే బౌలర్ల నుంచి కూడా మెరుగైన ప్రదర్శన వస్తే జట్టుకు మంచిది. ప్లే ఆఫ్ దశకు చేరడం ఖాయమే.. కెప్టెన్‌గా డి విలియర్స్: కెప్టెన్ కోహ్లి భుజం నొప్పి కారణంగా ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవడంతో డి విలియర్స్‌ను కెప్టెన్‌గా నియమించే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి కోహ్లి పరిస్థితిపై స్పష్టత లేదని, రెండు మూడు రోజుల్లో ఏ విషయం తేలుతుందని కోచ్ వెటోరి అన్నారు. విరాట్ ఆడని పరిస్థితి ఉంటే మాత్రం డి విలియర్స్ బాధ్యత తీసుకుంటాడని చెప్పారు. అయితే అతను వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని, తమ దేశవాళీ టోర్నీ ఫైనల్‌కు దూరమయ్యాడని, ఈ సీజన్లో ఆడకపోవచ్చనే కథనాలు వినిపిస్తున్నాయి. జట్టు స్వదేశీ ఆటగాళ్లు: కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, యజువేంద్ర చాహల్, హర్షల్ పటేల్, మన్దీప్ సింగ్, ఎస్.అరవింద్, కేదార్ జాదవ్, స్టువర్ట్ బిన్నీ, ఇక్బాల్ అబ్దుల్లా, సచిన్ బేబీ, అవేష్ ఖాన్, పవన్ నేగి, అనికేత్ చౌదరి, ప్రవీణ్ దూబే. విదేశీ ఆటగాళ్లు: గేల్, డి విలియర్స్, వాట్సన్, ఆడమ్ మిల్నే, శామ్యూల్ బద్రీ, ట్రావిస్ హెడ్, షమ్సీ, స్టాన్లేక్, మిల్స్. -
‘దస్’ కా దమ్!
ఐ...పీ...ఎల్... ఇదో సంచలనం. దేశంలో క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చేస్తుందనుకుంటే... ఏకంగా క్రీడల దశనే మార్చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇది. భారత క్రీడల్లో ఒకటేమిటి... పీబీఎల్ (బ్యాడ్మింటన్), పీకేఎల్ (కబడ్డీ), పీడబ్ల్యూఎల్ (రెజ్లింగ్), ఐపీటీఎల్ (టెన్నిస్) ఇలా ఎన్నో లీగ్‌లకు ఇదే స్టార్టప్ కంపెనీ! తెరమీదికి మరికొన్ని క్రీడలకు, తెరముందు... వెనుక మరెంతో మంది ఆటగాళ్లకు కామధేనువు! ఫ్రాంచైజీలు... మొదలు ఆటగాళ్ల వేలం దాకా అన్నీ ఒకటికి మించి ఒకటి పెను సంచలనాలయ్యాయి. ఏటికేడు రేటింగ్‌ను, బ్రాండ్ ఇమేజ్ను పెంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల అభిమానుల్ని సంపాదించుకున్నట్లే ఆదాయార్జనలో కోట్లు కొల్లగొట్టింది. గడిచిన తొమ్మిదేళ్లలో ఆటలో అరటిపండులా వివాదాలు రేకెత్తినా అవన్నీ ఆటను, లీగ్ ప్రభను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. ఒకప్పుడు టీమిండియా మ్యాచ్‌లే క్రికెట్ మ్యాచ్‌లు. రంజీలున్నా అటువైపు కన్నెత్తి చూడం. కానీ ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్ మ్యాచ్‌లపైనే. అప్పట్లో 11 మందితో సరిపెట్టుకున్న ఆట ఇప్పుడు పదుల సంఖ్యలో వందల మంది యువ క్రికెటర్లకు రాచబాట అయ్యింది. మరో వారం రోజుల్లో (ఏప్రిల్ 5 నుంచి) ఐపీఎల్–10 సీజన్‌కు తెర లేవనుంది. ఈ నేపథ్యంలో గత తొమ్మిది సీజన్ల విశేషాలు క్లుప్తంగా... –సాక్షి క్రీడావిభాగం 2008 రాజస్తాన్‌లో తొలి వసంతం మెకల్లోలం (బ్రెండన్ మెకల్లమ్, కోల్‌కతా నైట్‌రైడర్స్–73 బంతుల్లో 158 నాటౌట్; 10 ఫోర్లు, 13 సిక్సర్లు)తో మొదలైన ఐపీఎల్ తొలి సీజన్ తొలి మ్యాచ్ ఒక రకంగా లీగ్ పుస్తకానికి పీఠిక అయ్యింది. ఐపీఎల్ ఎలా ఉండబోతుందో మెకల్లమ్ తన బ్యాట్‌తో చూపించాడు. ఇక అది మొదలు లీగ్ ముగిసేదాకా దంచుడే దంచుడు... బాదుడే బాదుడు! లీగ్‌లో ఏమాత్రం అంచనాల్లేని జట్టు రాజస్తాన్ రాయల్స్. స్టార్ క్రికెటర్ల కోసం కోట్లు పెట్టేందుకు మనసొప్పని ఈ జట్టు కుర్రాళ్లతో ఏకంగా టైటిల్‌నే నెగ్గుకొచ్చింది. టోర్నీ ఆసాంతం అనుభవజ్ఞుడైన షేన్ వార్న్ మేనియాలో కుర్రాళ్లు చక్కగా శ్రమించారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబైలో జరిగిన తుది పోరు ఆఖరి బంతిదాకా ఉత్కంఠంగా సాగింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. రాజస్తాన్ సరిగ్గా చివరి బంతి షాట్‌తో 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్‌లో షాన్ మార్ష్ (616; పంజాబ్), బౌలింగ్‌లో సొహైల్ తన్వీర్ (22; రాజస్తాన్) మెరిశారు. ఆరెంజ్ క్యాప్: షాన్ మార్ష్ పర్పుల్ క్యాప్: తన్వీర్ 2009 ‘దక్కన్’ దంచేసింది తొలి సీజన్ అంచనాలకు మించి విజయవంతమైంది. నిర్వాహకుల నుంచి ఆటగాళ్లదాకా అందరిలో ఒకటే ఉత్సాహం. కానీ భారత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండో సీజన్ రద్దు తప్పదేమోననే సందేహం అభిమానుల్ని తొలచింది. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఐపీఎల్ నిర్వాహకులు దక్షిణాఫ్రికాలో రెండో సీజన్‌ను నిర్వహించారు. అక్కడ ఈ లీగ్ సూపర్ హిట్. ఇక మ్యాచ్‌ల విషయానికొస్తే... కసి... కృషి... కలిస్తే చార్జింగ్కు తిరుగులేదని నిరూపించిన సీజన్ ఇది. గత ఈవెంట్లో అట్టడుగున నిలిచిన జట్టు (దక్కన్ చార్జర్స్) ఏడాది తిరిగే సరికి అసాధారణ ఆటతీరుతో టైటిల్ సాధించింది. తొలి సీజన్లో పాతాళానికి చేరిన దక్కన్ చార్జర్స్ (8వ స్థానం), బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (ఏడో స్థానం) జట్లు దెబ్బతిన్న పులులా విరుచుకుపడ్డాయి. ప్రత్యర్థులపై స్థిరమైన విజయాలతో అనూహ్యంగా ఈ రెండు జట్లే ఫైనల్‌కు అర్హత సాధించాయి. 6 పరుగుల తేడాతో దక్కన్‌ను విజయం వరించగా... బెంగళూరు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆరెంజ్ క్యాప్: హేడెన్ (572 పరుగులు; చెన్నై) పర్పుల్ క్యాప్: ఆర్పీ సింగ్ (23 వికెట్లు, దక్కన్ చార్జర్స్) 2010 చెన్నై ‘కింగ్’ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తమ రెండో ప్రయత్నంలో టైటిల్ సాధించింది. క్రికెట్ దిగ్గజం సచిన్ (ముం బై ఇండియన్స్) కుర్రాళ్లతో పోటీపడి చితక్కొట్టింది ఈ సీజన్లోనే! ముంబైలో ధోని, సచిన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్లో చెన్నై ‘కింగ్’ అయింది. మొదట రైనా మెరుపులతో చెన్నై 5వికెట్లకు 168 పరుగులు చేసిం ది. సచిన్ జోరు మీదున్న ఈ సీజన్లో ఛేదన ఏమీ కష్టం కాకపోయినా... అతని పోరాటానికి క్రీజులో నిలదొక్కుకున్న మరో బ్యాట్స్‌మన్ లేకపోవడంతో ముంబై మూల్యం చెల్లించుకుంది. చివరకు 9 వికెట్లకు 146 పరుగులకు పరిమితమైన ముంబై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆరెంజ్ క్యాప్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ: సచిన్ (618) పర్పుల్ క్యాప్: ప్రజ్ఞాన్ ఓజా (21; దక్కన్ చార్జర్స్) 2011 మళ్లీ చెన్నై చమక్ మూడు సీజన్లు విజయవంతమయ్యాయి. ఇంటా బయటా ఎనలేని క్రేజ్. దీంతో నిర్వాహకులు జట్లను పెంచారు. నాకౌట్ దశను మార్చారు. జట్లేమో 8 నుంచి 10కి చేరాయి. సెమీస్ నాకౌట్ మ్యాచ్‌లు కనుమరుగై ‘ప్లే ఆఫ్’ తెరమీదికొచ్చింది. దీంతో మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది. వీక్షకులు, టీవీ రేటింగ్ కూడా అదేస్థాయిలో పెరిగింది. లీగ్ ఆరంభం నుంచి నిలకడైన ఆటతీరును కనబరిచిన చెన్నై వరుసగా రెండోసారి టైటిల్ సాధిస్తే... రెండో మారు ఫైనల్కొచ్చినా... బెంగళూరు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. మొదట చెన్నై 20 ఓవర్లలో 205 పరుగుల భారీస్కోరు చేసింది. బదులుగా బెంగళూరు 8 వికెట్లకు 147 పరుగులతో చేతులెత్తేసింది. ఆరెంజ్ క్యాప్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ: గేల్ (608; బెంగళూరు) పర్పుల్ క్యాప్: మలింగ (28; ముంబై) 2012 బాద్షా కోల్‌కతా ఐపీఎల్లో ‘బాలీవుడ్ బాద్షా’ షారుఖ్ ఖాన్ (కోల్‌కతా) జట్టు విజేతగా నిలిచిన సీజన్ ఇది. మరోసారి కప్ కొట్టి ఐపీఎల్ చరిత్రలో హ్యాట్రిక్ రికార్డు కొల్లగొట్టాలనుకున్న చెన్నైకి కోల్‌కతా నైట్‌రైడర్స్ చెక్ పెట్టింది. తొలిసారి లీగ్, నాకౌట్ దశను దాటిన కోల్‌కతా నాలుగోసారి ఫైనలిస్టు (ఇందులో రెండు సార్లు చాంపియన్, ఒకసారి రన్నరప్) చెన్నై జట్టు సంతోషాన్ని ఆవిరి చేసింది. విండీస్ ఆటగాళ్లయిన గేల్ (బెంగళూరు), సునీల్ నరైన్ (కోల్‌కతా స్పిన్నర్) ఈ సీజన్‌ను శాసించారు. ఫైనల్లో రైనా దూకుడు, హస్సీ మెరుపులు వెరసి చెన్నై 190 పరుగులు చేసింది. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతాను ఓపెనర్ మన్విందర్ బిస్లా గట్టెక్కించాడు. కలిస్‌తో కలిసి అసాధారణ ఇన్నింగ్స్ ఆడి కోల్‌కతాకు తొలి టైటిల్ అందించాడు. ఆరెంజ్ క్యాప్: గేల్ (733; బెంగళూరు) పర్పుల్ క్యాప్: మోర్కెల్ (25; ఢిల్లీ) 2013 ముంబై మెరిసింది ఎట్టకేలకు ముంబై జట్టు ఐపీఎల్ టైటిల్ సాధించింది. ఈ సీజన్ ఆసాంతం చెన్నైతో పాటు దీటుగా ముంబై ఇండియన్స్ ఆడింది. లీగ్ దశలో ఇరు జట్లు 11 విజయాలతో సమవుజ్జీలుగా నిలిచాయి. తొలి క్వాలిఫయర్‌లో ముంబైపై గెలిచిన చెన్నై నేరుగా ఫైనల్‌కు చేరగా... రెండో క్వాలిఫయర్‌లో రాజస్తాన్‌ను ఓడించిన ముంబై... చెన్నైతో అమీతుమీకి సిద్ధమైంది. ఈడెన్ గడ్డపై జరిగిన టైటిల్ పోరులో ముంబై తొలుత 9 వికెట్లకు 148 పరుగులు చేసింది. జోరుమీదున్న చెన్నైకిది ఏమంత కష్టసాధ్యం కాకపోయినా ముంబై బౌలర్ల ముప్పేట దాడితో తోకముడిచింది. దీంతో రోహిత్ శర్మ సగర్వంగా ట్రోఫీని అందుకున్నాడు. ఆరెంజ్ క్యాప్: మైక్ హస్సీ (733 పరుగులు; చెన్నై) పర్పుల్ క్యాప్: బ్రేవో (చెన్నై; 32 వికెట్లు) 2014 మళ్లీ కోల్‌కతా కేక కోల్‌కతా నైట్‌రైడర్స్ మళ్లీ గర్జించింది. ఐపీఎల్లో రెండో టైటిల్‌ను అందుకుంది. మ్యాక్స్‌వెల్ శివమెత్తిన ఈ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టైటిల్ దిశగా సాగింది. అయితే తుదిమెట్టుపై కోల్‌కతా పరుగుల తాకిడికి తట్టుకోలేకపోయింది. ఫైనల్లో పంజాబ్ 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా... కోల్‌కతా ఆడుతూ పాడుతూ మరో మూడు బంతులు మిగిలుండగానే చేసేసింది. లక్ష్యఛేదనలో మనీశ్ పాండే (50 బంతుల్లో 94; 7 ఫోర్లు, 6 సిక్సర్లు ) ఇన్నింగ్స్ హైలైట్! ఆరెంజ్ క్యాప్: ఉతప్ప (660 పరుగులు, కోల్‌కతా) పర్పుల్ క్యాప్: మోహిత్ శర్మ (23 వికెట్లు; చెన్నై) 2015 ముంబై... రెండోసారి కోల్‌కతా వెన్నంటే ముంబై ఇండియన్స్ రెండో టైటిల్ సాధించింది. అప్పుడు, ఇప్పుడు ప్రత్యర్థి మాత్రం చెన్నై సూపర్ కింగ్సే. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసింది ముంబై ఇండియన్సే! కానీ ఈసారి మాత్రం (202/5) భారీస్కోరు చేసింది. ఛేదనలో ముంబై బౌలర్లు మలింగ, మెక్లీనగన్, హర్భజన్, వినయ్ సమష్టిగా చెన్నై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంతో 161/8 స్కోరుతోనే సరిపెట్టుకుంది. ఆరెంజ్ క్యాప్: వార్నర్ (562, హైదరాబాద్) పర్పుల్ క్యాప్: బ్రేవో (26; చెన్నై) 2016 సన్ ‘రైజింగ్’ విక్టరీ ఈ సీజనంతా కోహ్లి విశ్వరూపమే కనిపించింది. అతనొక్కడే 973 పరుగులు చేశాడు. మరోవైపు చాపకింద నీరులా సన్‌రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా ఎలిమినేటర్‌ను దాటి తుదిపోరుకు అర్హత సంపాదించింది. ఫైనల్లో హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగుల భారీస్కోరు చేసింది. తర్వాత బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కూడా గేల్, కోహ్లిల తుఫాన్ ఇన్నింగ్స్‌కు లక్ష్యం దిశగా సాగింది. వారిద్దరు అవుటయ్యాక మిగతా వారంతా చేతులెత్తేయడంతో బెంగళూరు 7 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఆరెంజ్ క్యాప్: కోహ్లి (973; బెంగళూరు) పర్పుల్ క్యాప్: భువనేశ్వర్ (23; హైదరాబాద్) -
సంతకం చేస్తేనే ప్రపంచకప్ కు....
కవిండీస్ క్రికెటర్లకు బోర్డు హెచ్చరిక చెల్లింపులపై ముదిరిన సంక్షోభం కింగ్స్టన్: దాదాపు ఏడాదిన్నర క్రితం వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య చెల్లింపుల విషయంలో రాజుకున్న వివాదం ఇంకా ఆరలేదు. ఇప్పుడు టి20 ప్రపంచకప్‌కు ముందు కూడా మళ్లీ అదే కారణంతో ఇరు వర్గాల మధ్య సమస్య తీవ్రమైంది. ప్రపంచకప్ కోసం ఎంపికైన 15 మంది ఆటగాళ్లు కూడా బోర్డు ప్రతిపాదించిన అన్ని నిబంధనలను అంగీకరిస్తూ కాంట్రాక్ట్‌పై సంతకం చేయాలని సీఈఓ మైకేల్ ముర్హెడ్ ఆటగాళ్లకు హెచ్చరిక జారీ చేశారు. అందుకు ఆదివారం తుది గడువుగా నిర్దేశించారు. అయితే బోర్డు చెబుతున్న మొత్తం చాలా తక్కువని, ఇది దుర్మార్గమంటూ జట్టు కెప్టెన్ స్యామీ తమ అసంతృప్తిని తెలియజేస్తూ లేఖ రాయడంతో పరిస్థితి ముదిరింది. తమ వేతనాలను 80 శాతం తగ్గించారని... డబ్బులు పెంచకపోతే కుదరదని స్యామీ అంటున్నాడు. ప్రస్తుత నిబంధనల్లో ఒక్క మార్పూ చేయమని, అవసరమైతే ఈ ఆటగాళ్లను తప్పించి ద్వితీయ శ్రేణి జట్టును పంపించడానికైనా తాము సిద్ధమని ముర్హెడ్ గట్టిగా చెప్పడంతో వరల్డ్‌కప్‌కు గేల్, బ్రేవోలాంటి స్టార్లు దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. -
అడుగడుగునా నిర్లక్ష్యం
తిరుపతి తుడా: గాలేరు- నగిరి సుజల స్రవంతి ప్రాజెక్టుకు అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇప్పటికీ అటవీ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టును ప్రారంభించాలని కోరడం ఆశ్చర్యం. గాలేరు-నగరి ప్రాజెక్టు ఎనిమిదో ప్యాకేజీ కింద కాలువ పనులు ప్రారంభించాలంటే తప్పనిసరిగా అటవీ అనుమతులు అవసరం. ఈ పరిధిలోని భూమికి బదులుగా ప్రత్యామ్యాయ భూములను ఇవ్వాలని అటవీశాఖ కోరుతోంది. ఆ భూములను కలెక్టర్ చూపించి అనుమతులు కోరితే ఇవ్వడానికి అటవీశాఖ సిద్ధంగా ఉంది. అయినా ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చిత్తూరు జిల్లాకు తాగునీరు అందించేందకు గాలేరు-నగిరి ప్రాజెక్టుకు రూపకల్పన దిద్దారు. ఆయన మరణానంతరం 9 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టు ఊసే లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2007లో ఈప్రాజెక్టును మళ్లీ తెరపైకి తెచ్చారు. పనులు వేగవం తం చేయాలని ఆదేశించారు. అందుకు తగ్గట్టే నిధులను కేటాయించారు. ఆయన సీఎంగా ఉన్నంతకాలం కాలువ పనులు (ఒకటి నుంచి ఏడవ ప్యాకేజీ వరకు) శరవేగంగా పరుగులు తీశాయి. ఆయన మరణానంతరం ఈ ప్రాజెక్టు మళ్లీ మరుగున పడింది. 2009 నుంచి అనుమతులకు ప్రయత్నం గాలేరి-నగిరి ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే కోడూరు ప్రాంతంలోని శెట్టిపల్లి నుంచి నగరి వరకు 94 కిలోమీటర్ల పరిధి తిరుపతి సర్కిల్‌లోకి వస్తుంది. శెటిపల్లి నుంచి తిరుపతి అలిపిరి ప్రాంతం వరకు 25 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో కాలువ పయనిస్తుంది. 1225 హెక్టార్ల అటవీ భూమి అవసరమని, 2009లో అటవీశాఖ అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపారు. అనుమతులు ఇచ్చేందుకు తమకు ఎలాంటి ఇబ్బందిలేదని అయితే అటవీ అభివృద్ధికి తమకు ప్రత్యామ్నాయంగా మరెక్కడైనా 1225 హెక్టార్ల భూమి ఇవ్వాలని అటవీశాఖ కోరింది. అయితే అదే ఏడాదిలో అప్పటి జిల్లా కలెక్టర్ అటవీ శాఖ కోరిన భూమిని ఇచ్చేందుకు 12 ప్రాంతాల్లో స్థలాన్ని చూపించారు. ఆ 12 ప్రాంతాల్లోని భూముల్లో అటవీ అభివృద్ధి చేయలేమని అటవీ శాఖ నిరాకరించింది. ఒకటి రెండు ప్రాంతాల్లో భూమిని చూపాలని తిరిగి 2010లో అటవీ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఈ విషయాలను విస్మరించాయి. అటవీశాఖ కోరిన భూమిని ప్రభుత్వం చూపించకపోగా అప్పటి నుంచి ఇప్పటివరకు అటవీశాఖ అనుమతుల కోసం ప్రయత్నం కూడా చేయలేదు. అటవీ అనుమతులు లేకనే మళ్లీ అడుగులు జూలై మూడో వారం గాలేరి-నగరి ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. తిరుపతి సర్కిల్ రీచ్‌ను ఎనిమిది నుంచి 14 ప్యాకేజీలుగా ప్రభుత్వం నిర్ణయించి పనులు చేయాలని సూచించింది. ఇందుకు కాం ట్రాక్టర్లు ముందుకు రావాలని కోరింది. ఎనిమిదో ప్యాకేజీకి ఓ ప్రముఖ సంస్థ పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే పనులు ప్రారంభించాలంటే ముందు అటవీశాఖ అనుమతులు పొందాల్సిఉంది. జిల్లా కలెక్టర్ అటవీ శాఖకు ఇవ్వాల్సిన 1225 హెక్టార్ల భూమిని పరిశీలించి కేటాయిస్తే అనుమతులకు మార్గం దాదాపు దొరికినట్టే. అలాంటి ప్రయత్నాలు చేయకుండా పనులు ఎలా ప్రారంభిస్తారో తెలియడంలేదని ఓ అటవీ శాఖ అధికారి అనుమానం వ్యక్తం చేశారు.