నిలకడలేని ఆటతీరుకు మారుపేరైన పంజాబ్ కింగ్స్ జట్టు ఈసారి మాత్రం ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ లీగ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసి... ఆ తర్వాత ఛేజింగ్‌ను కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందుండి నడిపించాడు. దాంతో పంజాబ్ కింగ్స్ మరో 14 బంతులు మిగిలి ఉండగానే విజయ తీరాన్ని చేరింది. అన్నింటా విఫలమైన ముంబై ఇండియన్స్ ఈ లీగ్‌లో తమ ఖాతాలో మూడో ఓటమిని జమ చేసుకుంది.
చెన్నై: తొలి మ్యాచ్‌లో గెలిచి... ఆ తర్వాత హ్యాట్రిక్ పరాజయాలతో డీలా పడ్డ పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ టోర్నీలో మళ్లీ గెలుపు బాట పట్టింది. ఇక్కడి చెపాక్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పటిష్ట ముంబై ఇండియన్స్‌పై 9 వికెట్లతో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో విఫలమైన రోహిత్ శర్మ బృందం సీజన్‌లో మూడో ఓటమిని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 పరుగులు చేసింది.
ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (52 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి సూర్య కుమార్ (27 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) సహకారం అందించాడు. పంజాబ్ బౌలర్లు రవి బిష్ణోయ్ (2/21), షమీ (2/21) ప్రత్యర్థిని కట్టడి చేశారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 132 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (52 బంతుల్లో 60 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా... గేల్ (35 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిశాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు అజేయంగా 79 పరుగులు జోడించారు.
ఇబ్బంది పడుతూ...
టాస్ ఓడి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌కు దిగగా... డికాక్ (3) మరోసారి విఫలమయ్యాడు. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై ముంబై బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించడానికి ఇబ్బంది పడ్డారు. ఐదో ఓవర్ చివరి బంతి వరకు ఒక్క బౌండరీ లేకుండానే ముంబై ఇన్నింగ్స్ సాగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికి రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్ శర్మ... ఎట్టకేలకు ఐదో ఓవర్ చివరి బంతికి షార్ట్ ఫైన్‌లెగ్ మీదుగా బౌండరీ బాదాడు. పవర్‌ప్లేలో ముంబై వికెట్ నష్టపోయి 21 పరుగులు మాత్రమే చేసింది. ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే. తాజా ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడిన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన తొలి ఓవర్‌లోనే ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న ఇషాన్ కిషన్ (6)ను అవుట్ చేశాడు. దాంతో ముంబై రెండో వికెట్‌ను కోల్పోయింది.
ఆదుకున్న కెప్టెన్
జట్టు సారథిగా ముంబై ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే బాధ్యతను రోహిత్ శర్మ తన భుజాలపై వేసుకొని ఓపికతో ఆడాడు. అతడికి సూర్యకుమార్ సహకరించాడు. ఫాబియాన్ అలెన్ వేసిన 8వ ఓవర్‌లో బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు కొట్టిన రోహిత్... అతడి తర్వాతి ఓవర్లోనూ లాంగాన్ మీదుగా సిక్సర్ కొట్టడంతో ముంబై స్కోరు 10 ఓవర్లు ముగిసేసరికి 49/2గా నిలిచింది. మరో ఎండ్‌లో ఉన్న సూర్యకుమార్ కూడా 4, 6 కొట్టడంతో ముంబై స్కోరు బోర్డు వేగం అందుకుంది.
14వ ఓవర్ రెండో బంతిని ఫోర్ కొట్టిన రోహిత్ 40 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ముంబై 15.2 బంతుల్లో 100 పరుగుల మార్కును దాటింది. అయితే రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌నకు ప్రయత్నించి సూర్యకుమార్ అవుటయ్యాడు. దాంతో 79 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. కొద్ది సేపటికే రోహిత్ కూడా వెనుదిరిగాడు. పాండ్యా బ్రదర్స్ హార్దిక్ (1), కృనాల్ (3) నిరాశపరిచారు. చివర్లో పొలార్డ్ (12 బంతుల్లో 16 నాటౌట్; 1 సిక్స్) ధాటికి ముంబై 130 పరుగుల మార్కును దాటగలిగింది.
రాహుల్ జోరు...
పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తన సూపర్ ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు రాహుల్, మయాంక్ అగర్వాల్ (20 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్) హిట్టింగ్‌కే ప్రాధాన్యత ఇచ్చారు. కృనాల్ పాండ్యా వేసిన రెండో ఓవర్‌లో రాహుల్ రెండు ఫోర్లు కొట్టగా... మయాంక్ ఒక సిక్సర్ బాదడంతో 15 పరుగులు లభించాయి. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో రాహుల్ ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ కొట్టాడు.
బౌల్ట్ బౌలింగ్‌లో మయాంక్ రెండు ఫోర్లు సాధించడంతో... పంజాబ్ 4 ఓవర్లలో 37 పరుగులు చేసింది. ఇక పేసర్లతో లాభం లేదనుకున్న రోహిత్ స్పిన్నర్లను బరిలోకి దించాడు. రాహుల్ చహర్, జయంత్ యాదవ్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో పంజాబ్ ఇన్నింగ్స్ లో దూకుడు తగ్గింది. దాంతో కాస్త ఒత్తిడికి లోనైన మయాంక్... రాహుల్ చహర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో 53 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్‌ను కోల్పోయింది.
క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్ కుదురుకోవడానికి ప్రయత్నించడం... మరో ఎండ్‌లో రాహుల్ కూడా తన దూకుడును తగ్గించడంతో మ్యాచ్‌పై ముంబై పట్టుబిగించేలా కనిపించింది. అయితే క్రీజులో కుదురుకున్నాక గేల్ షాట్లు ఆడటం మొదలు పెట్టాడు. జయంత్ బౌలింగ్‌లో అతడు రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టగా... పొలార్డ్ వేసిన ఓవర్లో రాహుల్ ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో రాహుల్ 50 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. సీజన్‌లో అతడికిది మూడో అర్ధ సెంచరీ. పంజాబ్ విజయానికి 18 బంతుల్లో 17 పరుగులు అవసరమైన తరుణంలో... బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ తొలి బంతిని గేల్ సిక్సర్ కొట్టి రెండో బంతికి సింగిల్ తీశాడు. స్ట్రయిక్‌లోకి వచ్చిన రాహుల్ వరుస బంతుల్లో 6, 4 కొట్టి మ్యాచ్‌ను ముగించేశాడు.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) హెన్రిక్స్ (బి) దీపక్ హుడా 3; రోహిత్ శర్మ (సి) అలెన్ (బి) షమీ 63; ఇషాన్ కిషన్ (సి) రాహుల్ (బి) రవి బిష్ణోయ్ 6; సూర్యకుమార్ యాదవ్ (సి) క్రిస్ గేల్ (బి) రవి బిష్ణోయ్ 33; పొలార్డ్ (నాటౌట్) 16; హార్దిక్ పాండ్యా (సి) దీపక్ హుడా (బి) అర్ష్‌దీప్ సింగ్ 1; కృనాల్ పాండ్యా (సి) పూరన్ (బి) షమీ 3; జయంత్ యాదవ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 131.
వికెట్ల పతనం: 1–7, 2–26; 3–105, 4–112, 5–122, 6–130.
బౌలింగ్: హెన్రిక్స్ 3–0–12–0, దీపక్ హుడా 3–0–15–1, షమీ 4–0–21–2, రవి బిష్ణోయ్ 4–0–21–2, ఫాబియాన్ అలెన్ 3–0–30–0, అర్ష్‌దీప్ సింగ్ 3–0–28–1.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (నాటౌట్) 60; మయాంక్ అగర్వాల్ (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) రాహుల్ చహర్ 25; క్రిస్ గేల్ (నాటౌట్) 43; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.4 ఓవర్లలో వికెట్ నష్టపోయి) 132.
వికెట్ల పతనం: 1–53.
బౌలింగ్: బౌల్ట్ 2.4–0–30–0, కృనాల్ పాండ్యా 3–0–31–0, బుమ్రా 3–0–21–0, రాహుల్ చహర్ 4–0–19–1, జయంత్ యాదవ్ 4–0–20–0, పొలార్డ్ 1–0–11–0.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రాహుల్
IPL 2021 PBKS vs MI: పంజాబ్ ప్రతాపం
Published Sat, Apr 24 2021 5:01 AM | Last Updated on Sat, Apr 24 2021 11:06 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment