అడుగడుగునా నిర్లక్ష్యం
తిరుపతి తుడా: గాలేరు- నగిరి సుజల స్రవంతి ప్రాజెక్టుకు అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇప్పటికీ అటవీ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టును ప్రారంభించాలని కోరడం ఆశ్చర్యం. గాలేరు-నగరి ప్రాజెక్టు ఎనిమిదో ప్యాకేజీ కింద కాలువ పనులు ప్రారంభించాలంటే తప్పనిసరిగా అటవీ అనుమతులు అవసరం. ఈ పరిధిలోని భూమికి బదులుగా ప్రత్యామ్యాయ భూములను ఇవ్వాలని అటవీశాఖ కోరుతోంది. ఆ భూములను కలెక్టర్ చూపించి అనుమతులు కోరితే ఇవ్వడానికి అటవీశాఖ సిద్ధంగా ఉంది. అయినా ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదు.
ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చిత్తూరు జిల్లాకు తాగునీరు అందించేందకు గాలేరు-నగిరి ప్రాజెక్టుకు రూపకల్పన దిద్దారు. ఆయన మరణానంతరం 9 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టు ఊసే లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2007లో ఈప్రాజెక్టును మళ్లీ తెరపైకి తెచ్చారు. పనులు వేగవం తం చేయాలని ఆదేశించారు. అందుకు తగ్గట్టే నిధులను కేటాయించారు. ఆయన సీఎంగా ఉన్నంతకాలం కాలువ పనులు (ఒకటి నుంచి ఏడవ ప్యాకేజీ వరకు) శరవేగంగా పరుగులు తీశాయి. ఆయన మరణానంతరం ఈ ప్రాజెక్టు మళ్లీ మరుగున పడింది.
2009 నుంచి అనుమతులకు ప్రయత్నం
గాలేరి-నగిరి ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే కోడూరు ప్రాంతంలోని శెట్టిపల్లి నుంచి నగరి వరకు 94 కిలోమీటర్ల పరిధి తిరుపతి సర్కిల్‌లోకి వస్తుంది. శెటిపల్లి నుంచి తిరుపతి అలిపిరి ప్రాంతం వరకు 25 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో కాలువ పయనిస్తుంది. 1225 హెక్టార్ల అటవీ భూమి అవసరమని, 2009లో అటవీశాఖ అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపారు. అనుమతులు ఇచ్చేందుకు తమకు ఎలాంటి ఇబ్బందిలేదని అయితే అటవీ అభివృద్ధికి తమకు ప్రత్యామ్నాయంగా మరెక్కడైనా 1225 హెక్టార్ల భూమి ఇవ్వాలని అటవీశాఖ కోరింది. అయితే అదే ఏడాదిలో అప్పటి జిల్లా కలెక్టర్ అటవీ శాఖ కోరిన భూమిని ఇచ్చేందుకు 12 ప్రాంతాల్లో స్థలాన్ని చూపించారు. ఆ 12 ప్రాంతాల్లోని భూముల్లో అటవీ అభివృద్ధి చేయలేమని అటవీ శాఖ నిరాకరించింది. ఒకటి రెండు ప్రాంతాల్లో భూమిని చూపాలని తిరిగి 2010లో అటవీ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఈ విషయాలను విస్మరించాయి. అటవీశాఖ కోరిన భూమిని ప్రభుత్వం చూపించకపోగా అప్పటి నుంచి ఇప్పటివరకు అటవీశాఖ అనుమతుల కోసం ప్రయత్నం కూడా చేయలేదు.
అటవీ అనుమతులు లేకనే మళ్లీ అడుగులు
జూలై మూడో వారం గాలేరి-నగరి ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. తిరుపతి సర్కిల్ రీచ్‌ను ఎనిమిది నుంచి 14 ప్యాకేజీలుగా ప్రభుత్వం నిర్ణయించి పనులు చేయాలని సూచించింది. ఇందుకు కాం ట్రాక్టర్లు ముందుకు రావాలని కోరింది. ఎనిమిదో ప్యాకేజీకి ఓ ప్రముఖ సంస్థ పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే పనులు ప్రారంభించాలంటే ముందు అటవీశాఖ అనుమతులు పొందాల్సిఉంది. జిల్లా కలెక్టర్ అటవీ శాఖకు ఇవ్వాల్సిన 1225 హెక్టార్ల భూమిని పరిశీలించి కేటాయిస్తే అనుమతులకు మార్గం దాదాపు దొరికినట్టే. అలాంటి ప్రయత్నాలు చేయకుండా పనులు ఎలా ప్రారంభిస్తారో తెలియడంలేదని ఓ అటవీ శాఖ అధికారి అనుమానం వ్యక్తం చేశారు.