సాక్షి, హైదరాబాద్: కోహ్లి కొడితే కొండ కూడా పిండి కావాలి. ఉప్పల్‌లో గురువారం సరిగ్గా అదే జరిగింది. ఛేజింగ్‌లో కోహ్లి ఉప్పెనల్లే చెలరేగడంతో బెంగళూరు 8 వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను సులువుగా ఓడించింది. మొదట సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను క్లాసెన్ (51 బంతుల్లో 104; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) అంతా తానై మెరిపించాడు. హైదరాబాద్ అంతపెద్ద స్కోరు చేస్తే సొంతగడ్డపై సిరాజ్ (4–0–17–1) పొదుపుగా బౌలింగ్ చేశాడు. అనంతరం బెంగళూరు 19.2 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 187 పరుగులు చేసి గెలిచింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (63 బంతుల్లో 100; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఆరో సెంచరీ నమోదు చేయగా... డుప్లెసిస్ (47 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా ఆడుకున్నాడు. ఈ శతకంతో ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా క్రిస్ గేల్ (6 సెంచరీలు) పేరిట ఉన్న రికార్డును కోహ్లి సమం చేశాడు. అంతేకాకుండా ఒకే జట్టు తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా కోహ్లి నిలిచాడు.
అతనొక్కడే...
హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ (11), రాహుల్ త్రిపాఠి (15) నిరాశపరిచారు. వీరిద్దరిని బ్రేస్‌వెల్ ఒకే ఓవర్లో పడగొట్టేశాడు. వాళ్లు చేసింది తక్కువే అయినా ఆ ప్రభావం ఇన్నింగ్స్‌పై పడకుండా క్లాసెన్ దూకుడుగా నడిపించాడు. కెప్టెన్ మార్క్‌రమ్ (20 బంతుల్లో 18) అండతో సన్‌రైజర్స్ స్కోరును అదే పనిగా పెంచాడు.
ఈ క్రమంలో బౌండరీలు సిక్సర్లు అవలీలగా బాదేశాడు. క్లాసెన్ వీరబాదుడుతో బలమైన భాగస్వామ్యం వేగంగా నమోదైంది. మార్క్‌రమ్‌ను బౌల్డ్ చేసి షహబాజ్ 76 పరుగుల భాగస్వామ్యానికి ముగింపు పలికినా... క్లాసెన్ బ్యాటింగ్ జోరు, పరుగుల హోరేం తగ్గనేలేదు. 49 బంతుల్లోనే శతక్కొట్టేశాడు. ఎట్టకేలకు 19వ ఓవర్లో అతని విధ్వంసానికి హర్షల్ తెరదించాడు.
చకచకా లక్ష్యం వైపు...
లక్ష్యం కష్టమైందే... మ్యాచ్ ఆర్‌సీబీకి కీలకమైంది. అందుకే ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ ఛేదనకు తగ్గట్లే అడుగులు వేశారు. చకచకా పరుగులు చేశారు. బౌండరీలతో స్కోరుబోర్డును పరుగెత్తించి... సిక్సర్లతో స్టేడియాన్ని హుషారెత్తించారు.
ప్రేక్షకులంతా సొంతజట్టు కంటే బెంగళూరు జట్టుకే జై కొట్టడంతో రెట్టించిన ఉత్సాహంతో ఓపెనింగ్ జోడీ చెలరేగిపోయింది. ఇద్దరు కూడా కలసికట్టుగా చితగ్గొట్టేయడంతో పవర్‌ప్లేలో ఆర్సీబీ 64/0 స్కోరు చేసింది. 11.1 ఓవర్లలో వంద పరుగుల్ని ఏ కష్టం లేకుండా దాటింది. లక్ష్యతీరానికి చేరాక ఓపెనర్లిద్దరు అవుటైనప్పటికీ మ్యాక్స్‌వెల్ (5 నాటౌట్), బ్రేస్‌వెల్ (4 నాటౌట్) డ్రామా లేకుండా ముగించారు.
ఉప్పల్‌లో ఊపేశాడు...
ముందుగా డుప్లెసిస్ (34 బంతుల్లో) ఫిఫ్టీ చేస్తే తర్వాతి ఓవర్లోనే కోహ్లి 35 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. అర్ధసెంచరీ అయ్యాక కోహ్లి ఆట మరో లెవెల్‌కు చేరింది. ఛేదనలో మొనగాడిగా పేరున్న కోహ్లి తన పాత ‘విరాట్‌రూపం’ చూపించాడు. డ్రైవ్, కట్, హుక్ ఇలా కచ్చితత్వంతో కూడిన షాట్లు అతని బ్యాట్ నుంచి జాలువారడంతో కొండంత లక్ష్యం ఐస్‌ముక్కలా కరిగిపోయింది. మరో 27 బంతుల్లోనే కింగ్ కోహ్లి 50 నుంచి 100 పరుగులకు చేరుకున్నాడు.
భువీ వేసిన 18వ ఓవర్ నాలుగో బంతికి కోహ్లి డీప్ మిడ్‌వికెట్ మీదుగా కొట్టిన సిక్సర్‌తో స్టేడియం ఊగిపోయింది. డగౌట్‌లోని సహచరులే కాదు... గ్యాలరీలోని ప్రేక్షకులంతా కరతాళధ్వనులతో సవ్వడి చేశారు. అతని అసాధారణ ఇన్నింగ్స్‌కు ముగ్దులైన ప్రత్యర్థులు సైతం హ్యాట్సాఫ్ చెప్పారు. మరుసటి బంతికి అతను అవుటై నిష్క్రమిస్తుంటే స్టేడియం హోరెత్తింది.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) మహిపాల్ (బి) బ్రేస్‌వెల్ 11; త్రిపాఠి (సి) హర్షల్ (బి) బ్రేస్‌వెల్ 15; మార్క్‌రమ్ (బి) షహబాజ్ 18; క్లాసెన్ (బి) హర్షల్ 104; బ్రూక్ (నాటౌట్) 27; ఫిలిప్స్ (సి) పార్నెల్ (బి) సిరాజ్ 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–27, 2–28, 3–104, 4–178. 5–186. బౌలింగ్: సిరాజ్ 4–0–17–1, పార్నెల్ 4–0–35–0, బ్రేస్‌వెల్ 2–0–13–2, షహబాజ్ 3–0–38–1, హర్షల్ 4–0–37–1, కరణ్ శర్మ 3–0–45–0.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ఫిలిప్స్ (బి) భువనేశ్వర్ 100; డుప్లెసిస్ (సి) త్రిపాఠి (బి) నటరాజన్ 71; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 5; బ్రేస్‌వెల్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.2 ఓవర్లలో 2 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–172, 2–177. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–48–1, అభిషేక్ శర్మ 3–0–28–0, నటరాజన్ 4–0–34–1, త్యాగి 1.2–0–21–0, నితీశ్ కుమార్ రెడ్డి 2–0–19–0, మయాంక్ డాగర్ 4–0–25–0, ఫిలిప్స్ 1–0–10–0.
ఐపీఎల్‌లో నేడు
పంజాబ్ VS రాజస్తాన్ (రాత్రి గం. 7:30 నుంచి)
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment