ఆరెంజ్.. ఓ రేంజ్‌లో... | Sunrisers Hyderabad is a grand victory in ipl 9 final match | Sakshi
Sakshi News home page

ఆరెంజ్.. ఓ రేంజ్‌లో...

Published Mon, May 30 2016 1:52 AM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

ఆరెంజ్.. ఓ రేంజ్‌లో...

ఆరెంజ్.. ఓ రేంజ్‌లో...

ప్రత్యర్థి బలం ఏదైనా కావచ్చు... మన బలాన్ని నమ్ముకుని యుద్ధం చేస్తేనే గెలుస్తాం... ఐపీఎల్ ఫైనల్లో డేవిడ్ వార్నర్ ఆలోచన ఇది. అందుకే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చిన్నస్వామి లాంటి చిన్న స్టేడియంలో కోహ్లి, డివిలియర్స్, గేల్ లాంటి స్టార్ ఛేజర్స్ ఉన్న జట్టు మీద తొలుత బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని కాపాడుకోవడం అంటే కత్తిమీద సామే. కానీ మన బలం బౌలింగే కాబట్టి రిస్క్ తీసుకున్నాడు. వార్నర్ ఈ సీజన్‌లో ఇలాంటి రిస్క్‌లు చాలా తీసుకోబట్టే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ గెలిచింది.
 
 
సాక్షి క్రీడావిభాగం ఫైనల్ ఆరంభానికి ముందు కచ్చితంగా బెంగళూరు జట్టే ఫేవరెట్. కోహ్లి, డివిలియర్స్ ఫామ్, సొంత మైదానంలో ఆడటం లాంటి అంశాల వల్ల రాయల్ చాలెంజర్స్ తిరుగులేని శక్తిగా కనిపించింది. కానీ హైదరాబాద్ జట్టు ఓ లయతో ఫైనల్‌కు వచ్చింది. వరుసగా ఐదు రోజుల్లో మూడో మ్యాచ్ ఆడటం... రెండు వరుస విజయాలతో తుది పోరుకు రావడం వల్ల జట్టు మంచి జోరు మీద కనిపించింది. అది ఫైనల్ ఆటతీరులోనూ కనిపించింది.


ఎప్పటిలాగే వార్నర్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. గతంలో చాలా మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన శిఖర్ ధావన్ ఫైనల్లో నిలబడటంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి సన్ పటిష్ట స్థితిలో ఉంది. ధావన్ అవుటయ్యాక, హెన్రిక్స్ కూడా చెత్త షాట్‌తో వెనుదిరగడంతో కొంత ఒత్తిడి పెరిగినా... అది వార్నర్ ఆట మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. తన జోరును అలాగే కొనసాగించాడు. యువరాజ్ కూడా మంచి టచ్‌లో కనిపించడంతో హైదరాబాద్ 220 మార్కును సులభంగా దాటుతుందని అనిపించింది. నిజానికి బెంగళూరు లాంటి బలమైన జట్టును సొంత మైదానంలో ఓడించాలంటే ఆ మాత్రం స్కోరు కావాలి. అయితే మధ్య ఓవర్లలో వరుస వికెట్లు జట్టును కాస్త వెనక్కి నెట్టాయి. 17 ఓవర్లకు 156 పరుగులు మాత్రమే చేసిన సమయంలో 200 చేయడం కూడా కష్టంగా కనిపించింది. కానీ బెన్ కటింగ్ సంచలన ఇన్నింగ్స్ పుణ్యమాని 208 పరుగులు చేయడంతో జట్టులో మళ్లీ ఆశలు మొలకెత్తాయి.


 ఆ ఇద్దరే ఆదుకున్నారు
క్రిస్ గేల్, విరాట్ కోహ్లి సంచలన హిట్టింగ్‌తో బెంగళూరు విజయం దిశగా దూసుకుపోయింది. ఈ ఇద్దరూ క్రీజులో ఉన్నంతసేపు హైదరాబాద్‌కు ఏ మాత్రం అవకాశాలు లేవు. మళ్లీ కటింగ్ వచ్చి ఈసారి బంతితో ఆదుకున్నాడు. గేల్‌ను అవుట్ చేసి బెంగళూరు జోరుకు బ్రేక్ వేశాడు. అయితే మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ మాత్రం వరుసగా రెండు ఓవర్లలో కోహ్లి, డివిలియర్స్ అవుట్ కావడమే. ఫైనల్ లాంటి మ్యాచ్‌లో ఉండే ఒత్తిడిని తట్టుకోవాలంటే కోహ్లి, డివిలియర్స్‌లో ఒకరు కచ్చితంగా క్రీజులో ఉండాలి. అందుకే అవుట్ కాగానే కోహ్లి చాలా నిరాశగా బ్యాట్‌ను నేలకేసి కొడుతూ వెళ్లాడు. చివరి నాలుగు ఓవర్లలో భువనేశ్వర్, ముస్తఫిజుర్ చెరో రెండు ఓవర్లు వేస్తారు కాబట్టి ఆ ఓవర్లలో పరుగులు చేయడం కష్టం. దాంతో మిగిలిన బౌలర్లను టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో ఆడి వికెట్లు పోగొట్టుకోవడం బెంగళూరును దెబ్బతీసింది. చివరి నాలుగు ఓవర్లలో 47 పరుగులు చేయాల్సిన దశలో బెంగళూరుకు ఇంకా అవకాశం ఉంది.

కానీ ముస్తఫిజుర్ వాట్సన్‌ను అవుట్ చేసి కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ సీజన్ ఆసాంతం డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ మరోసారి అదే జోరుతో ఆకట్టుకున్నాడు. చివరి నాలుగు ఓవర్లలో ఈ ఇద్దరు సీమర్ల నిలకడతో సన్‌రైజర్స్ సగర్వంగా చాంపియన్స్‌గా అవతరించింది. అన్నట్లు 2009 ఫైనల్లోనూ హైదరాబాద్ (అప్పటి డెక్కన్ చార్జర్స్) బెంగళూరుపైనే నెగ్గి టైటిల్ సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement