క్రికెట్ కంటే దేశమే ముఖ్యం
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ నటులపై నిషేధం విధించడంపై బాలీవుడ్ పరిశ్రమ భిన్నంగా స్పందిస్తోంది. కొందరు పాక్ నటులకు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడారు. కాగా పాక్తో క్రీడా సంబంధాల విషయంపై క్రీడా వర్గాల నుంచి దాదాపు ఏకాభిప్రాయం వస్తోంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తామని క్రీడాకారులు చెబుతున్నారు.
తనకు క్రికెట్ కంటే దేశమే ముఖ్యమని క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతుగా నిలుస్తామన్నాడు. పాక్తో క్రికెట్ ఆడబోమని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని క్రికెటర్లు స్వాగతించారు. బీసీసీఐ, ప్రభుత్వ వైఖరిని సమర్థిస్తామని మరో క్రికెటర్ పార్థివ్ పటేల్ అన్నాడు. క్రికెటర్లతో పాటు ఇతర క్రీడలకు చెందిన ఆటగాళ్లు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.