ఏబీడీ...ఏబీడీ...
మార్మోగిన చిన్నస్వామి స్టేడియం
బెంగళూరు: చూడటానికి ఇదేమీ ఐపీఎల్ మ్యాచ్ కాదు.. అలాగని ఆడుతున్నది భారత క్రికెటరూ కాడు. అయినా సరే బెంగళూరు అభిమానులు ఓ వ్యక్తిపై తమ అభిమానాన్ని పెద్ద ఎత్తున చాటుకున్నారు. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న ఏబీ డివిలియర్స్ క్రీజులోకి వస్తున్నప్పుడు దాదాపు 20 వేల మంది ప్రేక్షకులు ఏబీడీ... ఏబీడీ... అంటూ స్టేడియాన్ని హోరెత్తించారు.
ఈ పరిణామాన్ని చూసి వీఐపీ స్టాండ్స్‌లో కూర్చున్న ఏబీ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. ఓవరాల్‌గా చిన్నస్వామి స్టేడియం కాసేపు కింగ్స్‌మీడ్ (డర్బన్), న్యూలాండ్స్ (కేప్‌టౌన్) మైదానంలా మారిపోయాయి. ఫోర్ కొట్టినా... అర్ధసెంచరీ పూర్తి చేసినా విదేశీ అభిమానుల్లాగానే తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదే మైదానంలో ఐపీఎల్‌లో ఎన్నో మ్యాచ్‌లను గెలిపించిన ఏబీని బెంగళూరు ప్రేక్షకులు సొంతవాడిగా భావిస్తారనే దానికి ఇదే నిదర్శనం.
ఏబీడీ...ఏబీడీ అంటూ కేరింతలు కొట్టడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని డివిలియర్స్ తండ్రి సీనియర్ ఏబీ డివిలియర్స్ అన్నారు. ‘ఏబీ అవుటైనప్పుడు అభిమానులు కాస్త నిరాశ చెందారు. సుదీర్ఘంగా ఆర్‌సీబీకి ఆడుతుండటంతో బెంగళూరు మా వాడికి రెండో ఇల్లు అయ్యింది. ఇక భారత భాషలు కూడా నేర్చుకుంటాడని అనుకుంటున్నాం. మా కుటుంబంలో చాలా మంది విద్యావంతులు ఉన్నారు. డివిలియర్స్ డాక్టర్ కాకపోవడం మమ్ముల్ని నిరాశకు గురి చేయలేదు. కెరీర్‌లో ఉన్నతస్థితికి ఎదిగినందుకు గర్వంగా ఉంది.
ఏదో ఓ డిగ్రీ అయితే సంపాదిస్తాడు’ అని సీనియర్ ఏబీ పేర్కొన్నారు. కుర్రాడుగా ఉన్నప్పుడు ఏబీ గోల్ఫ్ బాగా ఆడేవాడని అతని తల్లి మిలి వెల్లడించారు. ‘గోల్ఫ్‌లో ఏబీ ఆటను చూశాక ఏదో ఓ రోజు ఏర్నీ ఎల్స్ అంతటి గొప్పవాడు అవుతాడని భావించాం. అలాగే టెన్నిస్ కూడా బాగా ఆడతాడు. అయితే వ్యక్తిగత క్రీడకు కాకుండా టీమ్‌గా ఆడే ఆటైతే బాగుండేదని అనుకున్నాం. ఎందుకంటే డివిలియర్స్‌కు ఎప్పుడూ జనంలో ఉండటం ఇష్టం. అయితే మైదానంలో కనిపించినంత అణకువగా బయట ఉండడు’ అని మిలి తెలిపారు.