న్యూఢిల్లీ: వచ్చే వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే భారత క్రికెట్ జట్టులో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఇటీవల చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రిషభ్ పంత్ తమ వరల్డ్ కప్ ప్రణాళికల్లో ఉన్నాడంటూ ఎంఎస్‌కే చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మాత్రం పెదవి విరిచాడు. రాబోయే వరల్డ్‌కప్‌లో రిషభ్ పంత్‌కు చోటిస్తే మాత్రం అది జట్టు కూర్పుపై తీవ్ర ప‍్రభావం చూపే అవకాశం ఉందన్నాడు. పంత్‌ను వరల్డ్‌కప్ జట్టు లో చేర్చాలనుకోవడం మంచి నిర్ణయం అంటూనే, అది జట్టు కాంబినేషన్‌ను కాస్త గందరగోళానికి గురి చేస్తుందన్నాడు.
ఇప్పటికే ఇద్దరు స్పెషలిస్టు వికెట్ కీపర్లు ఎంఎస్ ధోని, దినేశ్ కార్తీక్‌లు ఉండగా, మరొక స్పెషలిస్టు వికెట్ కీపరైన పంత్‌కు చోటు కల్పించడం జట్టుకు భారంగా మారుతుందన్నాడు. ‘ రిషభ్ పంత్‌కు వరల్డ్‌కప్ జట్టులో స్థానం కల్పిస్తే ఒక బ్యాట్స్‌మన్‌ను కానీ, బౌలర్ కానీ తీసేయాలి. ఇక్కడ రిషభ్ కోసం ఒక స్పెషలిస్టు బౌలర్‌ను తీయడం సబబు కాదు. దాంతో బ్యాట్స్‌మన్‌ను తీసేసి మాత్రమే రిషభ్ స్థానాన్ని భర్తీ చేయలి. ఒకవేళ ఆల్ రౌండర్‌ను తీసేసి రిషభ్‌ను వేసుకుంటే అది జట్టు కూర్పుపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుత సమయంలో ధోని, దినేశ్ కార్తీక్‌లు ఇద్దరూ బాగానే ఆడుతున్నారు. వీరిద్దరూ స్సెషలిస్టు వికెట్ కీపర్లే. ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో వీరి పాత్ర వెలకట్టలేనిది. వారి అనుభవంతో కీలకమైన భాగస‍్వామ‍్యాన్ని నమోదు చేసి మ్యాచ్‌ను గెలిపించారు. ధోని తొలుత కొన్ని బంతుల్ని వేస్ట్ చేస్తూ ఉంటాడు. పిచ్‌పై అవగాహనకు వచ్చే క్రమంలో ధోని కొన్ని డాట్ బాల్స్ ఆడటానికి ఇష్టపడతాడు. ఒక్కసారి గాడిలో పడితే అతను ఏమి చేయాలనుకున్నాడో అది కచ‍్చితంగా చూపెడతాడు ధోని. గేమ్‌ను ఫినిషింగ్ చేసే విధానంలో ధోని శైలే వేరు. ఇక దినేశ్ కార్తీక్ కూడా మంచి బ్యాట్స్‌మన్. మ్యాచ్‌పై ఒత్తిడిని తగ్గిస్తూ స్టైక్ రొటేట్ చేయడంలో కార్తీక్‌కు అనుభవం ఉంది. ఈ తరుణంలో రిషభ్ వరల్డ్‌కప్ ఎంపిక అనేది సరైనది కాకపోవచ‍్చు’ అని సచిన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment