విలియమ్సన్ సెంచరీ
చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. కేన్ విలియమ్సన్ (114) సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 89.5 ఓవర్లలో 5 వికెట్లకు 280 పరుగులు చేసింది. మార్టిన్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. జహుర్ అహ్మద్ చౌదరీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.... టాస్ గెలిచి కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫుల్టన్ (73), విలియమ్సన్ మెరుగ్గా ఆడారు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 126 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఓ దశలో 244/2 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న కివీస్‌ను.. రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన లెఫ్టార్మ్ స్పిన్నర్ అబ్దుర్ రజాక్ దెబ్బతీశాడు. టేలర్ (28)తో పాటు తొలిరోజు చివరి ఓవర్ (90)లో బ్రెండన్ మెకల్లమ్ (21)ను అవుట్ చేసి షాకిచ్చాడు. నిలకడగా ఆడుతున్న విలియమ్సన్‌ను 89వ ఓవర్‌లో షకీబ్ పెవిలియన్‌కు పంపాడు. రజాక్ 2, గాజి, షకీబ్, నాజిర్ తలా ఓ వికెట్ తీశారు.