మహిళల బాక్సింగ్ కోచ్ రాజీనామా
పదవి నుంచి వైదొలిగిన స్టెఫాన్ కాటలోర్డా
న్యూఢిల్లీ: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. భారత మహిళల జట్టుకు తొలి విదేశీ కోచ్‌గా నియమితులైన స్టెఫాన్ కాటలోర్డా నెల తిరిగేలోపే రాజీనామా చేశారు. భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ)కు ప్రొఫెషనలిజం లేదని తీవ్రంగా ఆరోపిస్తూ పదవి నుంచి వైదొలిగారు. బీఎఫ్‌ఐ తనకు సరిగా వేతనం చెల్లించలేదని, తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఫ్రాన్స్‌కు చెందిన 41 ఏళ్ల స్టెఫాన్ ఆవేదన వెళ్లగక్కారు. రాజీనామా లేఖలో ఆయన బీఎఫ్‌ఐను ఘాటుగా విమర్శించారు. ‘చాలా ఓపికగా ఎదురు చూశాను. నా విజ్ఞప్తులను తెలుపుతూ నేను చేసిన మెయిల్స్‌కు ఇంకా జవాబు రాలేదు. ఆగస్టుకు సంబంధించిన పూర్తి వేతనాన్ని కూడా అందుకోలేదు. బీఎఫ్‌ఐ నాకిచ్చిన మాటకు కట్టుబడలేదు.
జవాబుదారీతనం, ప్రొఫెషనలిజం లేని వారితో పనిచేయలేను. తిరిగి మళ్లీ ఇండియాకు రాను. ఇక్కడి విధానంపై నాకు నమ్మకం లేదు’ అని స్టెఫాన్ ఆగ్రహం వెలిబుచ్చారు. మరోవైపు సమాఖ్యకు సంబంధించిన అధికారి మాట్లాడుతూ స్టెఫాన్‌కు మళ్లీ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. పాన్ కార్డ్ పొందడంలో ఆలస్యం కారణంగా వేతనం ఆలస్యమైందని చెప్పారు. అయినప్పటికీ 70 శాతం వేతనాన్ని చెల్లించామని, మిగతా డిమాండ్లపై కూడా సానుకూలంగానే స్పందించామని అన్నారు. మరో వైపు స్టెఫాన్ నిర్ణయంతో షాక్‌కు గురయ్యానని ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, భారత అగ్రశ్రేణి బాక్సర్ మేరీకోమ్ అన్నారు.
అతనితో మాట్లాడి తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సిందిగా కోరతానని ఆమె పేర్కొన్నారు. ‘ఇది చాలా నిరాశ కలిగించే అంశం. భారత బాక్సింగ్‌కు అతని అవసరం ఎంతో ఉంది. అతని అవసరాలు చూసుకోవడం మన బాధ్యత. నేను వ్యక్తిగతంగా అతనితో మాట్లాడతా. తిరిగి కోచ్‌గా పనిచేసేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తా’ అని ఆమె అన్నారు.