చివరిక్షణం వరకు పోరాడినా భారత రెజ్లర్ బజరంగ్ పూనియా ‘పసిడి’ పట్టు పట్టలేకపోయాడు. ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సంతృప్తి చెందాడు. ఆద్యంతం దూకుడుగా, వేగంగా, వ్యూహాత్మకంగా ఆడిన జపాన్ యువ రెజ్లర్ టకుటో ఒటోగురో అనుకున్న ఫలితాన్ని సాధించాడు. జపాన్ తరఫున పిన్న వయస్సులో విశ్వ విజేతగా నిలిచిన ఘనతను 19 ఏళ్ల ఒటోగురో సొంతం చేసుకున్నాడు.
బుడాపెస్ట్ (హంగేరి): కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలిచిన భారత రెజ్లర్ బజరంగ్ పూనియా అదే ప్రదర్శనను ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పునరావృతం చేయలేకపోయాడు.సోమవారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం ఫైనల్లో 24 ఏళ్ల బజరంగ్ 9–16 పాయింట్ల తేడాతో టకుటో ఒటోగురో చేతిలో పోరాడి ఓడిపోయాడు. బౌట్ మొదలైన తొలి నిమిషంలోనే ఐదు పాయింట్లు కోల్పోయిన బజరంగ్ ఆ తర్వాత తేరుకున్నాడు. వెంటవెంటనే రెండేసి పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని 5–4కి తగ్గించాడు. కానీ ప్రపంచ మాజీ క్యాడెట్ చాంపియన్ అయిన ఒటోగురో ఏదశలోనూ దూకుడును తగ్గించకపోవడంతో బజరంగ్‌కు తీవ్ర ప్రతిఘటన తప్పలేదు. మూడు నిమిషాల తొలి భాగం ముగిసేసరికి ఒటోగురో 7–6తో ఒక పాయింట్ ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండో భాగంలో స్కోరును సమం చేసే ప్రయత్నంలో బజరంగ్ తీవ్రంగా ప్రయత్నించడం... బజరంగ్ తప్పిదాలను తనకు అనుకూలంగా మల్చుకున్న ఒటోగురో ఐదు పాయింట్లు సంపాదించి 12–6తో ముందంజ వేయడం జరిగిపోయింది.
చివర్లో బజరంగ్ కోలుకునే యత్నం చేసినా ఫలితం లేకపోయింది. తొలి నిమిషంలోనే 5 పాయింట్లు కోల్పోవడం బజరంగ్ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. రజత పతకంతో బజరంగ్ కొత్త చరిత్రను లిఖించాడు. ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు పతకాలు గెలిచిన తొలి భారత రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. 2013లో బుడాపెస్ట్ వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బజరంగ్ 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఈ ఏడాదిలో బజరంగ్ పాల్గొన్న ఆరు అంతర్జాతీయ టోర్నీల్లోనూ పతకాలు నెగ్గడం విశేషం. కామన్వెల్త్ గేమ్స్, టిబిలిసి గ్రాండ్‌ప్రి టోర్నీ, యాసర్ డోగు టోర్నీ, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలిచిన బజరంగ్... ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment