పానీపూరి అమ్మడం నుంచి కరోడ్‌పతి వరకూ.. | Yashasvi Jaiswal From Street Vendor To Crorepati Cricketer | Sakshi
Sakshi News home page

పానీపూరి అమ్మడం నుంచి కరోడ్‌పతి వరకూ..

Published Thu, Dec 19 2019 7:41 PM | Last Updated on Thu, Dec 19 2019 7:58 PM

Yashasvi Jaiswal From Street Vendor To Crorepati Cricketer - Sakshi

లక్ష్యం ముందు ఏదైనా బలాదూర్‌ అనడానికి భారత అండర్‌ 19 క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ జీవితమే ఉదాహరణ. భారత జాతీయ క్రికెట్‌ జట్టులో చోటే లక్ష్యంగా సత్తాచాటుతున్న యశస్వి జైస్వాల్‌ ఆకలితో పడుకున్న సందర్భాలు కోకొల్లలు.  అతని కష్టాల జాబితా చూస్తే అంతు లేదు. కానీ అతను వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అన్ని బాధలు భరిస్తూ కూడా క్రికెటర్‌ కావాలనే తన లక్ష్యానికి మాత్రం దూరం కాలేదు. ఇప్పుడు అదే అతన్ని కరోడ్‌పతిని చేసింది. పానీపూరి  అమ్మే స్టేజ్‌ నుంచి కోట్లకు పడగలు ఎత్తేలా చేసింది అతను నమ్ముకున్న క్రికెట్‌ జీవితం. ఈసారి ఐపీఎల్‌ వేలంలో  జైస్వాల్‌ను రూ. 2.40 కోట్లకు రాజస్తాన్‌ రాయల్స్‌ చేజిక్కించుకుంది. అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్స్‌ అయిన జైస్వాల్‌ల కనీస ధర రూ. 20  లక్షలు ఉండగా పలు ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. ప్రధానంగా ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, కింగ్స్‌ పంజాబ్‌లు జైస్వాల్‌పై ఆసక్తి చూపాయి. చివరకు రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది.

11 ఏళ్ల వయసు... కానీ పెద్ద క్రికెటర్‌ కావాలనేది కల. అది నెరవేర్చుకోవాలంటే స్వస్థలం భదోహీ (ఉత్తర ప్రదేశ్‌)లో మాత్రం సాధ్యం కాదు. అందుకే దేనికైనా సిద్ధం అంటూ ‘చలో ముంబై’ అన్నాడు. సొంతూర్లో తండ్రిది చిన్న కిరాణా కొట్టు.  ఇద్దరు పిల్లల పోషణ కూడా ఆయనకు భారంగా అనిపించి నీ ఇష్టం అనేశాడు. దూరపు బంధువొకరు ముంబైలో ఉంటే ఆయనను నమ్ముకొని బయల్దేరాడు. ఏదైనా పని ఇప్పిస్తానంటూ డెయిరీ దుకాణంలో నౌకరీ ఇప్పించిన ఆ బంధువు ఇల్లు మాత్రం రెండో మనికి అవకాశమే లేనంత చిన్నది! దాంతో తను పని చేస్తున్న చోటే రాత్రి కూడా పడుకోవడం మొదలు పెట్టాడు. అయితే రోజంతా పనికంటే క్రికెట్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో వారు పనికిరావంటూ పంపించేశారు. దాంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. మళ్లీ అదే బంధువు ఆదుకుంటూ తాను పని చేస్తున్న ‘ముస్లిం యునైటెడ్‌ క్లబ్‌’ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఒక మూలన ఉండే టెంట్‌లో ఆ అబ్బాయిని ఉంచేందుకు అనుమతి తీసుకున్నాడు.

కనీసం విద్యుత్‌ సౌకర్యం కూడా లేకుండా ప్లాస్టిక్‌ కవర్లతో కప్పి ఉంచిన ఆ టెంటే అప్పటి నుంచి యశస్వి ప్రపంచమైపోయింది. స్థానికంగా క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడటం, యునైటెడ్‌ క్లబ్‌కు సంబంధించి గ్రౌండ్స్‌మన్‌తోనే ఉంటూ వారికి రోటీలు చేసి పెట్టడం అతని రోజువారీ పని. తనకంటే వయసులో పెద్దవారితో క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడితే 200–300 రూపాయలు వచ్చేవి. వాటినే ఎంతో పొదుపుగా వాడుకోవాల్సి వచ్చేది. ముంబైలోని ఆజాద్‌ మైదాన్‌లో రామ్‌లీలా ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు యశస్వి అక్కడ పానీ పూరీలు కూడా అమ్మాడు! తనతో ఆడే కుర్రాళ్లు ఆ సమయంలో పానీపూరీ తినేందుకు తన వద్దకు రావద్దని అతను కోరుకునే పరిస్థితి. టెంట్‌లో ఉంటున్న సమయంలో తాను ఆకలితో పడుకున్న రాత్రులు కూడా ఎన్నో ఉన్నాయి. కష్టాల జాబితా చూస్తే అంతు లేదు. కానీ అతను వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అన్ని బాధలు భరిస్తూ కూడా క్రికెటర్‌ కావాలనే తన లక్ష్యానికి మాత్రం దూరం కాలేదు.

యశస్వి గాథలు ఆజాద్‌ మైదాన్‌లో చాలా మందికి చేరాయి. సహజ ప్రతిభావంతుడైన ఒక కుర్రాడిని అండగా నిలవాల్సిన అవసరం తెలిసింది. వీరిలో ఒక స్థానిక కోచ్‌ జ్వాలా సింగ్‌ అందరికంటే ముందుగా స్పందించాడు.  ఈ కుర్రాడిని చేరదీసి ఆటను తీర్చిదిద్ది ముందుకు నడిపించాడు. అతని ప్రోత్సాహంతో ముందుకు వెళ్లిన యశస్వి స్థానిక లీగ్‌లలో పరుగుల వరద పారించాడు. గత ఐదేళ్లలో అన్ని స్థాయిల మ్యాచ్‌లలో కలిపి అతను దాదాపు 50 సెంచరీలు బాదాడు. వేర్వేరు వయో విభాగాల్లో ఈ అసాధారణ ప్రదర్శన అతడికి ముంబై అండర్‌–19 జట్టులో, ఆ తర్వాత భారత అండర్‌–19 జట్టులో చోటు కల్పించింది.

గత ఆగస్టులో ఇంగ్లండ్‌లో అండర్‌–19 ముక్కోణపు టోర్నీలో ఫైనల్లో సహా మొత్తం నాలుగు అర్ధ సెంచరీలతో జట్టుకు టైటిల్‌ అందించిన అతను ఇప్పుడు సీనియర్‌ స్థాయిలో కూడా సత్తా చాటుతున్నాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం జరిగిన అండర్‌–19 ఆసియా కప్‌ టోర్నీతో యశస్వికి మొదటిసారి గుర్తింపు లభించింది. భారత్‌ విజేతగా నిలిచిన ఆ టోర్నీలో యశస్వి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ పురస్కారాన్ని అందుకున్నాడు. అప్పటి నుంచి అతని ఆట మరింత జోరందుకుంది. ముంబై సీనియర్‌ టీమ్‌కు ఎంపిక కావడం అతని కెరీర్‌లో కీలక మలుపు. 44, 113, 22, 122, 203... విజయ్‌ హజారే ట్రోఫీలో యశస్వి జైస్వాల్‌ వరుస స్కోర్లు ఇవి. ఆడిన ఐదు మ్యాచ్‌లలో మూడు సెంచరీలు ఉన్నాయి. అందులో ఒక డబుల్‌ సెంచరీ కూడా. తాజా ప్రదర్శన యశస్విని భవిష్యత్‌ తారగా ఆశలు రేపేలా చేసింది. ప‍్రస్తుతం అండర్‌-19 స్థాయిలో క్రికెట్‌ ఆడుతున్న యశస్వి.. ఐపీఎల్‌లో ఆకట్టుకుంటే భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం ఏమాత్రం కష్టం కాదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement