
యూకీ బాంబ్రికి టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రి ఈ సీజన్‌లో తొలి ఏటీపీ చాలెంజర్ లెవల్ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ట్రారల్‌గాన్ చాలెంజర్ ఈవెంట్‌లో 21 ఏళ్ల ఈ ఢిల్లీ ఆటగాడు ఫైనల్లో తనకన్నా మెరుగైన ర్యాంకింగ్ కలిగిన బ్రాడ్లీ క్లాన్ (అమెరికా)ను 6-7 (13), 6-3, 6-4 తేడాతో మట్టికరిపించాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ చివరి సెట్‌లో 4-2తో బాంబ్రి ఆధిక్యంలో ఉన్నప్పుడు వర్షం కురవడంతో సోమవారానికి వాయిదా వేశారు.
సీజన్‌లో రెండో చాలెంజర్ ఫైనల్ ఆడిన 277వ ర్యాంకర్ యూకీ.. 149వ ర్యాంకర్ బ్రాడ్లీపై పూర్తి ఆధిపత్యం వహించి వరుస సెట్లలో నెగ్గాడు. గత జూలైలో ఇదే ప్రత్యర్థిపై ఓడిన యూకీ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యింది. గతేడాది తొలి చాలెంజర్ టోర్నీ నెగ్గిన ఈ యువ ఆటగాడు ఈ టైటిల్‌తో 80 ర్యాంకింగ్ పాయింట్లు, 7200 డాలర్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నాడు.