ముంబై: ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం తాను రిటైర్మెంట్ గురించి ఆలోచించనని వెటరన్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రం తప్పుకుంటానని అతను స్పష్టం చేశాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో కూడా విఫలమవుతూ వస్తున్న యువీ ముంబై ఇండియన్స్ తరఫున తాజా సీజన్‌ను మాత్రం ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాడు. ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అతను 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. ‘రిటైర్ అయ్యేందుకు తగిన సమయం వచ్చేసిందని భావించిన రోజున ఎవరూ చెప్పకుండానే అందరికంటే ముందుగా నేను ఆ పని చేస్తా. గత రెండేళ్లుగా నా కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి.
ఒక దశలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. నన్ను నేను విశ్లేషించుకుంటే నేను అండర్–16 ఆడేటప్పుడు క్రికెట్‌ను ఎంతగా ఆస్వాదించానో ఇప్పుడూ అలాగే ఉన్నాననిపించింది. ప్రస్తుత స్థితిలో భారత జట్టు గురించైతే ఎలాగూ ఆలోచించడం లేదు. కాబట్టి ఆటపై మమకారం ఉన్నంత వరకు ఆడాలనే కోరుకుంటున్నా’ అని యువరాజ్ స్పష్టం చేశాడు. దాదాపు తన వయసులోనే ఉన్న సమయంలో సచిన్ టెండూల్కర్ కూడా ఇలాంటి స్థితినే ఎదుర్కొన్నాడని... అతనితో మాట్లాడిన తర్వాత తనలో ఆందోళన తగ్గిందని కూడా యువీ వెల్లడించాడు.
సమయం వచ్చినపుడు నేనే చెబుతా!
Published Tue, Mar 26 2019 1:21 AM | Last Updated on Tue, Mar 26 2019 1:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment