యువరాజ్‌కు అండగా కోహ్లి
తప్పించాలనుకుంటున్న బెంగళూరు
నిర్ణయం మాల్యా చేతుల్లో
బెంగళూరు: భారత ప్రపంచ కప్ ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకోలేకపోయిన యువరాజ్ సింగ్ ఐపీఎల్ కాంట్రాక్ట్ కూడా ఇప్పుడు ప్రమాదంలో పడినట్లుంది. గత ఏడాది రూ. 14 కోట్ల భారీ మొత్తానికి యువీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు కొనుగోలు చేసిన సంగతి తెలిసింది. అయితే ఇప్పుడు అతడిని విడుదల చేయాలని ఆ జట్టు వ్యూహకర్తల బృందమైన క్రికెట్ కమిటీ భావిస్తోంది. ఇందులో మాజీ ఆటగాళ్లు బ్రిజేష్ పటేల్, అవినాశ్ వైద్య ఉన్నారు. అయితే జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి దీనిని గట్టిగా వ్యతిరేకించడంతో ఈ నిర్ణయం వాయిదా పడింది.
యువీ ఇప్పటికి మ్యాచ్ విన్నరే అంటూ కోహ్లి అతనికి మద్దతుగా నిలిచాడు. దాంతో తుది నిర్ణయాన్ని యజమాని విజయ్ మాల్యాకే ఫ్రాంచైజీ వదలి పెట్టింది. ఐపీఎల్-7లో యువరాజ్ 14 ఇన్నింగ్స్‌లో కలిపి 376 పరుగులు చేశాడు. యువీని విడుదల చేసి మరోసారి వేలంలో వెనక్కి తీసుకోవాలని ఆర్‌సీబీ వ్యూహంతో ఉంది. ఏ జట్టయినా అతడిని తక్కువ మొత్తానికి తీసుకున్నా...ఆ మొత్తం ఇచ్చి తీసుకునే మొదటి హక్కు బెంగళూరుకే ఉంటుంది కాబట్టి ఖర్చు తగ్గించుకునే దిశగా ఆలోచిస్తోంది. ఇక యువీని కొనసాగిస్తారా, పంపిస్తారా చూడాలి.
ఢిల్లీ కూడా..: మరో వైపు ఢిల్లీ డేర్ డెవిల్స్ కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. పీటర్సన్ (రూ. 9 కోట్లు), మురళీ విజయ్ (రూ. 5 కోట్లు), మయాంక్ అగర్వాల్ (రూ. 1.6 కోట్లు)లను తప్పించాలనే ఆలోచనలో ఆ జట్టు యాజమాన్యం ఉంది. గత ఏడాది ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఢిల్లీ అట్టడుగున నిలిచింది.