టీనగర్: ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటనతో ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గల్ఫ్ దేశమైన జెడ్డా నుంచి బుధవారం ఉదయం సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల విమానం చెన్నై చేరుకుంది. విమానం చెన్నై సమీపిస్తుండగా అందులో ఉన్న ఆంధ్రప్రదేశ్ వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన మినిసాబేగం(66)కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది.
ఆమెతో పాటూ కుమారుడు మహ్మద్ (40) వెంట ఉన్నారు. ఈ విషయాన్ని ఫైలట్స్‌కు తెలపడంతో వారు చెన్నై విమానాశ్రయ కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. విమానాశ్రయంలో సిద్ధంగా ఉన్న వైద్యులు సీటులోనే స్పృహతప్పిన మినిసాబేగంను పరీక్షించి ఆమె మార్గమధ్యలోనే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కారు ద్వారా స్వస్థలానికి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. కళ్లెదుటే తల్లి గుండెపోటుతో చనిపోవడాన్ని చూసి మహ్మద్ రోదించడం అక్కడున్న వారిని క లచివేసింది. ఈ సంఘటనతో విమానం రెండు గంటలు ఆలస్యంగా వెళ్లింది.