యోగాసనాలతో ఆల్బమ్
యోగాసనాలపై మక్కువ పెరుగుతున్న రోజులివి. ప్రధాని లాంటివారే యోగాసనాలకు ప్రాధాన్యతనిస్తుండడం గమనార్హం.కాగా అందాల భామ నటి అనుష్క పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళం, తెలుగు భాషలలో నంబర్‌ఒన్ కథానాయికగా వెలుగొందుతున్న అనుష్క తన పాపులారిటినీ క్యాష్ చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. అనుష్క నటి కాక ముందు యోగా టీచర్ అన్న విషయం తెలిసిందే. తన అందాలకు కారణం యోగానేనని చాలా సార్లు వెల్లడించింది కూడా.
విషయం ఏమిటంటే తన మునుపటి యోగానుభవంతో ఒక యోగాసనాల ఆల్బమ్‌ను తయారు చేయడానికి అనుష్క పూనుకున్నారట. ఈ ఆల్బమ్‌లో నటి అనుష్కనే వివిధ యోగాసనాలను ప్రదర్శించి దాన్ని మార్కెట్‌లో విడుదల చేసి సొమ్ము చేసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇందులో ఒక ప్రముఖ నటుడు కూడా అనుష్కతో యోగాసనాలను ప్రదర్శించనున్నారని తెలిసింది. ఇలాంటి ప్రయత్నాన్ని ఇంతకు ముందు బాలీవుడ్ బ్యూటీ శిల్పాచెట్టి కూడా చేసి బాగానే సంపాదించుకున్నారన్నది గమనార్హం.