ఆపన్నుల ఆపద్బంధు విమ్స్ బ్లడ్ బ్యాంకు | Apannula apadbandhu vims Blood Bank | Sakshi
Sakshi News home page

ఆపన్నుల ఆపద్బంధు విమ్స్ బ్లడ్ బ్యాంకు

Published Sat, Oct 5 2013 3:15 AM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM

Apannula apadbandhu vims Blood Bank

బళ్లారి  (తోరణగల్లు), న్యూస్‌లైన్ :  రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి తీవ్ర రక్తస్రావమైంది. రక్తం ఎక్కిస్తేగాని బతకడని  వైద్యులు తేల్చేశారు. మరో  పసిపాపకు డెంగీ సోకింది. రక్తంలోని ప్లేట్‌లెట్స్  తగ్గిపోయాయి. ప్లేట్‌లెట్స్  ఎక్కిస్తేగాని పాప కోలుకోని పరిస్థితి. ఓ గర్భిణీ ప్రసవానికి  వచ్చింది. రక్తం ఎక్కిస్తే గాని ఆమె సురక్షితమైన కాన్పు అయ్యే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోగుల బంధువులు లబోదిబోమంటున్నారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆపద్బాంధవుడిగా విమ్స్ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకు నిలిచింది. రక్తదాన శిబిరాల ద్వారా దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ఎంతోమంది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రోగులకు ఇచ్చి అభయహస్తం అందించింది.  2012-13వ ఏడాదిలో అత్యధికంగా రక్తం యూనిట్స్‌ను సేకరించి రాష్ట్రంలో ద్వితీయస్థానంలోను, గుల్బ ర్గా జోన్‌లో ప్రథమ స్థానంలో ఈ బ్లడ్‌బ్యాంక్ నిలిచింది. దీనికి కర్ణాటక  రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 1న బెంగుళూరులోని చౌడయ్య హాలులో రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి యు.టి. ఖాదర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం కూడా దక్కింది.
 
రాష్ట్రంలో ద్వితీయస్థానం

2012-13వ ఏడాదిలో విమ్స్ బ్లడ్‌బ్యాంకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన  77 రక్తదాన శిబిరాల ద్వారా 3,417 యూనిట్ల (సీసా) రక్తాన్ని సేకరించి, గుల్బర్గా జోన్‌లో అత్యధిక రక్త సేకరణ బ్లడ్‌బ్యాంకుగా ప్రథమ స్థానాన్ని, రాష్ట్రంలో ద్వితీయస్థానాన్ని సాధించింది. గత మాసం జిందాల్‌లోని ఇందు ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన   రక్తదాన శిబిరం ద్వారా అత్యధికంగా 575 యూనిట్ల రక్తాన్ని సేకరించింది.

2013 జనవరి  నుంచి సెప్టెంబర్ 30 వరకు 65 శిబిరాల ద్వారా 8039 యూనిట్ల రక్తాన్ని సేకరించి  ఈ యేడాది రాష్ట్రంలో అత్యధికంగా యూనిట్లు సేకరించిన సంస్థగా నిలిచినట్లు విమ్స్  సంచాలకుడు డా.లక్ష్మినారాయణరెడ్డి, బ్లడ్‌బ్యాంకు వైద్య ప్రముఖులు  డా.బిందు, డా.షఫి తెలిపారు. సేకరించిన రక్తాన్ని ప్యాక్డ్‌సెల్స్, ప్లేట్‌లెట్స్, ప్లాజ్మా, క్రమోప్రిసిపేట్‌గా విభజించి ఆయా వ్యాధిగ్రస్తులకు అవసరమైన రక్తాన్ని అందిస్తున్నారు.
 
 ఐదు జిల్లాలకు ఆసరాగా విమ్స్ బ్లడ్ బ్యాంకు

 
 కర్ణాటకలోని బళ్లారి, కొప్పళ, రాయచూరు సరిహద్దులోని అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన రోగులకు విమ్స్ బ్లడ్ బ్యాంకు  ఆపద్భాంధవుడిగా నిలిచింది. ఈ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో రోగులు  వస్తుండటంతో విమ్స్ బ్లడ్‌బ్యాంకు 24 గంటలు సేవలందించేలా చర్యలు చేపట్టాం. గుల్బర్గా జోన్‌లో ప్రథమ స్థానంలో, రాష్ట్రంలో ద్వితీయస్థానంలో నిలవడం మరింత గర్వంగా ఉంది.        
- డాక్టర్ లక్ష్మినారాయణరెడ్డి, విమ్స్ సంచాలకుడు
 

Advertisement

పోల్

Advertisement