రూ.4.63 కోట్ల మిగులు బడ్జెట్‌కు ఆమోదం
దావణగెరె : దావణగెరె సిటీ కార్పొరేషన్‌కు వివిధ ఆదాయ వనరుల ద్వారా మొత్తం రూ.539.30 కోట్ల ఆదాయం లభించనుండగా, ఇందులో వివిధ అభివృద్ధి పనులకు రూ.532.57 కోట్లు ఖర్చు చేసి, రూ.4.63 కోట్లను మిగల్చాలని ఉద్దేశించినట్లు సిటీ కార్పొరేషన్ పన్నులు, ఆర్థిక స్థాయి సమితి అధ్యక్షుడు హెచ్.గురురాజ్ వెల్లడించారు. బుధవారం ఆయన నగర శివార్లలోని సిటీ కార్పొరేషన్ సమగ్ర నీటి సరఫరా కేంద్రం వద్ద మేయర్ హెచ్‌బీ గోణెప్ప అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో 2016-17వ సంవత్సరపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
నగరంలోని మండక్కి భట్టి ప్రాంతాన్ని అభివృద్ధి పరిచి మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు రూ.35 కోట్లు, ఆస్పత్రి భవనాలు, ఆవరణలను మెరుగు పరిచేందుకు, ప్రజలకు కాలిబాటల నిర్మాణానికి, ఆధునిక బస్టాండ్ నిర్మాణాలకు, పాలికె కార్యాలయంలో డిజిటల్ గ్రంథాలయం ప్రారంభానికి రూ.55 కోట్లు, ప్రైవేట్ బస్టాండ్ల అభివృద్ధికి రూ.25 కోట్లు, వాణిజ్య సంకీర్ణం, వాహనాల పార్కింగ్‌కు రూ.25 కోట్లు, నగరంలో రవాణా వ్యవస్థ మెరుగుదలకు రూ.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం కింద రూ.21 లక్షలతో రెండు ప్రజా మరుగుదొడ్లు, 15 వేల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని ఉద్దేశించినట్లు తెలిపారు. బడ్జెట్‌ను మరో కార్పొరేటర్ శివనహళ్లి రమేష్ స్వాగతించగా, ఎం.హాలేష్ ఆమోదించారు. సమావేశంలో సభ్యులతో పాటు కమిషనర్ నారాయణప్ప, స్థాయి సమితి అధ్యక్షులు బీ.లక్ష్మిదేవి వీరణ్ణ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.