3న బీబీఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
బెంగళూరు : బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల సన్నాహాలు వేగం పుంజుకున్నాయి. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి చర్చించేందుకు గాను ఎన్నికల అధికారి కూడా అయిన బీబీఎంపీ కమీషనర్ కుమార్ నాయక్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసి చర్చించారు. పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు సమాయత్తం కావాలని కుమార్ నాయక్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్‌ను ఆగస్టు 3న వెలువరించేందుకు ఎన్నికల అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఇక బీబీఎంపీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల జాబితాను మరో రెండు మూడు రోజుల్లో సిద్ధం చేయనున్నారు. అనంతరం ఆయా అధికారులకు ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సిందిగా మెమోలు జారీ కానున్నాయి. ఇక బీబీఎంపీ ఎన్నికల కోసం వినియోగించే ఈవీఎంలను నగరంలోని కె.ఆర్.మిల్ సమీపంలోని సముదాయ భవనంలో భద్రపరిచారు.
ఈ భవనం చుట్టూ మొత్తం 17 సీసీ కెమెరాలను అమర్చారు. పెద్ద ఎత్తున పోలీసు భద్రతను సైతం ఈ భవనానికి కల్పించారు. ఇక బీబీఎంపీ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని ప్రజలు ఓటర్ల జాబితాలో తమ పేరును చేర్చేందుకు మరింత సమయాన్ని కేటాయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. బీబీఎంపీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆసక్తి చూపే నగర వాసులు ఆగస్టు 5లోగా ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని ఎన్నికల కమీషన్ పేర్కొంది. తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేయించాలని భావించే వారికి తగిన సహాయ సహకారాలను వేగవంతంగా అందజేయాలని బీబీఎంపీ కమిషనర్ కుమార్ నాయక్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు.