- మైసూరులో టెక్స్‌టైల్ క్లస్టర్
- తయారీ రంగంలో వృద్ధి లక్ష్యం ఏడు శాతం
- కేంద్ర మంత్రి అనంతకుమార్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : పారిశ్రామిక రంగానికి ఉపయుక్తమయ్యే టూల్ రూమ్ (ఉత్పత్తి సాధనాలు)ను బెంగళూరులో నెలకొల్పనున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత కుమార్ తెలిపారు. నగర శివారులోని తుమకూరు రోడ్డులో గల బెంగళూరు అంతర్జాతీయ ప్రదర్శనా కేంద్రంలో గురువారం ఆయన మూడు రోజుల ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, అచ్చులు, ఆటో పార్ట్స్ ప్రదర్శన ‘ఎమ్మా ఎక్స్‌పో-2014’ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ప్రసంగిస్తూ ఈ ప్రారంభోత్సవానికి రావాల్సిన కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) శాఖ మంత్రి కల్‌రాజ్ మిశ్రా ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో తలమునకలుగా ఉన్నందున, తనను వెళ్లాల్సిందిగా కోరారని తెలిపారు. బెంగళూరుకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నందున, ఏదైనా వరాన్ని ప్రకటించాలని కోరినప్పుడు టూల్ రూమ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించాల్సిందిగా సూచించారని తెలిపారు. దీంతో పాటే మెసూరులో టెక్స్‌టైల్ క్లస్టర్‌ను కూడా ప్రారంభిస్తామని ఆయన తెలిపారని చెప్పారు.
వంద రోజుల్లో విధానం
దేశంలో ఎంఎస్‌ఎంఈ విధానాన్ని వంద రోజుల్లో ప్రకటించనున్నట్లు మంత్రి తెలిపారు. ఏబీ. వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ హయాంలో జాతీయ స్థూలోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏడు శాతం ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో దారుణంగా పడిపోయిందని విమర్శించారు. తయారీ రంగంలో ఏడు శాతం వృద్ధిని సాధించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జీడీపీలో తయారీ రంగం వాటా 15 శాతం ఉండేట్లు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఎంఎస్‌ఎంఈ రంగం అభివృద్ధి సాధించాలంటే రుణాలు, భూమి, ప్రాథమిక సదుపాయాలను సింగిల్ విండో ద్వారా అందించాలని సూచించారు. కేంద్ర బడ్జెట్‌లో ఎంఎస్‌ఎంఈలకు రూ.10 వేల కోట్ల వెంచర్ కేపిటల్ కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇందులో బెంగళూరు, కర్ణాటకకు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని ఆయన కోరారు. ఈ ప్రదర్శనలో 205 మంది ఎగ్జిబిటర్లతో పాల్గొంటున్న తైవాన్‌ను అభినందిస్తూ, చైనాతో పోటీని ఎదుర్కోవడానికి సహకరించాల్సిందిగా ఆ దేశ వాణిజ్య ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.
ప్రారంభోత్సవంలో తైపీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వాల్టర్ యే, ఇండియాలోని తైపీ ఎకనమిక్స్ అండ్ కల్చరల్ సెంటర్ ప్రతినిధి, రాయబారి చుంగ్-క్వాంగ్ తీన్ ప్రభృతులు పాల్గొన్నారు. భారత దేశ జనాభా 120 కోట్లని, వారంతా తైవాన్‌కు వస్తే కష్టం కనుక, తమ ఉత్పత్తులను ఇక్కడికే తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నామని చుంగ్-క్వాంగ్ చమత్కరించారు. కాగా ఈ మూడు రోజుల ప్రదర్శనలో ఇండియాకు చెందిన 210 మంది ఎగ్జిబిటర్లు కూడా పాల్గొంటున్నారు.