'దేశభద్రతకు సవాల్‌గా మారింది'
► అక్రమంగా 4 లక్షల మంది మకాం
► పోలీస్ కమిషనర్ సూద్ ఆందోళన
జయనగర: భారత ఐటీ రాజధాని బంగ్లాదేశీయులతో కిక్కిరిసిపోయింది. అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి ఉపాధి కోసం ఐటీ సిటీకి తరలి వస్తున్నారు. బెంగుళూరులో సుమారు 4 లక్షల మంది బంగ్లావాసులు అక్రమంగా ఉంటున్నారు. ఇది చాలా ఆందోళన కలిగిస్తోందని నగర పోలీస్‌కమిషనర్ ప్రవీణ్‌సూద్ తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. బెంగళూరులో బంగ్లాదేశ్, రష్యా, ఆఫ్రిక, శ్రీలంక , పాకిస్థాన్, పౌరులు పెద్ద సంఖ్యలో అక్రమంగా స్థిరపడ్డారని ఆయన చెప్పారు. అక్రమంగా మకాం వేసినవారి ఆచూకీ కనిపెట్టడానికి వివిధ ఏజెన్సీలతో సమాచారం పంచుకుంటూ గాలిస్తున్నామని తెలిపారు. ఇటీవల పాకిస్థానీ దంపతులను అరెస్ట్ చేశామని ఆయన గుర్తుచేశారు.
భద్రతా దళాలకు లంచాలు ఇచ్చి..
ఆయా దేశాల పౌరులు ఇక్కడ సులభంగా ఆధార్ కార్డు, పాన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డులను పొందడాన్ని నిరోధించడానికి కఠిన నిబంధనలు పాటించాల్సిన అవసరముందన్నారు. అక్రమంగా వచ్చి ఉంటున్న విదేశీయుల్లో 4 లక్షల మందికిపైగా బంగ్లా దేశీయులు ఉండటం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ చొరబాటుదారులు దేశ సరిహద్దుల్లో భద్రతా సిబ్బందికి లంచాలు ఇచ్చి భారత్ లోకి ప్రవేశంచకుండా దేశభద్రతకు సవాల్‌గా మారిందని ప్రకటించారు. ఈ బంగ్లాదేశీయులు బెంగళూరులో లంచాలు ఇచ్చి అక్రమంగా ఆధార్, పాన్, ఓటరు కార్డులు పొందుతున్నారని కమిషనర్ చెప్పారు. వీరిలో కొందరు ఏళ్ల కిందటే నగరంలో స్థిరపడగా, కొందరు ఇటీవల వచ్చినవారు ఉన్నారని తెలిపారు. కట్టడ నిర్మాణాలు, హోటల్స్, మార్కెట్లు, మాల్స్, తదితరాల్లో కూలీపనులు చేసుకుంటూ ఉన్నారని చెప్పారు. వీరు కొత్తగా వచ్చేవారికి వసతి కల్పిస్తూ సహకరిస్తున్నట్టు తెలిసిందని ఆయన చెప్పారు.