కొల్లిమలై యువకుడితో బెల్జియం యువతి ప్రేమ పెళ్లి
సేలం: బెల్జియం యువతిని ప్రేమించి కొల్లిమలై అటవీ ప్రాంతానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నాడు. అయితే, వీరి పెళ్లి రిజిస్ట్రేషన్‌కు అధికారులు అంగీకరించ లేదు. నామక్కల్ జిల్లా కొల్లిమలైకు చెందిన సురేష్ గిరిజనుడు. అటవీ ప్రాంతానికి చెందిన సురేష్ కుమార్ విద్యా వంతుడు. హోటల్ మేనేజ్ మెంట్ పూర్తి చేసి ఇటలీలో ఓ నౌకలో పనిచేస్తున్నాడు. అక్కడ తన సహోద్యోగిగా పనిచేస్తున్న బెల్జియం కు చెందిన సారా(30) ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
దీంతో ఈ నెల పదిహేడున కొల్లి మలైలోని అరపలీశ్వరర్ ఆలయంలో పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. కానీ, పెళ్లికి ఆలయ అధికారులు నిరాకరించారు. సారా విదేశీ యువతి కావడం, ఆమె వద్ద అన్ని రికార్డులు లేని దృష్ట్యా పెళ్లిని నిరాకరించారు. దీంతో వారు మార్గ మధ్యలోని వినాయకుడి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.
వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అధికారులు ఒప్పుకోలేదు. గురువారం కొల్లిమలైకు చేరుకున్న కొత్త జంటకు అక్కడి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. దంపలిద్దరం స్థానికంగా ఉండి వ్యవసాయం చేసుకుంటామని వారు మీడియాకు చెప్పారు. దౌత్య కార్యాలయ అధికారులు కల్పించుకుని తనకు సహాయమందివ్వాలని నవవధువువరులు కోరారు.