సాక్షి, చెన్నై:రాష్ట్రంలో బోగస్ ఓటర్ల ఏరివేతకు కసరత్తులు ఆరంభమయ్యాయి. ఓటరు కార్డుకు ఆధార్ నంబర్లను అనుసంధానించే ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర ఎన్నికల యంత్రాం గం సిద్ధమవుతోంది. ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో శిబిరాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు గాను అన్ని రాజకీయ పక్షాలతో ఎన్నికల ప్రధాన అధికారి సందీప్ సక్సేనా సమాలోచించారు. ఎన్నికల నిర్వహణ, ఓటర్ల గుర్తింపు కార్డు తదితర వ్యవహారాల్లో సరికొత్త సవరణలతో కొత్త నిబంధనల అమలుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రంలోని నకిలీ, బోగస్ ఓటర్ల ఏరివేత పర్వానికి శ్రీకారం చుట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లను చేర్పించినట్టుగా కొంత కాలం ఒకరి మీద మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న రాష్ర్ట ఎన్నికల అధికారి సందీప్ సక్సేనా బోగస్ ఏరివేతతోపాటుగా ఓటరు కార్డుకు ఆధార్ లింక్ ప్రక్రియను వేగవంతం చేయడానికి సిద్ధమయ్యారు.
ఇందు కోసం అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాల్ని సేకరించి, తన వ్యూహాల అమలుకు నిర్ణయించారు.
‘ఈసీ’ సమీక్ష: సచివాలయంలో సందీప్‌సక్సేనా అధ్యక్షతన ఈ సమీక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఇందులో డీఎంకే తరపున గిరిరాజన్, పరందామన్, అన్నాడీఎంకే తరపున పొన్నయ్యన్, పొల్లాచ్చి వి జయరామన్, బీజేపీ తరపున మోహన్ రాజులు, రాఘవన్, డీఎండీకే తరపున పార్తీబన్, ఇలంగోవన్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ తదితర పార్టీల తరపున ఇద్దరు చొప్పున ప్రతినిధులు పాల్గొన్నారు. ఆయా పార్టీల వారీగా అభిప్రాయాలను ఈసీ సందీప్ సక్సేనా సేకరించారు. నకిలీ, బోగస్ పేర్లతో, రెండు మూడు చోట్ల ఓటరు కార్డులు కలిగి ఉన్న వాళ్లు స్వయంగా ముందుకు వచ్చి తమ పేర్లను తొలగించుకోవాలని సందీప్ సక్సేనా సూచించారు. ఓటరు కార్డుకు ఆధార్ నెంబర్లను, ఫోన్ నెంబర్లను అనుసంధానించబోతున్న దృష్ట్యా, తమ పరిశీలనలో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆయా పార్టీలు ఎన్నికల యంత్రాంగం చేపట్టే చర్యలకు సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 12 నుంచి జూలై నెలాఖరు వరకు ప్రత్యేక శిబిరాల్ని ఏర్పాటు చేసి, ఆధార్ నంబర్లను, ఫోన్ నంబర్లను అనుసంధానించే ప్రక్రియకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. శిబిరాల ఏర్పాటు వివరాల్ని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి జూలైలోపు ఈ ప్రక్రియను ముగించేందుకు ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టిన దృష్ట్యా, ఆధార్ కార్డులు లేని వారి పరిస్థితి ఏమిటో..!. గ్యాస్‌కు ఆధార్ లింక్ పుణ్యమా అని ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 75 శాతం మంది మాత్రమే ఆధార్ కార్డులను పొందారు. ఇక మిగిలిన వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
‘బోగస్’ ఏరివేత
Published Wed, Mar 4 2015 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM
Advertisement