పొవాయి జలాశయంలో బుద్ధుడి విగ్రహం
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజాధానిగా వెలుగొందుతున్న ముంబై నగరం త్వరలో మరో మైలు రాయిని అధిగమించనుంది. నగరానికి నీటి సరఫరా చేస్తున్న పొవాయి జలాశయంలో గౌతమ బుద్ధుడి భారీ విగ్రహం త్వరలో సందర్శకులను కనువిందు చేయనుంది. అరేబియా సముద్రంలో మెరైన్‌డ్రైవ్ వద్ద తీరం నుంచి మూడు కి.మీ. దూరంలో మరాఠీ ప్రజల ఆరాధ్యదైవమైన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తుది దశకు చేరుకున్న విషయం తెలిసిందే.
అయితే పొవాయిలో ఏర్పాటు చేయనున్న బుద్దుని విగ్రహం అందుకు భిన్నంగా ఉంటుంది.
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో ఏర్పాటు చేసినభారీ బుద్ధుని విగ్రహంలాగే ఇక్కడా బుద్ధుడి పూర్ణాకార విగ్రహం నెలకొల్పాలని ముంబై శివారు ప్రాంత జిల్లాధికారి నసీంఖాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో శాంతికి ప్రతీకగా నిలిచిన బుద్ధుని విగ్రహం 105 అడుగుల ఎత్తు ఉంది. దేశ ఆర్థిక నగరంలో ఇలాంటి భారీ విగ్రహాన్ని నెలకొల్పాలని కొన్ని సంస్థలు చాలారోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. బీఎంసీకి అనేక అడ్డంకులు ఎదురుకావడంతో ఈ ప్రతిపాదనపై అంతగా ఆసక్తి కనబర్చలేదు. అయితే రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి, శివారు ప్రాంత జిల్లా ఇన్‌చార్జి మంత్రి నసీంఖాన్ దీనిపై చొరవతీసుకున్నారు. ఇటీవల బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే, సంబంధిత పదాధికారులతో ప్రధాన కార్యాయంలో ఖాన్ సమావేశమయ్యారు.
ఇందులో బుద్ధుని విగ్రహాన్ని పొవాయి జలాశయంలో ఏర్పాటుచేయడానికి ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించారు. ఇందు మిల్లు స్థలంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు వివిధశాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకున్నారో అదే తరహాలో సంబంధిత శాఖలతో సంప్రదింపులు జరిపి పొవాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నసీమ్‌ఖాన్ సూచించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభించాల్సిన అన్ని రకాల అనుమతులు లభిస్తాయని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. దీంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది.