The countrys economic capital
-
కు.ని.కి పురుషులు దూరం..
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని నగరంలో కుటుంబ నియంత్రణ (కు.ని.) ఆపరేషన్లు చేయించుకోవడానికి పురుషులు వెనకడుగు వేస్తున్నట్లు రికార్డుల ద్వారా స్పష్టమైంది. మహిళల కంటే పురుషులకు కు.ని. ఆపరేషన్ చాలా సులభమని ప్రభుత్వం అనేక జనజాగృతి కార్యక్రమాలు చేపట్టింది. అయినప్పటికీ పురుషులు చొరవ తీసుకోకపోవడం రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులను కలవరానికి గురిచేస్తోంది. ఈ ఆపరేషన్ల విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్లే పురుషులు ముందుకు రావడం లేదని అధికారులు భావిస్తున్నారు. కు.ని.ఆపరేషన్ చేయించుకుంటే లైంగిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయోమోననే భయం, అపోహతోనే పురుషులు ఈ ఆపరేషన్‌కు దూరంగా ఉంటున్నారని పలు సర్వేలు తేల్చిచెప్పాయి. గత రెండు, మూడు సంవత్సరాల కాలంలో కు.ని. ఆపరేషన్లు చేయించుకునే పురుషుల సంఖ్య 50 శాతానికి పడిపోయింది. మహిళలకు కు.ని.ఆపరేషన్లు చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఈ ఆపరేషన్లు విఫలమైన సందర్భాలు ఎక్కువగా మహిళల్లోనే కనిపిస్తుంది. అదే పురుషులకు సంబంధించి 90 శాతానికి పైగా విజయవంతమైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాగే వారి లైంగిక జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్యులు బరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ పురుషులు ముందుకు రాకపోవడం అధికారుల్లో కలవరం లేపుతోంది. పురుషులను చైతన్య పరిచేందుకు గతంలో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపట్టింది. కు.ని. చేయించుకున్న పురుషులకు గతంలో ఇచ్చే రూ.550 ప్రోత్సాహక నగదును కేంద్ర ప్రభుత్వం రూ.1,100 పెంచి ఇచ్చింది. అయినప్పటికీ పురుషులు కు.ని.ఆపరేషన్ చేయించుకునేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. -
ముందస్తు పన్ను వసూళ్లలో 17 శాతం వృద్ధి
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ముందస్తు పన్ను వసూళ్లకు సంబంధించి సెప్టెంబర్ త్రైమాసికంలో నిర్దేశించుకున్న లక్ష్యాలకు దాదాపు చేరువగా ఉన్నట్లు ఆదాయ పన్ను శాఖ అధికారి వెల్లడించింది. సుమారు 17 శాతం వృద్ధి నిర్దేశించుకోగా, వసూళ్లు లక్ష్యానికి దగ్గరగా ఉన్నట్లు వివరించారు. అయితే, ఎంత వసూలైనదీ వెల్లడించలేదు. సాధారణంగా ట్రెండ్స్ తెలియజేసేలా ప్రతిసారీ టాప్ 100 కంపెనీల చెల్లింపుల వివరాలను ప్రకటించే ఆదాయ పన్ను శాఖ అధికారులు.. గత రెండు త్రైమాసికాల తరహాలోనే ఈసారి కూడా వెల్లడించలేదు. దేశం మొత్తంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో ముంబై సర్కిల్‌దే సింహభాగం ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 7.36 లక్షల కోట్లు ఆదాయ పన్ను శాఖ నిర్దేశించుకోగా.. ఇందులో రూ. 2.3 లక్షల కోట్లు ముంబై సర్కిల్ నుంచి రాబట్టాలని భావిస్తోంది. మరోవైపు, యస్ బ్యాంక్ తాము రెండో త్రైమాసికంలో రూ. 238 కోట్లు (20 శాతం వృద్ధి) అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినట్లు పేర్కొంది. అటు హెచ్డీఎఫ్సీ 13 శాతం అధికంగా రూ. 735 కోట్లు చెల్లించినట్లు వివరించింది. -
పొవాయి జలాశయంలో బుద్ధుడి విగ్రహం
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజాధానిగా వెలుగొందుతున్న ముంబై నగరం త్వరలో మరో మైలు రాయిని అధిగమించనుంది. నగరానికి నీటి సరఫరా చేస్తున్న పొవాయి జలాశయంలో గౌతమ బుద్ధుడి భారీ విగ్రహం త్వరలో సందర్శకులను కనువిందు చేయనుంది. అరేబియా సముద్రంలో మెరైన్‌డ్రైవ్ వద్ద తీరం నుంచి మూడు కి.మీ. దూరంలో మరాఠీ ప్రజల ఆరాధ్యదైవమైన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తుది దశకు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే పొవాయిలో ఏర్పాటు చేయనున్న బుద్దుని విగ్రహం అందుకు భిన్నంగా ఉంటుంది. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో ఏర్పాటు చేసినభారీ బుద్ధుని విగ్రహంలాగే ఇక్కడా బుద్ధుడి పూర్ణాకార విగ్రహం నెలకొల్పాలని ముంబై శివారు ప్రాంత జిల్లాధికారి నసీంఖాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో శాంతికి ప్రతీకగా నిలిచిన బుద్ధుని విగ్రహం 105 అడుగుల ఎత్తు ఉంది. దేశ ఆర్థిక నగరంలో ఇలాంటి భారీ విగ్రహాన్ని నెలకొల్పాలని కొన్ని సంస్థలు చాలారోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. బీఎంసీకి అనేక అడ్డంకులు ఎదురుకావడంతో ఈ ప్రతిపాదనపై అంతగా ఆసక్తి కనబర్చలేదు. అయితే రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి, శివారు ప్రాంత జిల్లా ఇన్చార్జి మంత్రి నసీంఖాన్ దీనిపై చొరవతీసుకున్నారు. ఇటీవల బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే, సంబంధిత పదాధికారులతో ప్రధాన కార్యాయంలో ఖాన్ సమావేశమయ్యారు. ఇందులో బుద్ధుని విగ్రహాన్ని పొవాయి జలాశయంలో ఏర్పాటుచేయడానికి ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించారు. ఇందు మిల్లు స్థలంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు వివిధశాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకున్నారో అదే తరహాలో సంబంధిత శాఖలతో సంప్రదింపులు జరిపి పొవాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నసీమ్‌ఖాన్ సూచించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభించాల్సిన అన్ని రకాల అనుమతులు లభిస్తాయని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. దీంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది.