పేరు మార్చుకున్న ఉద్యాననగరి | Byangaluru changed as Bangalore | Sakshi
Sakshi News home page

పేరు మార్చుకున్న ఉద్యాననగరి

Published Sun, Nov 2 2014 4:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM

Byangaluru changed as Bangalore

సాక్షి, బెంగళూరు: దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఉద్యాననగరి ‘బ్యాంగళూరు’ నుంచి అధికారికంగా ‘బెంగళూరు’గా పేరు మార్చుకుంది. చాలా కాలంగా నగరాన్ని బెంగళూరుగానే పిలుస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం ‘బ్యాంగళూరు’గానే పరిగణించబడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని మరో 11నగరాల పేర్లలో మార్పులకు ఇటీవలే కేంద్రం ఆమోద ముద్ర వేయడంతో శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఉచ్ఛారణలతో కొత్తపేర్లను అధికారికంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.  అయితే ఈ పేరు మార్పు కొన్ని సంస్థలు, వ్యవస్థలకు మాత్రమే పరిమితం కానుందనేది విభిన్న రంగాల్లోని నిపుణుల వాదన. మరి పేరు మార్చుకోనున్న సంస్థలేవి, పేరు మార్చుకోలేని సంస్థలేవి, ఇందుకు గల కారణాలు పరిశీలిస్తే....

పేరు మార్చుకోనున్న సంస్థలివే....
బెంగళూరు సిటీ, కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లలో ఇప్పటికే పేర్ల మార్పు పూర్తైది. బ్యాంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ), బ్యాంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఎంఆర్‌సీఎల్)లు తమ పేర్లను ‘బెంగళూరు’గా మార్చుకోనున్నాయి. ఈ విషయంపై బీఎంఆర్‌సీఎల్ అధికారులు స్పందిస్తూ....‘మా సంస్థకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఇక నుంచి ‘బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్’ పేరిట జరగనున్నాయి. సంస్థకు సంబంధించిన అన్ని పత్రాలు, అధికారిక వెబ్‌సైట్, టెండర్లు సైతం ఇదే పేరుతో దాఖలు కానున్నాయి.

అయితే ఈ పూర్తి కార్యక్రమాన్ని విడతల వారీగా పూర్తి చేయనున్నాం’ అని పేర్కొన్నాయి. ఇక బీఎంటీసీ కూడా పేరు మార్పులో ఇదే విధానాన్ని అనుసరించనుంది. ఇక బ్యాంగళూరు మెడికల్ కా లేజ్ అండ్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ (బీఎంసీఆర్‌ఐ) పేరు ఇ ప్పటికే ‘బ్యాంగళూరు’గా అనేక అంతర్జాతీయ, జాతీయ విశ్వవిద్యాలయాల్లో నమోదైన కారణంగా ఈ అంశాన్ని భారతీయ వైద్య విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లి అనంతరం పేరు మార్పుపై తుది నిర్ణయాన్ని తీసుకోనుంది.

పేరు మారదు....
ఇక పేరును మార్చబోని సంస్థల్లో బ్యాంగళూరు విశ్వవిద్యాలయం, బ్యాంగళూరు హాస్పిటల్, బ్యాంగళూరు లిటిల్ థియేటర్‌లున్నాయి. పేరు మార్పుపై బ్యాంగళూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ తిమ్మేగౌడ స్పందిస్తూ...‘యూనివర్సిటీ పేరు యధాతథంగా కొనసాగనుంది. మద్రాస్, కలకత్తా, బాంబేల పేర్లు మారిన సందర్భంలో సైతం అక్కడి విశ్వవిద్యాలయాల పేర్లను మార్చలేదు’ అని చెప్పారు. ఇక బ్యాంగళూరు హాస్పిటల్‌ను కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేసినందువల్ల ఆ సంస్థ పేరును కూడా మార్చేందుకు అవకాశం లేదని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

ఏయే నగరాలు, ఎప్పుడెప్పుడు.....
బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రముఖ నగరాలు తమ పేర్లను మార్చుకున్నాయి. వాటిలో 1991లో త్రివేండ్రం, తిరువనంతపురంగా, 1995లో బాంబే, ముంబైగా, 1996లో మద్రాస్,  చెన్నైగా, 2001లో కలకత్తా, కోల్‌కటాగా, 2006లో పాండిచ్చేరి, పుదుచ్చేరిగా, 2008లో పూణా, పుణెగా, 2011లో ఒరిస్సా, ఒడిషాగా పేర్లు మార్చుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement