- ముగిసిన రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు
- క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి
- కెనరాబ్యాంక్ చీఫ్ మేనేజర్ శ్రీనివాస్‌రావు
బళ్లారి అర్బన్ : రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో కెనరా బ్యాంకు బెంగళూరు జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఆకుల సూర్యనారాయణ జ్ఞాపకార్థకం బళ్లారి జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్, బళ్లారి బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ క్రీడామైదానంలో ఈనెల 13న ప్రారంభమైన రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి.
పోటీల్లో మొత్తం 16 జట్లు పాల్గొనగా క్వార్టర్ ఫైనల్‌లో ఏ పూల్ కెనరాబ్యాంక్ బెంగళూరు, సహ్యాద్రి బీబీసీ బెంగళూరు, బీ పూల్‌లో స్పుట్నిక్ ఏ టీం భద్రావతి, గాంధీనగర్ ఏ టీం తుమకూరు, సీ పూల్‌లో బనశంకరి బెంగళూరు ఆలూరు చామరాజ్ నగర్, డీ పూల్‌లో బళ్లారి బీబీబీఏ ఏ టీం బళ్లారి, శికారిపుర్ ఫైస్ శికారిపుర్ జట్లు తలపడగా కెనరా బ్యాంక్ బెంగళూరు వర్సెస్ బళ్లారి బీబీబీఏ ఏ టీం బనశంకరి బెంగళూరు, గాంధీనగర్ ఏ టీం తుమకూరు సెమిఫైనల్‌కు చేరుకున్నాయి. ఆదివారం కెనరా బ్యాంక్ బెంగళూరు బనశంకరి బెంగళూరు జట్లు, థర్డ్ లెవెల్‌లో బీబీబీఏ బళ్లారి, ఫోర్త్ లెవెల్‌లో గాంధీనగర్ తుమకూరు జట్లు ఫైనల్ పోటీల్లో పాల్గొన్నాయి.
ఉత్కంఠంగా సాగిన పోటీల్లో కెనరా బ్యాంక్ బెంగళూరు టీం విజయ కేతనం ఎగురవేసింది. దీంతో ఆ జట్టుకు రూ.25 వేలు నగదుతో పాటు షీల్డ్ బహుమతిని అందుకుంది. బనశంకరి బెంగళూరు టీం రూ.15 వేలు నగదు, పాటు షీల్డ్, గాంధీనగర్ ఏ టీం తుమకూరు జట్టు రూ.10 వేలు నగదు పొందింది. బళ్లారి బీబీఏ బాల్‌బ్యాడ్మింటన్ ఏ టీం రూ.5 వేలు నగదు అందజేశారు.
దావణగెరెకు చెందిన 67 ఏళ్ల సూర్యనారాయణకు ఓల్డెస్ట్ ప్లేయర్‌గా, మూడబిద్రెకు చెందిన ఆలాస్ టీంలో 16 ఏళ్ల యువకుడు పునీత్‌కు విశేష బహుమతులు అందించారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో కెనరాబ్యాంక్ చీఫ్ మేనేజర్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ గెలుపోటముల కన్నా క్రీడల్లో పాల్గొనడమే ప్రధాన ధ్యేయమన్నారు. క్రీడాకారులు ప్రతిభకు పదును పెట్టుకొని జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు.
రిటైర్డ్ ప్రిన్సిపాల్, సీనియర్ క్రీడాకారుడు వెంకోబ రావ్ మాట్లాడుతూ ఆకుల సూర్యనారాయణ జ్ఞాపకార్థం నిర్వహించిన బాల్‌బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు క్రీడాకారులకు మరింత ఉత్సాహాన్ని అందించిందన్నారు. కార్యక్రమంలో బళ్లారి బాల్‌బ్యాడ్మింటన్ రాష్ట్ర కార్యదర్శి దినేష్, సిటీ అధ్యక్షుడు నవీన్‌రావ్, కార్యదర్శి హెచ్.రాఘవేంద్ర, మారేగౌడ, మల్లేశప్ప, జయతీర్థ తదితరులు పాల్గొన్నారు.