సెట్‌టాప్ బాక్స్ లేకుంటే ప్రసారాలు బంద్
హైదరాబాద్: నాలుగో విడత డిజిటలైజేషన్ ప్రక్రియను డిసెంబర్ 31లోపు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంఎస్‌ఓలు సెట్‌టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించింది. సెట్‌టాప్ బాక్సులు లేకపోతే 2017 జనవరి ఒకటో తేదీ నుంచి కేబుల్ ప్రసారాలు నిలిచిపోతాయని తేల్చిచెప్పింది.
ఇప్పటికే వివిధ ప్రసార, ప్రచార మాధ్యమాల ద్వారా ఎస్టీపీ బాక్సులపై విస్తృత ప్రచారం చేశామని, దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి జయశ్రీ ముఖర్జీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. డిజటలైజేషన్ అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించుకోవాలని, సెట్‌టాప్ బాక్సులు ఎన్ని అవసరం, ఎన్ని అమర్చారనే దానిపై నిరంతరం సమీక్షించాలని ఆదేశించారు. అలాగే, వినియోగదారులకు అవగాహన కల్పించేలా ఎంఎస్‌ఓ/ కేబుల్ టీవీ అపరేటర్లతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని జయశ్రీ ముఖర్జీ ఆ లేఖలో కోరారు.