చెన్నై : ఇంటింటికీ ఇంటర్నెట్, ఫోన్, టీవీ కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.149కే ఏపీ ఫైబర్ నెట్ అంటూ ఊదరగొట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. ఏపీ ఫైబర్ గ్రిడ్ కు సరఫరా చేసేందుకు చైనా నుంచి దిగుమతి చేసిన సెటాప్ బాక్సులను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఫైబర్ గ్రిడ్ కు 3.5 లక్షల ఐపిటివి సెటాప్ బాక్సులను సరఫరా చేసే కాంట్రాక్టును టెరా సాఫ్ట్ వేర్స్ పొందింది. ఈ సంస్థ సెటాప్ బాక్సులను చైనా నుంచి తెప్పించింది.
చెన్నైకి ఓడలో దిగుమతి చేసిన 24 వేల సెటాప్ బాక్సులు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రమాణాలకు అనుగుణంగా లేనందున సీజ్ చేసినట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అంతేకాదు ఆండ్రాయిడ్ బాక్సుల పేరుతో వాటిని దిగుమతి చేసి మోసం చేశారని కూడా అధికారులు పేర్కొన్నారు. ఎలాంటి సెటాప్ బాక్సుకైనా ఐటీ భద్రతకు సంబంధించి ఐఎస్ 13252 ప్రమాణాలు పాటించాలని, ఈ బాక్సుల్లో ఆ ప్రమాణాలు పాటించలేదని అధికారులు తేల్చారు. కోటి 48లక్షల విలువైన ఈ సెటాప్ బాక్సులు సీజ్ కావడంతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అధికారుల్లో సంచలనంగా మారింది.
ఇప్పటికే ఎన్నో స్కామ్‌లకు కేరాఫ్‌గా మారిన ఫైబర్ గ్రిడ్‌ను ఇప్పుడు తాజా వివాదం ముప్పతిప్పలు పెడుతోంది. ఈనెలలో ఎలాగైనా లక్ష కనెక్షన్లు ఇస్తామని చెప్పిన ఫైబర్ గ్రిడ్‌కి ఆ మాట నిలబెట్టుకునే పరిస్థితి కనిపించడంలేదు. తన సొంత మనుషుల కంపెనీలతో కొనుగోళ్లు చేయిస్తున్న సీఎం చంద్రబాబుకి ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది. కాగా టెరా సాఫ్ట్‌వేర్ సంస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌కు అత్యంత సన్నిహితమైన వ్యక్తులది. ఇప్పుడా సంస్థ చేసిన నిర్వాకంతో కస్టమ్స్ అధికారులు బాక్సులను సీజ్ చేశారు. టెరా సాఫ్ట్ వేర్ చీటింగ్ చెన్నైలో బట్టబయలు కావడంతో ఫైబర్ గ్రిడ్ అధికారుల్లో గందరగోళం నెలకొంది. దీని వలన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా జనానికి టీవీ సేవలు అందడం ఆలస్యం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment