coustams officers
-
పేస్ట్‌గా మార్చి.. లోదుస్తుల్లో దాచి..
సాక్షి, హైదరాబాద్: బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ వెర్షన్ టైప్‌లో వినూత్న పద్ధతులు పాటిస్తున్నారు. పసిడిని వివిధ రూపాలుగా మార్చి అధికారులను ఏమార్చేందుకు ప్రయత్నిస్తూ చిట్టచివరకు అడ్డంగా బుక్ అవుతున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదివారం దోహా నుంచి వచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు అతడి నుంచి రూ.36.99 లక్షల విలువైన 1164.9 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతుండగా... ప్రస్తుతం హైదరాబాద్‌లో తులం రూ.33 వేల వరకు ఉంది. అదే ఖతర్, దుబాయ్ తదితర దేశాల్లో రూ.26వేలకే లభిస్తోంది. దీంతో బంగారం అక్రమ రవాణా చేస్తే ఒక్కో ట్రిప్‌లో కనీసం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల లాభం ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అనేక మంది కీలక సూత్రధారులు క్యారియర్లను ఏర్పాటు చేసుకొని వ్యవస్థీకృతంగా ఈ దందా చేస్తున్నారు. అయితే ఇటీవలి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు వరుసగా పట్టుకుంటున్న కేసులతో ఎక్కువగా ‘గోల్డ్ పేస్ట్’ స్మగ్లింగ్ పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. తెచ్చాడిలా... కేరళకు చెందిన ఓ వ్యక్తిని అక్కడి కీలక సూత్రధారులు క్యారియర్‌గా మార్చుకున్నారు. కమీషన్ లేదా విమానం టికెట్లు ఇస్తూ తాము అందించే బంగారాన్ని భారత్‌కు చేర్చే బాధ్యతలు నిర్వర్తించే వారిని క్యారియర్లుగా పిలుస్తారు. వీరికి సూత్రధారులతో ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. కేవలం దళారుల సూచనల మేరకు ఈ అక్రమ రవాణా చేస్తుంటారు. వీరు ఇక్కడికి వచ్చిన తర్వాత బంగారం ఎవరికి ఇవ్వాలనేది చెప్పరు. కేవలం క్యారియర్లను విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి ఫలానా చోట ఉండమంటారు. వీరి ఫొటోలను దళారులు వాట్సాప్ ద్వారా ఇక్కడి రిసీవర్లకు పంపుతారు. దీంతో వీరిని గుర్తించే రిసీవర్లు బంగారం తీసుకొని టిప్స్ ఇస్తుంటారు. కేజీకి పైగా బంగారం ఖరీదు చేసిన స్మగ్లర్లు దోహాలో ఉన్న కొన్ని ప్రత్యేక దుకాణాలకు అందించారు. దాన్న పౌడర్‌గా ఆపై పేస్ట్‌గా మార్చిన ఆ దుకాణదారులు ప్రత్యేకంగా ప్యాక్ చేసి అందించారు. దీన్ని ఓ ప్రత్యేకమైన వస్త్ర సంచిలో ఉంచిన కేరళవాసి లోదుస్తుల్లో దాచుకొని తీసుకొచ్చాడు. ఆదివారం ఉదయం ఇండిగో విమానంలో శంషాబాద్‌కు వచ్చిన ఇతగాడు ‘గ్రీన్ చానెల్’ ద్వారా బయటకు వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎవరి వద్ద అయితే ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన వస్తువులు ఉండవో వారు ఈ చానెల్లో బయటకు వెళ్లిపోతారు. అలాంటి వస్తువులు, బంగారం తీసుకొచ్చిన వాళ్లు రెడ్ చానెల్లోకి వెళ్లి ఆయా వస్తువుల్ని డిక్లేర్ చేయడంతో పాటు పన్ను చెల్లించి వస్తారు. గ్రీన్ చానెల్లో బయటకు వస్తున్న కేరళ వాసి వ్యవహారాన్ని శంషాబాద్ కస్టమ్స్ అధికారులు అనుమానించారు. ఆపి తనిఖీ చేయగా లోదుస్తుల్లో దాచిన సంచిలో ఉన్న 1900 గ్రాముల పేస్ట్ దొరికింది. దీన్ని ప్రాసెసింగ్ చేసిన అధికారులు 1164.9 గ్రాముల బంగారంగా మార్చారు. ఇతడు ఎవరి కోసం ఈ బంగారం తీసుకొచ్చాడు? దీని వెనుక ఎవరు ఉన్నారు? తదితర అంశాలను కస్టమ్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. -
ఏపీ ఫైబర్ గ్రిడ్‌కు ఊహించని షాక్!
చెన్నై : ఇంటింటికీ ఇంటర్నెట్, ఫోన్, టీవీ కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.149కే ఏపీ ఫైబర్ నెట్ అంటూ ఊదరగొట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. ఏపీ ఫైబర్ గ్రిడ్ కు సరఫరా చేసేందుకు చైనా నుంచి దిగుమతి చేసిన సెటాప్ బాక్సులను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఫైబర్ గ్రిడ్ కు 3.5 లక్షల ఐపిటివి సెటాప్ బాక్సులను సరఫరా చేసే కాంట్రాక్టును టెరా సాఫ్ట్ వేర్స్ పొందింది. ఈ సంస్థ సెటాప్ బాక్సులను చైనా నుంచి తెప్పించింది. చెన్నైకి ఓడలో దిగుమతి చేసిన 24 వేల సెటాప్ బాక్సులు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రమాణాలకు అనుగుణంగా లేనందున సీజ్ చేసినట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అంతేకాదు ఆండ్రాయిడ్ బాక్సుల పేరుతో వాటిని దిగుమతి చేసి మోసం చేశారని కూడా అధికారులు పేర్కొన్నారు. ఎలాంటి సెటాప్ బాక్సుకైనా ఐటీ భద్రతకు సంబంధించి ఐఎస్ 13252 ప్రమాణాలు పాటించాలని, ఈ బాక్సుల్లో ఆ ప్రమాణాలు పాటించలేదని అధికారులు తేల్చారు. కోటి 48లక్షల విలువైన ఈ సెటాప్ బాక్సులు సీజ్ కావడంతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అధికారుల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే ఎన్నో స్కామ్‌లకు కేరాఫ్‌గా మారిన ఫైబర్ గ్రిడ్‌ను ఇప్పుడు తాజా వివాదం ముప్పతిప్పలు పెడుతోంది. ఈనెలలో ఎలాగైనా లక్ష కనెక్షన్లు ఇస్తామని చెప్పిన ఫైబర్ గ్రిడ్‌కి ఆ మాట నిలబెట్టుకునే పరిస్థితి కనిపించడంలేదు. తన సొంత మనుషుల కంపెనీలతో కొనుగోళ్లు చేయిస్తున్న సీఎం చంద్రబాబుకి ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది. కాగా టెరా సాఫ్ట్వేర్ సంస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌కు అత్యంత సన్నిహితమైన వ్యక్తులది. ఇప్పుడా సంస్థ చేసిన నిర్వాకంతో కస్టమ్స్ అధికారులు బాక్సులను సీజ్ చేశారు. టెరా సాఫ్ట్ వేర్ చీటింగ్ చెన్నైలో బట్టబయలు కావడంతో ఫైబర్ గ్రిడ్ అధికారుల్లో గందరగోళం నెలకొంది. దీని వలన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా జనానికి టీవీ సేవలు అందడం ఆలస్యం కానుంది. -
ఎయిర్‌పోర్టులో భారీగా సెల్ఫోన్లు స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గురువారం భారీగా సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న సెల్ఫోన్లను పెద్ద సంఖ్యలో పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు ఈ రోజు ఉదయం బ్యాంకాక్ నుంచి టైగర్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికురాలి లగేజీలో ఈ విలువైన సెల్ఫోన్లు బయటపడ్డాయి. అయితే అవి ఎలాంటి కంపెనీ పేరులేని విలువైన ఫోన్లుగా సమాచారం. దీంతో సదరు మహిళను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.