
ప్రస్తుతానికి నో ఎఫ్‌ఐఆర్
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందిన కేసులో ప్రస్తుతానికి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అవకాశాలు లేవని నగర పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ సోమవారం ప్రకటించారు. అయితే ఈ కేసులో నేర శిక్షాస్మృతి ప్రకారం విచారణ కొనసాగుతుందని వెల్లడించారు.
ఎఫ్‌ఐఆర్ నమోదుకు అవసరమైన సాక్ష్యాధారాలేవీ తమకు లభించలేదని తెలిపారు. ఇప్పటి వరకు పలువురు సాక్షులను ప్రశ్నించామని, ప్రాసంగిక సాక్ష్యాలను పరిశీలించినా ఏమీ వెల్లడికాలేదని ఆయన వివరించారు. పెళ్లయిన ఏడేళ్లలోపు వివాహిత మరణిస్తే నిబంధనల ప్రకారం సంబంధిత సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్ న్యాయ విచారణ నిర్వహించారని తెలిపారు.
సునంద మృతికి విషప్రయోగం కారణమని, హఠాత్తుగా మరణం సంభవించినట్టు పోస్టుమార్టం నివేదిక వెల్లడించడంతో ఆత్మహత్య కోణంలో దర్యాప్తు నిర్వహించాల్సిందిగా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ఢిల్లీ పోలీసులను ఆదేశించడం తెలిసిందే. ‘సునంద మరణం వెనుక ఏదైనా కుట్ర ఉన్నట్టు తేలితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది. అప్పటి వరకు సాధారణ విచారణ కొనసాగుతుంది.
ఆమె ఏ రకం విషం తీసుకుందో ఫోరెన్సిక్ నివేదిక తెలియజేస్తుందని భావించాం. అయితే సదరు నివేదిక ఇలాంటి విషయాలను వెల్లడించలేదు. సునంద విషం తీసుకోలేదని, మందులే విషపూరితంగా మారి మరణానికి దారి తీశాయని తెలిపింది. అందులోని వివరాల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం కుదరదు అని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఫోరెన్సిక్ నివేదికలపై మరింత సమాచారం సేకరించడానికి పోస్టుమార్టం నిర్వహించిన ఎయిమ్స్ డాక్టర్ల బృందాన్ని సంప్రదిస్తామని పేర్కొన్నారు.
భర్త శశి థరూర్‌కు పాక్ జర్నలిస్టు మెహర్ తరార్‌తో వివాహేతర సంబంధం ఉందని ట్విటర్‌లో ఆరోపించిన సునంద, మరునాడే మరణించింది. దక్షిణ ఢిల్లీలోని ఐదు నక్షత్రాల హోటల్‌లో జనవరి 17న ఈ ఘటన జరిగింది. సునంద మరణం వెనుక కుట్ర ఉన్నట్టు భావించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారని సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్ పోలీసులకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.