♦ డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్
♦ రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు
సాక్షి, న్యూఢిల్లీ : మున్సిపల్ కార్పొరేషన్ల ప్రస్తుత దుస్థితికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం, ఆప్ ప్రభుత్వాలే కారణమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వారికి వ్యతిరేకంగా సోమవారం నగరంలో పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 12 జోన్లలో నిరసన ప్రదర్శనలు నిర్వహించి నరేంద్ర మోదీ, కేజ్రీవాల్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న లజ్‌పత్‌నగర్‌లోని సెంట్రల్ జోన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఢిల్లీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పీసీ చాకో, డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అజయ్ మాకెన్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్పొరేషన్ల ఆర్థిక స్థితి దిగజారిపోయిందన్నారు. సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాయని చెప్పారు. అలాగే ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడం లేదని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీలోని ఆప్ సర్కారు వల్లనే మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయని ఆయన విమర్శించారు. 2012-13లో మున్సిపల్ కార్పొరేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 3,128 కోట్లు కేటాయించిందని చెప్పారు.
2014-15లో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎమ్సీడీ నిధులపై రూ. 651 కోట్లు కోత విధించిందన్నారు. ప్రస్తుతం ఆర్థిక చిక్కుల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లకు చేయూతనివ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫుట్‌బాల్ ఆడుకుంటున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఈవిధంగా ఎన్నడూ జరగలేదని మాకెన్ చెప్పారు.
కార్పొరేషన్ల దుస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం
Published Mon, Apr 6 2015 11:34 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement