కాంగ్రెస్‌లో గందరగోళం
ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. విప్ ధిక్కరించి చైర్మన్ పీఠాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడానికి సహకరించిన కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలంటూ సీనియర్ నాయకులు పట్టుబడుతున్నారు. ఈ విషయమై ఎటూ తేల్చకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. కౌన్సిలర్లు ఖాందేశ్ సంగీత, జాగిర్దార్ ఆకుల లత, పండిత్ ప్రేమ్, కోగుల పూల నర్సయ్య ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికకు గైర్హాజరైన విషయం తెలిసిందే.
దీంతో టీఆర్‌ఎస్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోగలిగింది. విప్ ధిక్కరించి కాంగ్రెస్ ఓటమి కి కారణమైన ఆ నలుగురు కౌన్సెలర్లతో పాటు మహిళా కౌన్సిలర్ల భర్తలు పీసీసీ కార్యదర్శి ఖాందేశ్ శ్రీనివాస్, జాగిర్దార్ శ్రీనివాస్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలని, కౌన్సెలర్లపై అనర్హత వేటు వేయించాలని పార్టీ నాయకులు డీసీసీకి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ తెలంగాణ పీసీసీకి లేఖ రా శారు.
ఈ లేఖను సరిగా చదవని ఆర్మూ ర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సదరు నేతలను పార్టీనుంచి సస్పెండ్ చేశారని తెలిపారు. లేఖను చదివినవారు అవి సస్పెన్షన్ ఆదేశాలు కావని పేర్కొనడంతో పట్టణ కాంగ్రెస్ నాయకులు అవాక్కయ్యారు. వెంటనే డీసీసీ అధ్యక్షుడితో మాట్లాడారు. ఆర్మూర్ మున్సిపల్ పీఠాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడానికి సహకరించిన ఆరుగురు నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. విప్ ధిక్కరించిన వారిని ఉపేక్షిస్తే భవిష్యత్‌లో ఆర్మూర్‌లో కాంగ్రెస్ ఉండదని హెచ్చరించారు.
ఎన్నికల నిబంధనలకు నీళ్లు
ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో నిబంధనలకు నీళ్లు వదిలి ప్రతి కాంగ్రెస్ అభ్యర్థులు లక్షల రూపాయలు ఖర్చు చేశారని పార్టీ మండల అధ్యక్షుడు పీసీ భోజన్న పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. నలుగురు కాంగ్రెస్ కౌన్సెల ర్లు డబ్బులకు అమ్ముడు పోయి టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారని ఆయన ఆరోపించారు. అదే ఆవేశంలో కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికల ఖర్చుల కోసం ప్రతి అభ్యర్థికి రూ. 3 లక్షలు ఇచ్చిం దని, వాటిని ఆ నలుగురు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి రేసులో ఉన్న శ్రీదేవి భర్త శ్రీనివాస్ నుంచి కౌన్సిలర్లు తీసుకున్న డబ్బులను వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై ఖాందేశ్ సంగీత శ్రీనివాస్, పండిత్ ప్రేమ్‌లు ఫోన్‌లో స్పందించారు. తాము పార్టీ ఫండ్ తీసుకోలేదన్నారు.