గులాబీలో గుబులు | Celebration for Congress in Telangana, gloom in TRS | Sakshi
Sakshi News home page

గులాబీలో గుబులు

Published Tue, May 13 2014 2:37 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

గులాబీలో గుబులు - Sakshi

గులాబీలో గుబులు

 ఫలితాలపై టీఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన
  మెదక్ జిల్లాలోనూ విఫలం.. 
  కేసీఆర్ కోటలో టీడీపీ పాగా
  పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోనూ పాట్లు, అనేక చోట్ల కాంగ్రెస్‌దే పైచేయి
  అయినా కొన్ని ప్రాంతాల్లో విస్తరించామంటున్న నేతలు
  పరిషత్ ఫలితాలు బాగుంటాయని విశ్వాసం
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారంలోకి వస్తామనే ధీమాలో ఉన్న టీఆర్‌ఎస్‌కు మున్సిపల్ ఫలితాలు నిరాశ కలిగించాయి.  కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ వంటి పార్టీకి పట్టున్న జిల్లాల్లోనూ ఆశించిన ఫలితాలు రాకపోవడం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. కేసీఆర్ సొంత జిల్లాలోనూ టీఆర్‌ఎస్‌కు చేదు ఫలితాలు రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. స్వయంగా కేసీఆర్ పోటీచేస్తున్న గజ్వేల్‌లోనే టీడీపీ జయకేతనం ఎగరేసింది. మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు టీఆర్‌ఎస్ ముఖ్యనేత టి.హరీష్‌రావు ఇన్‌చార్జిగా వ్యవహరించినప్పటికీ ఫలితం దక్కలేదు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలనే చవిచూడాల్సి వచ్చింది. ఇక రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, మహబూబ్‌నగర్‌లో ఐజ మినహా మిగిలిన మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ పరిస్థితి దారుణంగా ఉంది. నల్లగొండ జిల్లాలో బలం పెరిగిందని గులాబీ శ్రేణులు విశ్వాసం ప్రదర్శించినా తాజా ఫలితాల్లో ఆ ఛాయలేమీ కనిపించలేదు. ఇక్కడి అన్ని మున్సిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులు దారుణంగా ఓటమి పాలయ్యారు. ఊహించినట్టుగానే  ఖమ్మం జిల్లాలో పార్టీకి ప్రతికూల ఫలితాలే ఉన్నా కొత్తగూడెం, ఇల్లెందు వంటివాటిలో కొన్ని వార్డులు రావడం కొంత సానుకూలాంశమే. 
 
ఇదీ పరిస్థితి: ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో టీఆర్‌ఎస్‌కు 14 వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీలకు ఏడు వార్డులు రాగా ఇతరులకు నాలుగు వచ్చాయి. ఇక్కడ కూడా టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ రాలేదు. బెల్లంపల్లిలోని 34 వార్డుల్లో టీఆర్‌ఎస్‌కు 10కు పరిమితమైతే, కాంగ్రెస్‌కు 14 వార్డులు వచ్చాయి. టీఆర్‌ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన గడ్డం అరవింద్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మంచిర్యాలలోని 32 వార్డులకు గాను కాంగ్రెస్‌కు 18 వస్తే టీఆర్‌ఎస్‌కు 14 వార్డులు వచ్చాయి. నిర్మల్‌లోని 36 వార్డుల్లో టీఆర్‌ఎస్‌కు దారుణంగా 3 మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్‌కు 5 వస్తే బీఎస్‌పీకి ఎవరూ ఊహించని విధంగా 16 వార్డుల్లో జయకేతనం ఎగరేసింది. భైంసాలోని 23 వార్డుల్లో ఎంఐఎంకు 12 వస్తే బీజేపీకి 6 వచ్చాయి. ఇక్కడ టీఆర్‌ఎస్ 2, కాంగ్రెస్ 2 స్థానాలకే పరిమితమైంది. ఈ జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లతో పాటు బీఎస్పీ, ఎంఐఎం కూడా గట్టి పోటీనిచ్చాయి.
 
 - నిజామాబాద్ కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలను సాధించి 10 డివిజన్లకే పరిమితమైన టీఆర్‌ఎస్‌పై స్పష్టమైన ఆధిక్యతను చాటుకుంది. ఎంఐఎం, బీజేపీలు కూడా తమ బలాన్ని నిరూపించుకున్నాయి. నిజామాబాద్‌లోని మూడు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ ఆధిక్యతను ప్రదర్శించింది. కామారెడ్డి(33)లో కాంగ్రెస్‌కు 17, బీజేపీకి 8, టీఆర్‌ఎస్‌కు 5 మాత్రమే వచ్చాయి.
 
 - కరీంనగర్‌లో కార్పొరేషన్(50)లో 24 డివిజన్లను గెలుచుకుని టీఆర్‌ఎస్ తలెత్తుకుంది. అయితే కాంగ్రెస్ కూడా 14 డివిజన్లను గెల్చుకుంది. ఆ జిల్లాలోని మరో కార్పొరేషన్ రామగుండం(50)లో కాంగ్రెస్ 19 డివిజన్లలో గెలిచి పెద్దపార్టీగా నిలిస్తే.. టీఆర్‌ఎస్ 14 స్థానాల్లో నెగ్గింది. అనూహ్యంగా ఇక్కడ ఇండిపెండెంట్లు 15 స్థానాలను గెలిచి కీలకంగా మారారు. మిగిలిన 9 మున్సిపాలిటీల్లో ఐదింటిలో టీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలను సాధించినా జమ్మికుంట, మెట్‌పల్లి, హుస్నాబాద్‌లలో మాత్రమే స్పష్టమైన మెజారిటీని సాధించింది. కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహించిన సిరిసిల్ల(33)లోనూ టీఆర్‌ఎస్ 15 వార్డులు గెలుచుకున్నా స్పష్టమైన మెజారిటీ రాలేదు.
 
 - మెదక్(27) మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌కు 11 మాత్రమే వచ్చాయి. కేసీఆర్ పోటీచేస్తున్న గజ్వేల్(20)లో కూడా టీఆర్‌ఎస్‌కు తొమ్మిదే దక్కాయి. ఇక్కడ టీడీపీకి 10 వార్డులు వచ్చాయి. ఇక సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, ఆందోల్‌లో కాంగ్రెస్ చేతిలో టీఆర్‌ఎస్ దారుణంగా దెబ్బతిన్నది. మహబూబ్‌నగర్‌లో ఐజ, రంగారెడ్డిలో తాండూరు మినహా మిగిలిన వాటిలో గులాబీ దళం బోల్తా పడింది. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ అత్యంత దారుణంగా పరాజయాలను మూటగట్టుకుంది.
 
 అప్పుడున్న సందిగ్ధత వల్లే..!
 మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు, విలీనం విషయమై అస్పష్టత నెలకొన్నందువల్లే ఈ పరిస్థితి ఎదురైందని టీఆర్‌ఎస్ నేతలు వాదిస్తున్నారు. ఆ విషయంలో పడి ఎన్నికలపై సరిగా దృష్టి నిలుపలేదంటున్నారు. అలాగే పరిషత్, సార్వత్రిక ఎన్నికలు కూడా రావడంతో ఎవరి సమస్యల్లో వారే ఉండిపోయారని చెబుతున్నారు. సాధారణ ఎన్నికల్లో టికెట్లు ఖరారు కాకపోవడం వల్ల కూడా అయోమయం నెలకొందని విశ్లేషిస్తున్నారు. పట్ణణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌కు బలమైన పునాది కూడా లేదని, ఈ ఎన్నికల ఫలితాల ద్వారా కొన్ని బలం లేని ప్రాంతాల్లోనూ పార్టీ విస్తరించినట్టుగా తెలుస్తోందని పేర్కొంటున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నిజామాబాద్ వంటి జిల్లాల్లో టీఆర్‌ఎస్‌కు కొన్ని వార్డులు రావడం ద్వారా పార్టీని విస్తరించడానికి అవకాశం ఏర్పడినట్టేనంటున్నారు. గ్రామీణ ప్రాంతాలతో ముడివడి ఉన్న పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మెరుగైన ఫలితాలు వస్తాయని ఆ పార్టీ ముఖ్య నేతలు ఆశిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా అన్ని వర్గాల్లో బలమైన పవనాలు వీచాయని, తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే వాదిస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement