సాక్షిప్రతినిధి, అనంతపురం : బండ్లు ఓడలు కావడం...ఓడలు బండ్లు కావడం అంటే ఏంటో 2014లో సుస్పష్టంగా తెలిసింది. పదేళ్లుగా జిల్లాలో అధికార చక్రం తిప్పిన కాంగ్రెస్‌పార్టీ తొలిసారి ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవకుండా పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు...శాశ్వత శత్రువులు ఉండరనే మాటను నిజం చేస్తూ టీడీపీని బద్దశత్రువుగా భావించిన జేసీ కుటుంబం ‘పచ్చ’కండువాను మెడలో వేసుకుంది.
తొలిసారి 11 మంది అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ గడప తొక్కారు. సినీనటుడు బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా గెలవడం..పీసీసీ, సీపీఐ రాష్ట్ర సారథులుగా ‘అనంత’ వాసులు ఎంపిక కావడం ఈ ఏడాది విశేషం. మొత్తంపైన 2014 కొందరు సీనియర్ నేతలకు పీడకలగా మిగిలిపోతే, చాలా మంది కొత్త ముఖాలకు మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది.
2014లో..‘తీన్‌మార్’
ఈ ఏడాది వేసవిలో మూడు ఎన్నికలు నెలన్నర తేడాతో జరిగాయి. మునిసిపల్ ఎన్నికలతో పాటు స్థానిక, సార్వత్రిక ఎన్నికలు వరుస క్రమంలో ముగిశాయి. దీంతో రాజకీయపార్టీలలో పదవుల పందేరం ఈ ఏడాది ముగిసింది. మళ్లీ ఐదేళ్ల వరకూ ఎలాంటి ఎన్నికలు లేకుండా 2014లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి 11 మంది తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
వైఎస్సార్‌సీపీ తరఫున ఉరవకొండ, కదిరి ఎమ్మెల్యేలుగా విశ్వేశ్వరరెడ్డి, చాంద్ బాషా, టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ, జేసీ ప్రభాకర్‌రెడ్డి, యామినీ బాల, ప్రభాకర్ చౌదరి, ఈరన్న, వరదాపురం సూరి, జితేంద్ర, హనుమంతరాయ చౌదరి, కాలువ శ్రీనివాసులు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
సైకిలెక్కిన జేసీ బ్రదర్స్
కాంగ్రెస్ పార్టీతో విడదీయరాని బంధం ఉన్న ‘అనంత’ ప్రముఖ నేతల్లో జేసీ బ్రదర్స్ ఉండేవారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో రాష్ట్రంలో ప్రాభవాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీలో ఇక తమకు భవిష్యత్తు ఉండదని గ్రహించిన వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పరిటాల రవి హత్య కేసులో జేసీ కూడా నిందితుడే అని ఆ పార్టీలోని ఓ వర్గం ఇన్నాళ్లూ ఆరోపించిన నేపథ్యంలో జేసీ రాకను పరిటాల వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా చంద్రబాబు పరిటాల వర్గాన్ని తేలిగ్గా తీసుకుని జేసీ బ్రదర్స్‌ను సైకిలెక్కించారు. దీంతో జేసీ దివాకర్‌రెడ్డి తొలిసారి ఎంపీగా, ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.
నాడు జిల్లా బహిష్కరణ..నేడు జిల్లా ప్రథమ పౌరుడు
ఆర్వోసీలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు, ఇతరత్రా కేసులతో చమన్ సాహెబ్‌పై పోలీసులు జిల్లా బహిష్కరణ విధించారు. దీంతో దాదాపు పదేళ్లపాటు చమన్ జిల్లాలో కనిపించకుండా వెళ్లిపోయారు. చంద్రబాబు పాదయాత్ర సమయంలో ఉరవకొండ సమీపంలో చంద్రబాబును కలిశారు. అయితే పోలీసులు మళ్లీ జిల్లా దాటించారు. ఈ క్రమంలో రామగిరి జెడ్పీటీసీగా గెలిచిన చమన్ ఏకంగా జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపై కూర్చున్నారు.
రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీల పగ్గాలు మనకే
2014లో రెండు జాతీయ పార్టీలకు రాష్ట్ర సారథులుగా ‘అనంత’ నేతలు ఎంపికయ్యారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)అధ్యక్ష పదవి తొలిసారి అనంత వాసికి దక్కింది. మాజీ మంత్రి రఘువీరారెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పగ్గాలు రామకృష్ణ చేతికి ఇచ్చారు. ఈ పదవి జిల్లాకు దక్కడం ఇది రెండోసారి. గతంలో నీలం రాజశేఖరరెడ్డి కూడా రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు.
హిందూపురంలో మళ్లీ నందమూరి కుటుంబం
హిందూపురం అసెంబ్లీ బరిలో సుదీర్ఘ విరామంత తర్వాత మళ్లీ నందమూరి కుటుంబం నిలిచింది. గతంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు, ఆయన తనయుడు హరికృష్ణలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. తర్వాత బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో బాలకృష్ణ మాత్రమే ఒక్కరోజూ కూడా హాజరుకాని ఎమ్మెల్యేగా రికార్డుకెక్కారు.
తొలిసారి కాంగ్రెస్‌కు చావు దెబ్బ
జిల్లాలోని 14 అసెంబ్లీల్లో ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడం ఇదే ప్రథమం. 2004, 09 ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్, 2014 సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. పీసీసీ అధ్యక్షుని హోదాలో పెనుకొండ అసెంబ్లీ బరిలో దిగిన రఘువీరా సైతం ఓటమిపాలయ్యారు. మంత్రి శైలజానాథ్ కూడా భారీ ఓటమిని మూటగట్టుకున్నారు.
జిల్లాకు రెండు మంత్రి పదవులు
2013లో జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిథ్యం వహించినట్లే..2014లో కూడా పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత మంత్రులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరితో పాటు కాలువ శ్రీనివాసులు చీఫ్ విప్‌గా, యామినీ బాల విప్‌లుగా కొనసాగుతున్నారు. ‘అనంత’నగర పాలక సంస్థ పీఠాన్ని తొలిసారి మహిళ అధిరోహించింది. టీడీపీలో సామన్య కార్యకర్తగా ఉన్న మదమంచి స్వరూపను ఊహించని విధంగా మేయర్ పదవి వరించింది.
అనూహ్య మార్పు
Published Wed, Dec 31 2014 2:39 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement