రండి బాబూ రండి
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు అభ్యర్థులు కరువు
మాజీ మంత్రులు రంగంలోకి దిగినా స్పందన శూన్యం
సమరానికి సై అంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు
మున్సిపల్ చైర్మన్ టిక్కెట్లు ఇస్తాం... జడ్‌పీటీసీ టికెట్లు ఇస్తాం... ఎంపీటీసీ టికెట్లు ఇస్తాం...రండి బాబూ రండి.. ఇదీ జిల్లాలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పరిస్థితి. 2005 స్థానిక ఎన్నికల సమయంలో టికెట్ల కోసం పెద్ద ఎత్తున సిఫార్సులు, లాబీయింగ్‌ల కోసం కాంగ్రెస్‌పార్టీ నాయకులు క్యూలు కట్టేవారు. ఇప్పుడు పిలిచి టికెట్ ఇస్తామన్నా తీసుకొనే నాథుడే లేడు. అప్పట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చరిష్మాతో రాష్ట్రంలో జరిగిన మున్సిపల్, ప్రాదేశికపోరులో టీడీపీ సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ దూకుడుకు కాంగ్రెస్, టీడీపీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
అరండల్‌పేట, న్యూస్‌లైన్
జిల్లాలోని 12 పురపాలక సంఘాలకు, 57 జడ్‌పీటీసీ, 913 ఎంపీటీసీ స్థానాలకు నెలరోజుల వ్యవధిలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్, టీడీపీలకు అభ్యర్థులు కరువయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. గుంటూరు, తెనాలి డివిజన్‌లలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత తీసుకున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రేపల్లె, తెనాలి, పొన్నూరు మంగళగిరి, తాడేపల్లి, బాపట్ల పట్టణాల్లో తిరిగినా కార్యకర్తలు అందుబాటులోకి రాలేదు సరికదా పోటీకి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. పురపాలక సంఘాలకు అభ్యర్థులు దొరకనిస్థితిలో స్వతంత్ర అభ్యర్థులను తమ వారిగా చెప్పుకోవచ్చనే భావనలో కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు మున్సిపల్ ఎన్నికలు రావడంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. అదే సమయంలో తెనాలిలో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారన్న అనుమానంతో నంబూరి వెంకటకృష్ణమూర్తి అనే నాయకుడిని కాంగ్రెస్‌పార్టీ విజయవాడకు తరలించి క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. అలాగే నరసరావుపేటలో మార్కెట్ యార్డు వైస్‌చైర్మన్ బూర్లగడ్డ గురుస్వామి కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఇది నరసరావుపేట బాధ్యతలు తీసుకున్న మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డికి గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.
టీడీపీకి తలకు మించిన భారం... మరోవైపు తెలుగుదేశం పార్టీకి సైతం పురపాలక సంఘాల్లో చైర్మన్లు, వార్డు సభ్యుల ఎంపిక తలకు మించిన భారంగా మారింది. ముఖ్యంగా పొన్నూరు మున్సిపల్ చైర్మన్‌గా సజ్జా హేమలతను ఎంపిక చేయడాన్ని అక్కడి కార్యకర్తలు తీవ్రంగా విభేదిస్తున్నారు. అదే విధంగా మాచర్ల, గురజాల, వినుకొండ, మంగళగిరి, రేపల్లెల్లో ఇప్పటి వరకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు. బాపట్లకు సంబంధించి ఐదుగురు నాయకులతో కమిటీని జిల్లా పార్టీ ఏర్పాటు చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావుకు సైతం చిలకలూరిపేటలో ఎదురుగాలి తప్పలేదు. కనీసం ఆయన సొం త నియోజకవర్గంలో సైతం అభ్యర్థులను ఖరారు చేసుకోలేకపోయారు.
క్యూ కడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు.. ఇదిలావుంటే, మున్సిపల్, జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున అభ్యర్థులు క్యూ కడుతున్నారు. తమకు తెలిసిన వారితో పార్టీ నాయకులకు సిఫార్సులు సైతం చేయిస్తున్నారు. మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల సమరానికి సై అంటుంటే కాంగ్రెస్, టీడీపీలు పోటీకి నై అంటున్నాయి.