మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి గెలుపుగుర్రాల వేట ప్రారంభమైంది. చిత్తూరు కార్పొరేషన్, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు మున్సిపాల్టీల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
మున్సిపాల్టీల ఎన్నికలు మార్చి 30న జరగనున్నాయి. ఈ నెల 10 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అభ్యర్థుల ఎంపికకు సమయం చాలా తక్కువగా ఉంది. మున్సిపాల్టీల్లో అభ్యర్థుల ఎంపికకు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నవారు రంగంలోకి దిగారు.
అభ్యర్థులను ఎంపిక చేయడం రాజకీయ పార్టీలకు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు కత్తిమీద సాములా మారింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై మున్సిపల్ ఎన్నికల ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. దీంతో తాము ఎంపిక చేయదలచిన అభ్యర్థుల చరిత్ర, ప్రజలతో సత్సంబంధాలు, గెలుపు అవకాశాలు తదితర కోణాల నుంచి నేతలు విశ్లేషణలు ప్రారంభించారు.
కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువు
రాష్ట్ర విభజన ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. పోటీ ప్రధానంగా వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ మధ్యే సాగనుంది. చిత్తూరు కార్పొరేషన్, ఆరు మున్సిపాల్టీల్లో నిలబడేందుకు కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరకడం లేదు. చిత్తూరులో మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దిగేవారు కాంగ్రెస్ నుంచి పోటీచేయూలా లేదా స్వతంత్రంగా బరిలో ఉండాలా అనేది ఇంకా నిర్ణయం కాలేదు.
చాలా వార్డుల్లో కాంగ్రెస్ తరఫున నిలబడేందుకు మాజీ కౌన్సిలర్లు, కొత్త అభ్యర్థులు ఇష్టపడడం లేదు. పుత్తూరు, నగరి మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ నుంచి కాకుండా స్వతంత్ర అభ్యర్థులుగానే బరిలోకి దిగాలని మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి తన అనుచరులకు సూచించినట్లు సమాచారం. మదనపల్లె మున్సిపాల్టీల్లో మార్కెట్‌యార్డు కమిటీ చైర్మన్‌గా ఉన్న వ్యక్తి టీడీపీలో చేరి మున్సిపల్ చైర్మన్‌గా పోటీ పడాలని రంగం సిద్ధం చేసుకున్నారు. పలమనేరు మున్సిపాల్టీలోనూ కాంగ్రెస్ అన్ని వార్డుల్లో అభ్యర్థులను పెట్టే పరిస్థితి లేదు. శ్రీకాళహస్తి, మదనపల్లె, పుంగనూరుల్లో కాంగ్రెస్ తరపున కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కొత్తగా డీసీసీ అధ్యక్షుడుగా నియమితులైన వేణుగోపాల్‌రెడ్డికి ఒక రకంగా ఇది పరీక్షే.
మహిళా అభ్యర్థుల కోసం వెతుకులాట
జిల్లాలో అన్ని మున్సిపాల్టీల్లో సగం కౌన్సిలర్ స్థానాలను మహిళలకు కేటాయించారు. దీంతో రాజకీయ పార్టీలు మహిళా అభ్యర్థుల కోసం వేట ప్రారంభించాయి. ఈ క్రమంలో ఐకేపీ గ్రూప్‌ల్లో చురుకుగా ఉన్న మహిళలు, వార్డు సమస్యలపై నిరంతరం పనిచేస్తున్న మహిళ గ్రూప్ లీడర్లకు డిమాండ్ పెరిగింది. అన్ని పార్టీలు ఐకేపీ మహిళల వైపు చూస్తున్నాయి. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లలో మహిళ రిజర్వుడు స్థానాలకు సరైన అభ్యర్థులను వెతకడమూ రాజకీయ పార్టీలకు సమస్యగా మారింది.